న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీల వర్గాలకు చెందిన ఒక వ్యక్తి కులాన్ని వేరే రాష్ట్రంలోను అదే వర్గంగా గుర్తిస్తే తప్ప ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా ప్రవేశాల్లో రిజర్వేషన్ల లబ్ధి పొందలేరంటూ సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. ఈ మేరకు జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఏ శంతన గౌడర్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్‌ల రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించింది. అదే సమయంలో ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర రిజర్వేషన్ విధానం అమలు చేయవచ్చని స్పష్టం చేసింది.
‘ఒక రాష్ట్రంలో ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఉద్యోగం, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన అంశాల్లో ఆ రాష్ట్రంలో అతనిని ఎస్సీ, ఎస్టీగా పరిగణించకూడదు. దాని వల్ల సొంత రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు వారికోసం ఉద్దేశించిన రిజర్వేషన్ల ప్రయోజనాలు కోల్పోతారు’ అని ధర్మాసనం పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి కులాన్ని వేరే రాష్ట్రంలో అదే వర్గంగా గుర్తించని పక్షంలో అతను ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ కోరవచ్చా? అని దాఖలైన 8 పిటిషన్లను విచారించిన అనంతరం సుప్రీం కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.
‘ఒక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలుగా గుర్తింపు పొందితే వారికి వేరే రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో తప్పనిసరిగా అదే హోదా ఉండాల్సిన అవసరం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక కులం లేదా తెగను ఏ రాష్ట్రంలోనైనా ఎస్సీ, ఎస్టీల జాబితాలో చేర్చేందుకు అర్హతను ఆ ప్రాంత పరిస్థితులు, ప్రతికూలతలు, ఆ వర్గం ఎదుర్కొంటున్న సామాజిక ఇబ్బందులపై ఆధారపడి పరిగణనలోకి తీసుకుంటారని ధర్మాసనం వెల్లడించింది.
‘ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి మహారాష్ట్రలో రిజర్వేషన్ లబ్ధి పొందితే మహారాష్ట్రలోని ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తికి ఆ రాష్ట్రం కేటాయించిన రిజర్వేషన్ ఫలాన్ని దక్కకుండా చేయడమే’ అని పేర్కొంది. అయితే వేరే రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీలు ఢిల్లీలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు అర్హులని సుప్రీంకోర్టు తెలిపింది. ఢిల్లీ విషయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర రిజర్వేషన్ విధానం వర్తిస్తుందని నలుగురు న్యాయమూర్తులు స్పష్టం చేయగా జస్టిస్ భానుమతి వారితో విభేదించారు. ‘కేంద్ర పాలిత ప్రాంతంలోని ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం కిందకు వచ్చినప్పటికీ అవన్నీ కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఉంటాయి. యూనియన్ ఆఫ్ ఇండియా నియంత్రణలో ఉండవు’ అని తన తీర్పులో జస్టిస్ భానుమతి అభిప్రాయపడ్డారు.
రిజర్వేషన్లకు వెనుకబాటు గీటురాయి కాదు
ఉద్యోగ పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల అంశంలో వెనుకబాటుతనాన్ని కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి సరైన ప్రాతినిథ్యం లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లపై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలుకు షరతులు విధిస్తూ 2006లో సుప్రీం తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవరించేందుకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలువురు సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశారు. విచారించిన రాజ్యాంగ బెంచ్ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
2006 నాటి తీర్పును సమీక్షించండి
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేముందు ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి సరైన ప్రాతినిధ్యం లేకపోవడం తదితర అంశాలకు సంబంధించి అవసరమైన సమాచారం సమర్పించాలని 2006 నాటి ఎం.నాగరాజ్ కేసులో రాష్ట్రాలకు సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పును పునః సమీక్షించాలని కేంద్రం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంను కోరాయి.
Comments
Please login to add a commentAdd a comment