గ్రామ స్వరాజ్యం.. సచివాలయాలతో సాకారం  | Providing services to village and ward secretaries on Republic Day | Sakshi
Sakshi News home page

గ్రామ స్వరాజ్యం.. సచివాలయాలతో సాకారం 

Published Mon, Jan 27 2020 4:01 AM | Last Updated on Mon, Jan 27 2020 4:54 AM

Providing services to village and ward secretaries on Republic Day - Sakshi

తన భూమికి సంబంధించిన 1బీ ధ్రువపత్రాన్ని చూపుతున్న ఈ రైతు పేరు కురబ మంజునాథ్‌. ఇతడిది అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం తూర్పు కోడిపల్లి. గ్రామంలో సర్వే నం.90లో 3 ఎకరాల భూమి ఉంది. భూమి 1బీ ధ్రువపత్రం, అడంగల్‌ కోసం ఆదివారం గ్రామ సచివాలయానికి వచ్చాడు. రైతు అడిగిన ధ్రువపత్రాలను అక్కడి సిబ్బంది వెంటనే అందించారు. దీంతో మంజునాథ్‌ ఆనందానికి హద్దుల్లేవు. గతంలో కల్యాణదుర్గం వెళ్లి గంటల తరబడి వేచి చూసినా జరగని పనులు ఇప్పుడు తమ గ్రామంలోనే వెంటనే జరగుతుండటంతో సంతోషంగా ఉందని చెప్పాడు. 

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని వెంకట్రాజుపురం ప్రజలు ఏ పనులు కావాలన్నా 32 కిలోమీటర్ల దూరంలోని గ్రామ పంచాయతీకి, లేదంటే 42 కిలోమీటర్ల దూరంలోని మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఉదయం 6 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు తిరిగి ఇళ్లకు చేరుకునేవారు. ఇప్పుడు వెంకట్రాజుపురంలో గ్రామ సచివాలయం ఏర్పాటైంది. సొంత గ్రామంలోనే అన్ని ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేషన్‌కార్డు కోసం ఆదివారం గ్రామ సచివాలయంలో దరఖాస్తులు అందజేశారు.

సాక్షి, అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా విప్లవాత్మకమైన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గణతంత్ర దినోత్సవం రోజునే రాష్ట్ర ప్రజలకు వారి సొంత గ్రామాల్లోనే 536 రకాల ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొత్తం 15,002 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా, ఆదివారం నుంచి 14,487 సచివాలయాల్లో ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి లేకుండా ప్రభుత్వ సేవలు అందుతుండడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండల, జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థ తప్పిందని చెబుతున్నారు. సమయం, డబ్బు ఆదా అవుతోందని పేర్కొంటున్నారు. 

ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ ఫలాలు 
రాష్ట్రంలో కోటిన్నర దాకా కుటుంబాలు ఉండగా, అందులో గ్రామీణ ప్రాంతాల్లోనే కోటి కుటుంబాలు నివసిస్తున్నాయి. 70 ఏళ్లుగా ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందిన దాఖలాలు లేవు. పథకాలను ప్రజల ముంగిటకు చేర్చే అధికార యంత్రాంగం లేకపోవడమే ఇందుకు కారణం. ఫలితంగా సామాజిక సూచికలు.. పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్య, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం తదితర అంశాల్లో ఆశించిన ప్రగతి సాధ్యం కాలేదు. ఇలాంటి పరిస్థితిని మార్చాలంటే పరిపాలనను ప్రతి గడప వద్దకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిపాలన వికేంద్రీకరణకు పూనుకున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే గ్రామ, వార్డు స్థాయిలో పనిచేసేందుకు 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. వాటి భర్తీ ప్రక్రియను సైతం స్వల్ప వ్యవధిలోనే విజయవంతంగా పూర్తి చేశారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వ పథకాల ఫలాలను ప్రతి లబ్ధిదారుడికి అందించాలన్న లక్ష్యంతో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మరో 2.80 లక్షల మంది వలంటీర్లను నియమించారు. 
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామ సచివాలయంలో దరఖాస్తుదారుడికి సదరం సర్టిఫికెట్‌ అందజేస్తున్న సిబ్బంది   

ఫిర్యాదుల పరిష్కారానికి ‘స్పందన’ 
ఎక్కడి సమస్య అక్కడే పరిష్కారం కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. 80 శాతానికి పైగా ప్రజా సమస్యలను గ్రామ పంచాయతీ స్థాయిలోనే పరిష్కరించాలని.. ప్రజలు మండల, జిల్లా కేంద్రాల్లో ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని ఆదేశించారు. ముఖ్యమంత్రి సంకల్పానికి అనుగుణంగానే గ్రామ–వార్డు సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థతో ప్రజలకు ప్రభుత్వ సేవలు ఇక వారి గ్రామాల్లోనే అందుబాటులోకి వచ్చాయి. అలాగే ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా గ్రామ–వార్డు సచివాలయాల్లో ప్రతిరోజూ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఈ ఫిర్యాదులను అధికారులు ఏ మేరకు పరిష్కరించారన్న దానిపై ప్రభుత్వం ప్రతివారం సమీక్ష నిర్వహించనుంది. 

మహిళా రక్షణకు పెద్దపీట 
రాష్ట్రంలో మహిళల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. పాలన వికేంద్రీకరణ ప్రక్రియలో భాగంగా ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో ఒకరు చొప్పున మహిళా పోలీసులను నియమించింది. ప్రతి 2,000–5,000 మంది జనాభాకు ఒక మహిళా పోలీసు నిత్యం అందుబాటులో ఉంటారు. గ్రామ, వార్డు స్థాయిలో స్థానిక మహిళలు ఎదుర్కొనే సమస్యలకు స్థానికంగానే పరిష్కారం చూపుతారు. 

