ముంబై: ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు ఉన్నాయంటూ పత్రికల్లో ప్రకటనలు జారీ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఈ అంశానికి సంబంధించి పలు పిటిషన్లు కోర్టులో పెండింగ్‌లో ఉన్నా కూడా ఎలా జారీ చేస్తారని తీవ్రంగా మందలించింది. ఇలాంటి బాధ్యతా రాహిత్యమైన చర్యలు మానుకోవాలని, పిటిషన్లను పరిష్కరించేందుకు కోర్టుకు కాస్త సమయం ఇవ్వాలని మండిపడింది. మరాఠాలకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ ఉందని తెలిసి కూడా ఆదరాబాదరగా ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నరేశ్ పాటిల్, న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ కర్ణిక్‌లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపడుతూ బాంబే హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్) ఇటీవల దాఖలయ్యాయి. మరాఠాలకు రిజర్వేషన్లపై మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటనలు జారీ చేసిందని పిల్ దాఖలు చేసిన న్యాయ వాది గుణరతన్ సదావర్తి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే మరాఠాల కోసం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతిని ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిందని చెప్పారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది వీఏ థొరాట్ వాదనలు వినిపిస్తూ.. ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులు మాత్రమే ఆహ్వానించామని, పరీక్ష 2019 జూలైలో ఉంటుందని వివరించారు. అయితే ప్రకటన ఇవ్వాల్సిన తొందరేం వచ్చిందని, ఇందుకు కొద్ది రోజులు ఆగి ఉండాల్సిందంటూ కోర్టు మందలించింది. సాంకేతికంగా ప్రభుత్వానిది తప్పు కాదని, అయితే ఈ సమస్య తీ వ్రత దృష్ట్యా ప్రభుత్వం వేచి చూడాల్సి ఉందన్నారు.
పిల్ వేసిన న్యాయవాదిపై దాడి..
మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది గుణరతన్ సదావర్తిపై హైకోర్టు వెలుపల దాడి జరిగింది. మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసు అధికారులు తెలిపారు. మరాఠా వర్గానికి చెందిన ఓ వ్యక్తి గుంపులో నుంచి ముందుకు దూసుకొచ్చి ‘ఒక్క మరాఠా లక్షమంది మరాఠాలు’అని నినాదాలు చేస్తూ న్యాయవాదిని కత్తితో పొడిచాడని వివరించారు. అయితే అక్కడున్న న్యాయవాదులు, పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు జల్నా జిల్లాకు చెందిన వైజయంత్ పాటిల్‌గా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment