పేదల కోటాపై స్టేకు సుప్రీం నో | Supreme Court Agrees To Examine Ebc Reservation Bill And Says No To Stay | Sakshi
Sakshi News home page

పేదల కోటాపై స్టేకు సుప్రీం నో

Published Sat, Jan 26 2019 5:01 AM | Last Updated on Sat, Jan 26 2019 11:04 AM

Supreme Court Agrees To Examine Ebc Reservation Bill And Says No To Stay - Sakshi

న్యూఢిల్లీ: జనరల్‌ కేటగిరీలోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో ఇటీవల కల్పించిన 10 శాతం రిజర్వేషన్ల అమలును నిలుపుదల చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కానీ ఈ కోటాకు వీలుకల్పిస్తున్న రాజ్యాంగ సవరణ చట్ట చెల్లుబాటును పరిశీలించేందుకు అంగీకరించింది. 10 శాతం రిజర్వేషన్ల అమలు నిర్ణయాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వ స్పందన కోరుతూ బెంచ్‌ శుక్రవారం నోటీసులు జారీచేసింది. జనహిత అభియాన్, యూత్‌ ఫర్‌ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద సంస్థలు ఈ పిటిషన్లను వేశాయి. ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదిస్తూ..ఈ పిటిషన్లకు విచారణార్హత లేదని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందేందుకు ఆర్థిక స్థితిగతులు మాత్రమే ప్రాతిపదిక కావొద్దని యూత్‌ ఫర్‌ ఈక్వాలిటీ తన పిటిషన్‌లో పేర్కొంది. 50 శాతమే ఉండాలన్న రిజర్వేషన్ల పరిమితిని తాజా చట్టం ఉల్లంఘిస్తోందని గుర్తుచేసింది.

‘ఎస్సీ/ఎస్టీ చట్ట సవరణ’పై యోచన
ఎస్సీ, ఎస్టీ(సవరణ) వేధింపుల నిరోధక చట్టం–2018పై కేంద్ర ప్రభుత్వ సమీక్షతోపాటు, ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలించనున్నట్లు కోర్టు తెలిపింది. ఎస్సీ/ఎస్టీ వేధింపుల చట్టం తీవ్రంగా దుర్వినియోగం అవుతోందనీ, ఈ చట్టం కింద దాఖలైన ఫిర్యాదులపై తక్షణం ప్రభుత్వ ఉద్యోగులను కానీ ఇతరులను కానీ అరెస్టు చేయరాదంటూ గత ఏడాది కోర్టు ఆదేశాలిచ్చింది. మరోవైపు, క్రెడిట్, డెబిట్‌ కార్డులను ఉపయోగించినప్పు డు జరిగే ఫెయిల్డ్‌ ట్రాన్సాక్షన్స్‌లలో డబ్బు వెంటనే వాపసు అయ్యేలా చూడాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే, పిటిషనర్‌ ముందుగా ఈ సమస్యను ఆర్‌బీఐ దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement