cast reservations
-
Agnipath Recruitment: అగ్నిపథ్‌లో ‘కుల’కలం?
న్యూఢిల్లీ: అగ్నిపథ్ నియామకాలకు సైన్యం కులాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకుంటోందన్న వార్తలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులను సైన్యం కులం, మతం సర్టిఫికెట్ అడుగుతోందని విపక్షాలు మంగళవారం ఆరోపించాయి. అధికార ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన జేడీ(యూ) కూడా వాటితో గొంతు కలిపింది. వీటిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఖండించగా, సైన్యం వద్ద ఇలాంటి సమాచారముంటే సైనికుల అంత్యక్రియల వంటి సమయంలో సహాయకారిగా ఉంటుందంటూ అధికార బీజేపీ అధికార ప్రతినిధి సంబిత పాత్రా స్పందించడం విశేషం! అగ్నిపథ్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారిని కులం, మతం సర్టిఫికెట్లు జతపరచాలని అడుగుతున్నారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆప్ నేత సంజయ్‌సింగ్‌తో పాటు అధికార ఎన్డీఏ మిత్రపక్షమైన జేడీ(యూ) నేత ఉపేంద్ర కుశ్వాహా కూడా ఆరోపించారు. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా కులమతాలను అడగాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ట్వీట్ చేశారు. బీసీలు, దళితులు, గిరిజనులు సైన్యంలో చేరేందుకు అనర్హులని ప్రధాని మోదీ భావిస్తున్నారా అని సంజయ్‌సింగ్ ట్వీట్ చేశారు. తప్పుడు ప్రచారం.. ఇదంతా పూర్తిగా తప్పుడు ప్రచారమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. సైన్యంలో స్వాంతంత్య్రానికి ముందునుంచీ వస్తున్న నియామక పద్ధతులే కొనసాగుతున్నాయి తప్ప కొత్తగా ఎలాంటి మార్పులూ చేయలేదని రాజ్యసభలో స్పష్టం చేశారు. సైన్యంపై వివాదాలు పుట్టించే ప్రయత్నాలు విపక్షాలకు పరిపాటేనన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను ఆప్ చీఫ్ కేజ్రివాల్ అనుమానించడాన్ని గుర్తు చేశారు. నియామకాల్లో కులమతాలను ఏ విధంగానూ పరిగణనలోకి తీసుకోవడం జరగదంటూ 2013లో యూపీలో హయాంలో సుప్రీంకోర్టులో సైన్యం అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఇదీ చదవండి: IAF Agnipath Recruitment 2022: భారత వాయుసేనలో ‘అగ్నిపథ్’ రిక్రూట్మెంట్ షురూ -
‘ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల రిజర్వేషన్లు రద్దు చేయాలి’
షిమ్లా: ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల ఆధారిత రిజర్వేషన్లను పూర్తి రద్దు చేయాలని హిమాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు శాంత కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఫేస్బుక్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. కుల ఆధారిత కోటా వ్యవస్థను పూర్తిగా రద్దుచేసి, కుటుంబ ఆదాయం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. కుల ఆధారిత రిజర్వేషన్లపై దేశంలో 80 శాతం మంది విసుగెత్తిపోయారని అన్నారు. రిజర్వుడ్ కులాల్లోని పేదలు రిజర్వేషన్లతో పూర్తి లబ్ధి పొందలేకపోతున్నారని చెప్పారు. ఈ కేటగిరీలోని సంపన్నులు రిజర్వేషన్లతో లాభపడుతున్నారని శాంత కుమార్ ఆక్షేపించారు. రిజర్వేషన్ల నుంచి క్రీమీలేయర్‌ను మినహాయించాలన్న డిమాండ్ చాలా ఏళ్లుగా ఉందని గుర్తుచేశారు. రాజకీయ పార్టీల్లోని రిజర్వుడ్ కేటగిరీ నేతలు క్రీమీలేయర్ కిందకు వస్తారని వివరించారు. క్రీమీలేయర్ వర్గానికి రిజర్వేషన్లు వర్తింపజేయరాదంటూ సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. ‘అంతర్జాతీయ ఆకలి సూచిక’లో 130 దేశాల్లో భారత్ 117 స్థానంలో ఉన్నట్లు తేలిందని వెల్లడించారు. దేశంలో 19.40 కోట్ల మంది ఆకలితో నిద్రిస్తున్నట్లు ఆ నివేదిక చెప్పిందన్నారు. వీరిలో 12 మంది కోట్ల మంది రిజర్వుడ్ కేటగిరీ ప్రజలేనని వివరించారు. కుల రిజర్వేషన్లతో ఆ వర్గంలోని పేదలు ప్రయోజనం పొందడం లేదన్న వాస్తవం అర్థమవుతోందని చెప్పారు. చదవండి: అంబేడ్కర్‌ను సరిగ్గా అర్థం చేసుకోవాలి! 50 శాతం మీ హక్కు: జస్టిస్ ఎన్వీ రమణ -
అగ్రవర్ణ కోటాపై ఇప్పుడే ఆదేశాలివ్వం: సుప్రీం
న్యూఢిల్లీ: అగ్రవర్ణాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్ల కేసుపై ప్రస్తుత తరుణంలో తాము ఏ ఆదేశాలూ ఇవ్వదలచుకోవడం లేదని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఈ నెల 28న ఈ కేసుకు సంబంధించిన వాదనలను తాము వింటామనీ, రాజ్యాంగ ధర్మాసనానికి దీనిని బదిలీ చేయాలా, వద్దా అన్న విషయాన్ని కూడా అప్పుడే పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. అగ్ర కులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ ఇప్పటికే పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే వారందరి కేసుల్లోనూ ఈ విషయాన్ని తాము తర్వాత పరిశీలిస్తామంటూ అన్ని పిటిషన్లనూ సుప్రీంకోర్టు వాయిదా వేస్తుండటం తెలిసిందే. ఈ పిటిషన్లపై స్పందన తెలపాల్సిందిగా కేంద్రానికి సుప్రీంకోర్టు గతంలోనే నోటీసులు పంపింది. ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌పై పిటిషన్లు కొట్టివేత ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హం చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను కేంద్రం పొడిగించటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) ఆర్డినెన్స్‌ను గత ఏడాది సెప్టెంబర్ 19న ప్రభుత్వం జారీ చేసింది. దీని ప్రకారం.. ముస్లిం పురుషుడు తన భార్యకు మూడుసార్లు తలాక్ అని చెప్పి విడాకులివ్వడం శిక్షార్హం అవుతుంది. ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినా రాజ్యసభ వద్ద పెండింగ్‌లో ఉంది. -
జనసేన పార్టీలో సం‘కుల’ సమరం
జిల్లా జనసేనలో సం‘కుల’ సమరం మొదలైంది. పార్టీ వ్యవహారాల్లో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ, మిగతా వర్గాల నాయకులను పార్టీ అధిష్టానం విస్మరిస్తోందన్న విమర్శలు తెరమీదకు వచ్చాయి. పార్టీ సంస్థాగత నిర్మాణానికి కీలకంగా వ్యవహరించే తిరుపతి పట్టణంలో నేతలు రెండు గ్రూపులుగా చీలిపోయారు. ప్రస్తుతం ఎవరికి వారు పార్టీలో ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి : జిల్లా జనసేనలో ఆధిపత్య రగడ మొదలైంది. గుంటూరులో పార్టీ అధినేత ఆత్మగౌరవ సభ పెట్టకు ముందు నుంచే ఈ పోరు కొనసాగుతోంది. రెండు గ్రూపులుగా చీలిపోయిన నాయకులు ఎవరికి వారే యమునాతీరే అన్న చందాన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ పిలుపు మేరకు ఉమ్మడిగా నిర్వహించాల్సిన కార్యక్రమాలను సైతం వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఒక గ్రూపునకు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, రెండో గ్రూపునకు కిరణ్‌రాయల్ నేతృత్వం వహిస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు ఇద్దరూ సన్నిహితులే అయినప్పటికీ పార్టీ వ్యవహారాల్లో డాక్టర్ హరిప్రసాద్ ఒకడుగు ముందంజలో ఉన్నారు. పవన్ కల్యాణ్ ఆశీస్సుల కారణంగానే ఇంతకు ముందు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా కొనసాగిన డాక్టర్ హరిప్రసాద్ రెండు నెలల నుంచి పార్టీలో కీలక వ్యక్తిగా మారారు. ఇకపోతే తిరుపతి నగరంలో పార్టీని నడిపించడం, ఇతరత్రా కార్యక్రమాల్లో కిరణ్‌రాయల్ కీలకంగా మారారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే భారత్ బంద్‌ను విజయవంతం చేసేందుకు పార్టీ పిలుపునిచ్చింది. ఇందుకోసం పార్టీ అధిష్టానం జిల్లాకు చెందిన ఏడుగురు నాయకులను ఆదివారం విజయవాడలో జరిగే సమావేశానికి ఆహ్వానించడంతో పాటు మెంబర్షిప్ కార్డుల కోసం ఎంపిక చేసింది. దీంతో ఆహ్వానం లేని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు రగిలిపోయారు. తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం ఎయిర్‌బైపాస్ రోడ్‌లోని ఓ ప్రయివేటు హోటల్లో సమావేశమైన పార్టీ నాయకులు కో–ఆర్డినేటర్ కిరణ్‌రాయల్, హరిశంకర్‌పై ధ్వజమెత్తారు. ఒకే ఒక సామాజిక వర్గానికి మాత్రమే పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం మిగతా వారిని పట్టించుకోకపోవడం ఏమిటని పార్టీ యువనేత బాబ్జీ సమావేశంలో ప్రశ్నించారు. డాక్టర్ హరిప్రసాద్ తనకు అనుకూలమైన వారినే మెంబర్షిప్ కోసం ఎంపిక చేయడం ఎంత వరకూ న్యాయమని నిలదీశారు. ఈనెల 22, 23 తేదీల్లో పవన్‌కల్యాణ్ తిరుపతి వచ్చినపుడు ఈ విషయంపై తేల్చుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నేడు ‘భారత్ బంద్’
న్యూఢిల్లీ: విద్య, ఉద్యోగ రంగాల్లో కుల ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని సంస్థలు మంగళవారం ‘భారత్ బంద్’ను నిర్వహించనున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్రాలను హోంశాఖ ఆదేశించింది. ఎక్కడైనా శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే ఆ ప్రాంతానికి చెందిన కలెక్టర్, ఎస్పీలు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎస్సీ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ఇటీవల దళిత సంఘాలు నిర్వహించిన భారత్ బంద్ హింసాత్మకంగా మారి 12 మంది మరణించడం తెల్సిందే. సోషల్‌మీడియాల్లో కొన్ని సంస్థలు కుల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చాయని హోంశాఖ ఉన్నతాధికారి చెప్పారు. -
'కేసీఆర్ సూచనలకు ప్రధాని అధిక ప్రాధాన్యత'
హైదరాబాద్: నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసినట్లు భువనగరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వెల్లడించారు. ఈ మేరకు కేసీఆర్‌కు లేఖ రాసినట్లు గౌడ్ శనివారం హైదరాబాద్‌లో తెలిపారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని అన్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు జాతీయ స్థాయిలో జరిగే కామన్ మెడికల్ ఎగ్జామ్‌లో చేరాలని సూచించారు. కేంద్రంతో తమ ప్రభుత్వానికి ఎలాంటి ఘర్షణ లేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేసిన సూచనలకు ప్రధాని మోదీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని బూర నర్సయ్య గౌడ్ గుర్తు చేశారు.