లంచాల బెడదకు అడ్డుకట్ట పడినట్టే.. 
ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనంపై ప్రజలు విసుగెత్తిపోయారు. గ్రామ, వార్డు సచివాలయాలతో లంచాల బెడదకు దాదాపు అడ్డుకట్ట పడినట్టే. ఎవరైనా ఊళ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి వద్దకు వెళ్లి పని చేసి పెట్టాలని దరఖాస్తు అందజేస్తే కాదనలేని పరిస్థితి ఉంటుంది. ఇక మండల, జిల్లా కేంద్రాల చుట్టూ తిరిగే అవసరం ఉండదు. మండల, జిల్లా కేంద్రాల్లోని అధికారులు వాళ్లు చేయాల్సిన పనిని మరింత సమర్థవంతంగా చేసే వీలుంటుంది.
    – చంద్రమౌళి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రిటైర్డు కమిషనర్‌ 

గ్రామాల రూపురేఖలే మారిపోతాయి 
గ్రామ సచివాలయ వ్యవస్థతో గ్రామాల రూపురేఖలే మారిపోతాయి. గతంలో ప్రజలు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అధికారులే ప్రజల చుట్టూ తిరుగుతున్నారు. ఇళ్ల వద్దకొచ్చి సమాచారం తీసుకుంటున్నారు. కావాల్సిన పనులు చేసి పెడుతున్నారు. అవినీతికి ఆస్కారమే లేదు. అధికార వికేంద్రీకరణ దిశగా ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ గొప్ప ముందడుగు.    
– చిత్తరవు నాగేశ్వరరావు, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది, బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ 

గ్రామ స్వరాజ్యం వచ్చింది
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల వద్దకే నిజమైన పాలన తెచ్చారు. గ్రామ స్వరాజ్యం అందుబాటులోకి వచ్చింది. సచివాలయాలతో ప్రజల కష్టాలు తీరాయి. ఇక్కడ మా సమస్యలకు పరిష్కారం పొందే అవకాశం కల్పించడం సంతోషకరం. 
    – శ్యామసుందర్‌రెడ్డి, యు.రాజుపాలెం, వైఎస్సార్‌ జిల్లా

సమయం, డబ్బు ఆదా
మా ఊళ్లో గ్రామ సచివాలయం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. 1బీ అండగల్, 1బీ సవరణ, వెబ్‌ల్యాండ్‌తోపాటు ప్రతి పనికీ మండల కేంద్రమైన కణేకల్లుకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడా సమస్య లేదు. సమయం వృథా కాదు. బస్సు, ఆటో చార్జీలు, భోజనాల ఖర్చులు తప్పుతాయి. మా గ్రామంలోనే అన్ని పనులు జరిగిపోతున్నాయి.     
– అనంతమ్మ, బెణికల్లు అనంతపురం జిల్లా

దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట
ప్రభుత్వ పథకాలు పొందాలంటే దళారులను ఆశ్రయించాల్సి వచ్చేది. ప్రతి పనికీ డబ్బులు వసూలు చేసేవారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయాల వల్ల దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట పడుతుంది. వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ప్రతి పనినీ ఉచితంగా చేయించుకోవచ్చు.
    – దారంశంకర్, గుంటూరు

కష్టాలు తప్పుతాయి
ఇంతకుముందు ఏ పని కావాలన్నా పంచాయతీ, తహసీల్దార్, మండల పరిషత్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు మేం ఉండే ప్రాంతానికి దగ్గర్లోనే సచివాలయం ప్రారంభించడం సంతోషంగా ఉంది. రేషన్‌ కార్డు కావాలన్న, పింఛన్‌ కావాలన్న మీ సేవ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టాలు తప్పుతాయి.
– జొన్నాడ వెంకటరమణ, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా

నిజమైన ప్రజా పాలనకు నాంది
గ్రామ సచివాలయాలు నిజమైన ప్రజా పాలనకు నాంది పలుకుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం వేలాది ఉద్యోగాలు భర్తీ చేశారు. ఆయన పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. 
    – ఎన్‌ నాగప్రసాద్, బందరు మండలం, కృష్ణా జిల్లా

మంచి విధానమిది
ఇంతకుముందు ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. దళారులు దోచేసేవారు. సచివాలయాల వల్ల అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఖర్చు లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా పనులు చేయించుకోవచ్చు. చాలా మంచి విధానమిది.
    – బర్మా వెంకట లలిత కుమారి, బందరు మండలం, కృష్ణా జిల్లా

చారిత్రక నిర్ణయం
దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటికి తీసుకురావడం చారిత్రక నిర్ణయమే. ఇక ఏ ఒక్క లబ్ధిదారుడూ కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు శ్రమకోర్చి వెళ్లాల్సిన పని లేదు. సేవలను ప్రజలకు దగ్గరకు చేర్చిన సచివాలయ వ్యవస్థ చరిత్ర సృష్టిస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి మంచి గుర్తింపు వస్తుంది.
    – డాక్టర్‌ వడిశెట్టి గాయత్రి, మహిళా సైంటిస్ట్, పిఠాపురం, తూ.గోదావరి

కలలో కూడా ఊహించలేదు
ఇలాంటి గొప్ప పాలన వస్తుందని కలలో కూడా ఊహించలేదు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా సామాన్యుల బాధలు పట్టించుకునేవారు కాదు. వ్యయప్రయాసలకోర్చి 10 కిలోమీటర్లు దూరంలోని మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బాధలు తగ్గాయి.
    – ఈశ్వర్‌రెడ్డి, రైతు, గోపిదిన్నె, చిత్తూరు జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement