సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని గ్రూప్–4 ఉద్యోగాల భర్తీపై గందరగోళం మరింత పెరిగింది. ప్రకటించిన తేదీనాటికి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో ఆందోళనలో ఉన్న అభ్యర్థులకు.. డిసెంబర్ 30న అర్ధరాత్రి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వెబ్‌సైట్లో పెట్టిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య తక్కువగా ఉండటం అయోమయంగా మారింది. నిజానికి డిసెంబర్ ఒకటిన టీఎస్‌పీఎస్సీ 9,168 గ్రూప్–4 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. కానీ 8,039 పోస్టులతోనే పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం.
వాయిదాతో గందరగోళం మొదలై..: టీఎస్‌పీఎస్సీ డిసెంబర్ ఒకటిన శాఖల వారీగా ఖాళీలను ప్రకటించింది. కేటగిరీల వారీగా పోస్టుల వివరాలతో డిసెంబర్ 23న పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఇచ్చి, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తామని తెలిపింది. కానీ ఆ రోజున పూర్తిస్థాయి నోటిఫికేషన్ రాలేదు. దరఖాస్తుల స్వీకరణ చేపట్టలేదు. మరోవైపు ఇతర ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు విడుదల అవుతూ వచ్చాయి. దీనితో అభ్యర్థుల్లో గందరగోళం మొదలైంది. టీఎస్‌పీఎస్సీ 30న అర్ధరాత్రి దాటాక 8,039 ఖాళీలతో పూర్తి నోటిఫికేషన్‌ను వెబ్‌సైట్‌లో పెట్టి.. దరఖాస్తుల నమోదు ఆప్షన్‌ను ఇచ్చింది.
పంచాయతీరాజ్‌లో తగ్గిన పోస్టులు: టీఎస్‌పీఎస్సీ వెబ్‌నోట్‌లో ప్రకటించిన పోస్టులతో పోలిస్తే ఇప్పుడు 1,129 ఉద్యోగాలు తగ్గిపోయాయి. కొన్ని విభాగాల పోస్టుల సంఖ్యలో స్వల్పంగా మార్పులు జరిగినా.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఏకంగా 1,208 పోస్టులు తగ్గాయి. వాస్తవానికి గతేడాది సీఎం అసెంబ్లీలో వెల్లడించిన జాబితా ప్రకారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో 1,245 ఖాళీలు ఉన్నాయి.
ఇప్పుడు టీఎస్‌పీఎస్సీ పూర్తిస్థాయి నోటిఫికేషన్‌లో ఈ శాఖలో 37 పోస్టులు మాత్రమే చూపారు. మొత్తంగా 1,129 కొలువులు తగ్గాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరైన సమాచారం, రోస్టర్ వివరాలు ఇవ్వకపోవడంతో టీఎస్‌పీఎస్సీ ఆ మేరకు పోస్టులు తగ్గించి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. టీఎస్‌పీఎస్సీ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.
చదవండి: TSPSC: మరో నాలుగు నోటిఫికేషన్లు.. 806 కొలువులు
Comments
Please login to add a commentAdd a comment