
భర్తీ లేదా.. బ్రదర్!
ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు
► నోటిఫికేషన్లు జారీ అవుతున్నా ముందుకు సాగని భర్తీ ప్రక్రియ
► అర్హతలు, నియామక పరీక్షల్లో వరుస తప్పిదాలు
► విపరీత నిబంధనలతో గందరగోళం
► అభ్యర్థుల వ్యతిరేకత, కోర్టు కేసులతో నిలిచిపోతున్న వైనం
► గ్రూప్–2 ఉద్యోగాలకు వైట్‌నర్ దెబ్బ
► విపరీత నిబంధనలతో గురుకుల పోస్టులకు గండం
► మార్గదర్శకాలు పాటించక లక్ష మంది ‘టెట్’కు దూరం
సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ అవుతున్నా భర్తీ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు ఆందోళనలో కూరుకుపోతున్నారు. అర్హతలు, నిబంధనలు మొదలుకుని సిబ్బంది తప్పిదాలు, కోర్టు కేసుల దాకా ఎన్నో అడ్డంకులతో పోస్టుల భర్తీ జరగక ఆవేదన చెందుతున్నారు. గ్రూప్–2, గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు ఏడాదిన్నర కిందటే నోటిఫికేషన్లు జారీ అయినా ఇప్పట్లో ఉద్యోగ నియామకాలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో నిబంధనలతో దాదాపు లక్ష మంది పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీకి అనుమతినిచ్చి ఏడాది దాటుతున్నా.. మార్గదర్శకాల్లో అస్పష్టత కారణంగా పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. పలు శాఖలు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ పరిస్థితికి కారణమని విమర్శలు వస్తున్నాయి.
గ్రూప్–2కు వైట్‌నర్ దెబ్బ
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,032 గ్రూప్–2 పోస్టుల భర్తీకి 2015 డిసెంబర్, 2016 మార్చిలో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ పోస్టులకు 7,89,437 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2016 నవంబర్ 11, 13 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించగా.. 4,97,961 మంది హాజరయ్యారు. అయితే పరీక్ష నిర్వహణ సమయంలో దాదాపు 50 వేల మంది అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలు మారిపోయాయి. కాసేపటికి ఈ తప్పును గుర్తించిన పరీక్షల సిబ్బంది.. ఎవరి జవాబు పత్రాలను వారికి ఇచ్చారు. అయితే అప్పటికే నష్టం జరిగిపోయింది. కొందరు అభ్యర్థులు ఓఎంఆర్ జవాబు పత్రాల్లో తమ వివరాలను రాసేశారు.
మరికొందరు జవాబులు కూడా రాశారు (బబ్లింగ్ చేశారు). దీంతో పరీక్షల సిబ్బంది వైట్‌నర్ పెట్టి పరీక్ష రాయాలని సూచించగా.. అభ్యర్థులు అలాగే రాశారు. వాస్తవానికి టీఎస్‌పీఎస్సీ నిబంధనలు, గ్రూప్–2 నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం.. వైట్‌నర్ ఉపయోగిస్తే ఆ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయరు. ఈ నిబంధన తెలిసిన కొందరు అభ్యర్థులు పరీక్షల సిబ్బంది తప్పిదం కారణంగా వైట్‌నర్ ఉపయోగించామని, తమను పరిగణనలోకి తీసుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే నిబంధనల ప్రకారం అది వీలుకాదని టీఎస్‌పీఎస్సీ కోర్టుకు వివరించింది. కోర్టు కూడా అభ్యర్థుల వాదనను తోసిపుచ్చింది. కానీ ఆ తర్వాత టీఎస్‌పీఎస్సీ మాట మార్చింది. అంతర్గత పరిశీలనలో 50 వేల మందికిపైగా అభ్యర్థులు వైట్‌నర్ ఉపయోగించినట్లు గుర్తించింది. ఓ కమిటీ వేసి.. ఆ కమిటీ సిఫారసు అంటూ వైట్‌నర్ ఉపయోగించిన వారిని కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపిక చేసింది. దీంతో మిగతా నిరుద్యోగులు కోర్టును ఆశ్రయించగా.. పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది.
టెట్‌కు నిబంధనల కష్టం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో విపరీత నిబంధనల కారణంగా లక్ష„ý మంది వరకు అభ్యర్థులు పరీక్ష రాసే అవకాశం కోల్పోయారు. 2010లో అమల్లోకి వచ్చిన ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం ఇంటర్, డిగ్రీలలో 50 శాతం మార్కులుండి, ఉపాధ్యాయ విద్యా కోర్సులు పూర్తి చేసిన వారు టెట్ రాసేందుకు అర్హులు. అయితే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చే నాటికంటే ముందే ఇంటర్, డిగ్రీ పూర్తిచేసుకున్న వారికి మాత్రం 45 శాతం మార్కులు వచ్చినా అర్హులేననే మినహాయింపు ఉంది. కానీ విద్యా శాఖ మొత్తంగా 50 శాతం మార్కుల నిబంధనను అమలు చేయడంతో.. వేలాది మంది టెట్ రాసే అవకాశం కోల్పోయారు. ఇక డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) పూర్తిచేసి, తర్వాత డిగ్రీ (డీఎడ్+డిగ్రీ) చేసినవారు టెట్ పేపర్–2 రాసేందుకు అర్హులని ఎన్‌సీటీఈ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు సార్లు నిర్వహించిన టెట్‌లలోనూ వారికి అవకాశం కల్పించారు. కానీ టెట్–2017లో విద్యా శాఖ వారికి అవకాశం కల్పించకపోవడంతో చాలా మంది అభ్యర్థులు నష్టపోయారు. ఇక విద్యా హక్కు చట్టం ప్రకారం.. ప్రైవేటు పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకూ టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. కానీ ఇంటర్, డిగ్రీల్లో 50 శాతం మార్కులు లేవంటూ టెట్‌కు దూరం చేయడంతో... చాలా మంది అభ్యర్థులు ప్రైవేటు స్కూళ్లలో పనిచేసుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నారు.
గురుకుల పోస్టులకు ‘అర్హత’గండం!
దాదాపు 2.5 లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న గురుకుల పోస్టుల భర్తీ కూడా గందరగోళంగా మారింది. గురుకుల స్కూళ్లలో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) తదితర 7,306 పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరిలో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో పీజీటీ, టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. డిగ్రీ, పీజీలలో 60 శాతం మార్కులు సాధించి ఉండాలని సంక్షేమ శాఖలు నిబంధనలు విధించాయి. వాస్తవానికి ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం... ఈ పోస్టులకు 2010 ఆగస్టు తర్వాత డిగ్రీ, పీజీలు పూర్తి చేసుకున్న వారికి 50 శాతం మార్కులు.. అంతకుముందు ఉత్తీర్ణులైన వారికి 45 శాతం మార్కులు ఉంటే చాలు. కానీ సంక్షేమ శాఖలు 60 శాతం మార్కుల నిబంధన విధించడంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో సీఎం కేసీఆర్ స్వయంగా కల్పించుకుని ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేయించారు. ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారమే అర్హత నిర్ణయించాలని ఆదేశించారు. అయినా పరిస్థితి మారలేదు.
విద్యార్హతలను ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారమే నిర్ణయించినా.. రిజర్వేషన్ విషయంలో తప్పిదం చేశారు. అత్యధిక పోస్టులను మహిళా అభ్యర్థులకు కేటాయించారు. జూన్ 1న 2,437 పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌లోనూ ఇదే తరహాలో వ్యవహరించారు. మహిళా కాలేజీల్లో పోస్టులను మహిళలతోనే భర్తీ చేయాలన్న నిబంధన ఎక్కడా లేకున్నా... డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టులను 100 శాతం మహిళా అభ్యర్థులకే రిజర్వు చేశారు. దీనిపై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో.. ఈ పరీక్షలు కూడా ఆగిపోయాయి.
వైద్యపోస్టుల భర్తీలో దిద్దుబాట!
వైద్యారోగ్య శాఖ పరిధిలో 2,118 పోస్టుల భర్తీ ప్రక్రియ అంతులేకుండా సాగుతూనే ఉంది. ఈ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం గతేడాది జూలై 13న అనుమతి ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో పోస్టులు భర్తీ చేయాలని.. అర్హతలు, నిబంధనలను వైద్య శాఖ రూపొందించాలని పేర్కొంది. దీనిపై వైద్యారోగ్య శాఖ దాదాపు ఏడాది పాటు జాప్యం చేసింది. చివరికి ఈ ఏడాది మేలో మార్గదర్శకాలను విడుదల చేసింది. కానీ వాటిలో స్పష్టత లేకపోవడంతో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయలేదు. స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలంటూ పలుసార్లు వైద్య శాఖకు సూచించింది. జూలై 5న టీఎస్‌పీఎస్సీ, ప్రభుత్వానికి లేఖలు సైతం రాసింది. ట్యూటర్ పోస్టుల భర్తీలో భారత వైద్య మండలి నిబంధనలు, రిజర్వేషన్ల వర్తింపు అంశాలపై స్పష్టత కోరింది.
వైద్యవిద్య డైరెక్టరేట్ పరిధిలోని అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, లెక్చరర్, రేడియోలాజికల్, ఫిజిక్స్, ఫిజిసిస్ట్ పోస్టులకు... వైద్య విధాన పరిషత్ పరిధిలోని సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీలో పాటించే నిబంధనలపై స్పష్టత కోరింది. దీంతో చివరికి వైద్యారోగ్య శాఖ స్పందించి ఎంసీఐ మార్గదర్శకాల ప్రకారం పలు అంశాలపై స్పష్టతనిస్తూ మంగళవారమే టీఎస్‌పీఎస్సీకి, ప్రభుత్వానికి వివరాలు పంపింది. ఇప్పటికైనా భర్తీ ప్రక్రియ ముందుకు సాగేలా చర్యలు చేపట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు.