మహిళా సంరక్షణ కార్యదర్శికి పోలీస్‌ డ్రెస్‌  | Police Status To Women Safety Employees In Village Secretariats In AP | Sakshi
Sakshi News home page

ఇకపై మహిళా సంరక్షణ కార్యదర్శికి పోలీస్‌ డ్రెస్‌ 

Dec 26 2020 8:55 AM | Updated on Dec 26 2020 10:17 AM

Police Status To Women Safety Employees In Village Secretariats In AP - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శులు ఇకపై పోలీసు యూనిఫాంలో విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగులను అధికారికంగా మహిళా పోలీసు అని పిలుస్తారు. ఇందుకు సంబంధించి వారం పది రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువరించేందుకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఫైల్‌ను సిద్ధం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11,162 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాల్లో ఒక్కో దాంట్లో ఒకరు చొప్పున మహిళా సంరక్షణ కార్యదర్శి ఉన్నారు.

మొత్తం 14,948 పోస్టులకు గాను 13,677 పోస్టులను ఈ ఏడాది జనవరి నాటికే భర్తీ చేశారు. మిగతా పోస్టుల భర్తీ ప్రక్రియ (రెండో విడత నోటిఫికేషన్‌లో) ప్రస్తుతం జిల్లాల్లో కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు 1,100 మందికి నియామక పత్రాలు జారీ చేశారు. కాగా, ఇప్పటికే పలు సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శులు.. ఆయా సచివాలయాల పరిధిలో పాఠశాలలు, కాలేజీల్లో మహిళల రక్షణ, సైబర్‌ క్రైం, రోడ్డు సేప్టీ తదితర అంశాలపై పని చేస్తున్నారు. వరకట్న, లైంగిక వేధింపుల నియంత్రణతో పాటు మద్యపాన నియంత్రణ చర్యలలో భాగంగా బెల్ట్‌షాపులు, నాటుసారాను అరికట్టడం వంటి చర్యలలో పాలుపంచుకుంటున్నారు.  

అక్రమార్కుల్లో భయం పెరుగుతుంది.. 
మూడు రోజుల క్రితం గ్రామ, వార్డు సచివాలయాల శాఖపై జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌.. మహిళా సంరక్షణ కార్యదర్శులకు పోలీసు యూనిఫాం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. వారు పోలీసు యూనిఫాం ధరించి విధులు నిర్వర్తించడం ద్వారా స్థానికంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిలో కొంత భయం ఏర్పడుతుందని చెప్పారు. తద్వారా ఉద్యోగులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించే అవకాశం ఉంటుందని అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటి దాకా మహిళా సంరక్షణ కార్యదర్శి పేరుతో పిలిచే ఈ ఉద్యోగులందరినీ ఇక నుంచి అధికారికంగానే ‘మహిళా పోలీసు’ అని పిలవాలని సీఎం ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖ చర్యలకు ఉపక్రమించింది.  

మిగిలిన ఉద్యోగులకూ వేర్వేరు యూనిఫాం  
గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల ఉద్యోగులు పని చేస్తున్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శికి పోలీసు యూనిఫాం కేటాయించిన మాదిరే మిగిలిన ఉద్యోగులందరికీ వారి వారి విధుల ఆధారంగా వేర్వేరుగా యూనిఫాం కేటాయించే విషయం పరిశీలించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. అయితే, మిగిలిన ఉద్యోగులలో ఎవరికి ఏ రకమైన యూనిఫాం కేటాయించాలన్న దానిపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్‌ నవీన్‌కుమార్‌ ‘సాక్షి’కి తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement