షిమ్లా: ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల ఆధారిత రిజర్వేషన్లను పూర్తి రద్దు చేయాలని హిమాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు శాంత కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఫేస్‌బుక్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. కుల ఆధారిత కోటా వ్యవస్థను పూర్తిగా రద్దుచేసి, కుటుంబ ఆదాయం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. కుల ఆధారిత రిజర్వేషన్లపై దేశంలో 80 శాతం మంది విసుగెత్తిపోయారని అన్నారు. రిజర్వుడ్ కులాల్లోని పేదలు రిజర్వేషన్లతో పూర్తి లబ్ధి పొందలేకపోతున్నారని చెప్పారు.
ఈ కేటగిరీలోని సంపన్నులు రిజర్వేషన్లతో లాభపడుతున్నారని శాంత కుమార్ ఆక్షేపించారు. రిజర్వేషన్ల నుంచి క్రీమీలేయర్‌ను మినహాయించాలన్న డిమాండ్ చాలా ఏళ్లుగా ఉందని గుర్తుచేశారు. రాజకీయ పార్టీల్లోని రిజర్వుడ్ కేటగిరీ నేతలు క్రీమీలేయర్ కిందకు వస్తారని వివరించారు. క్రీమీలేయర్ వర్గానికి రిజర్వేషన్లు వర్తింపజేయరాదంటూ సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు.
‘అంతర్జాతీయ ఆకలి సూచిక’లో 130 దేశాల్లో భారత్ 117 స్థానంలో ఉన్నట్లు తేలిందని వెల్లడించారు. దేశంలో 19.40 కోట్ల మంది ఆకలితో నిద్రిస్తున్నట్లు ఆ నివేదిక చెప్పిందన్నారు. వీరిలో 12 మంది కోట్ల మంది రిజర్వుడ్ కేటగిరీ ప్రజలేనని వివరించారు. కుల రిజర్వేషన్లతో ఆ వర్గంలోని పేదలు ప్రయోజనం పొందడం లేదన్న వాస్తవం అర్థమవుతోందని చెప్పారు.
చదవండి:
అంబేడ్కర్‌ను సరిగ్గా అర్థం చేసుకోవాలి!
50 శాతం మీ హక్కు: జస్టిస్ ఎన్‌వీ రమణ
Comments
Please login to add a commentAdd a comment