ఔరా అభిమన్యూ.. ఎంత పని చేశావురా! | Unemployed Youth Cheated In Name Of Govt Jobs in srikakulam | Sakshi
Sakshi News home page

ఔరా అభిమన్యూ.. ఎంత పని చేశావురా!

Published Thu, Mar 23 2017 6:19 PM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM

ఔరా అభిమన్యూ.. ఎంత పని చేశావురా!

ఔరా అభిమన్యూ.. ఎంత పని చేశావురా!

► నిరుద్యోగులకు టోకరా!
► మాయగాడిని చుట్టుముట్టిన బాధితులు
► రూ. కోటికిపైగా కుచ్చుటోపీ..


రాజాం : అతడిది ఈ ఊరు కాదు.. కనీసం ఇక్కడేదో ఉద్యోగం, వ్యాపారం వెలగబెడుతున్నాడంటే అదీ లేదు. అలా అని పెద్ద వ్యక్తి కూడా కాదు.. అయినప్పటికీ ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 50 మంది వరకు నిరుద్యోగులు అతని మాయలో పడ్డారు. రూ. కోటికిపైగా ముడుపులు చెల్లించారు. తీరా ఉద్యోగం రాకపోవడంతో అతడి ఇంటికి చేరుకొని ఆందోళనకు దిగారు. విషయం బయటకు రావడంతో నిందితుని బంధువులు రాజాం చేరుకొని బాధితులతో మంతనాలు జరుపుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.

రాజాంలోని నాగావళి ఐటీఐ సమీపంలో నివాసం ఉంటున్న అభిమన్యు అనే యువకుడు షార్ట్‌ఫిల్మ్‌లు తీస్తుంటాడు. ఇతని సొంత ఊరు కూడా ఎక్కడనేది తెలియదు. షార్ట్‌ఫిల్మ్‌లతో యువతకు దగ్గరయ్యాడు. తనకు పెద్దలతో పరిచయం ఉందని నమ్మబలికాడు. ఉద్యోగాలు కూడా వేయిస్తుంటానని చెప్పాడు. ఫలితంగా రాజాం, పాలకొండ, ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాల నిరుద్యోగులతోపాటు ఒడిశా రాష్ట్రానికి చెందిన పలువురు ఈయన మాయలో పడ్డారు. ప్రధానంగా రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రకటించడంతో.. రైల్వే పరీక్షలు రాసిన నిరుద్యోగులు కూడా అతని వద్దకు క్యూ కట్టారు. ఒకరికి తెలియకుండా ఒకరు రూ.లక్షల్లో ముడుపులు చెల్లించారు. 50 మందికిపైగా బాధితులు రూ. కోటికిపైగా చెల్లింపులు జరిపినట్లు సమాచారం. అయితే గడువు దాటినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడం, మరోవైపు వీరితోపాటు పరీక్షలు రాసిన కొంతమందికి ఉద్యోగాలు రావడంతో ముడుపులు చెల్లించిన వారికి అనుమానాలు అధికమయ్యాయి. ఈ నిరుద్యోగులకు చెందిన కొంతమంది తల్లిదండ్రులు పొలం పుట్రా తాకట్టుపెట్టి రూ.లక్షల్లో చెల్లింపులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. వీరంతా ఉద్యోగాలు రాకపోవడంతో తాము చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇమ్మని అభిమన్యుపై ఒత్తిడి తీసుకువచ్చారు. తాను తీసుకున్న డబ్బు వేరే వ్యక్తికి ఇచ్చే వాడినని, తనకు కూడా ఏమీ తెలియదని, రెండు రోజులు గడువు కావాలని చెప్పుకుంటూ రోజులు నెట్టుకొచ్చాడు. చివరికి విసుగు చెందిన నిరుద్యోగ బాధితులతోపాటు వారి బంధువులు కొంతమంది బుధవారం రాజాం చేరుకొని అభిమన్యు నివాసం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది పెద్ద మనుషులు అభిమన్యుతో మాట్లాడినప్పటికీ.. తన వద్ద పైసా కూడా లేదని, ఏమీ చేయలేనని చేతులెత్తేశాడు.

ఆందోళనలో బాధితులు..: ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటకు వచ్చి.. మీడియాకు చేరింది. రాజాంకు చెందిన పలువురు మీడియా ప్రతినిధులు అభిమన్యు నివాసం వద్దకు చేరుకోగా.. బాధితులు కాస్తంత ఆందోళనకు గురయ్యారు. మీడియా దృష్టిలో పెట్టినప్పటికీ తమకు ఫలితం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగం ఎలాగూ ఇప్పించలేడని, కనీసం నష్టపోయిన మొత్తాన్ని అయినా తిరిగి చెల్లించే వరకు మీడియా సహకరించాలని కోరారు.

నట్టేట ముంచాడు..: ఉద్యోగాలు ఇస్తామన్న అభిమన్యు వలలో చాలా మంది నిరుపేదలు పడ్డారు. ఉద్యోగం ఇవ్వలేకుంటే తాము ఇచ్చిన డబ్బుకు వడ్డీ ఇస్తామని, డబ్బులకు బాండ్లు కూడా ఇస్తామని అభిమన్యు నమ్మబలకడమే కాకుండా.. బాండ్లు రాసివ్వడంతో అధికంగా నిరుద్యోగులు ఈయన మాయలో చిక్కుకున్నారు. చివరకు ఆ బాండ్లు కూడా పట్టించుకోకుండా బాధితులను నట్టేట ముంచాడు. తనకేమీ తెలియదని అభిమన్యు తప్పించుకోవడంతో ప్రస్తుతం బాధితులతోపాటు వారి బంధువులు కూడా దిగాలు చెందుతున్నారు. ఇంత చదువు చదివి ఇలాంటి మాయలో పడ్డామేమిటని నిరుద్యోగులు వాపోతున్నారు. అయితే ఈ విషయంపై పోలీసులకు బుధవారం సాయంత్రం వరకు ఎటువంటి సమాచారమూ లేకపోవడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement