ఈ నెల 18, 19 తేదీల్లో యూపీఎస్సీ, ఎస్సెస్సీని సందర్శిస్తాం: టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం
ఎన్‌టీఏ చైర్మన్‌తోనూ ప్రత్యేకంగా సమావేశం కానున్నాం
పారదర్శకంగా పరీక్షల నిర్వహణపై అధ్యయనం చేస్తాం
నేటి నుంచి గ్రూప్–2 అర్హత పరీక్షలు.. రెండ్రోజులు, నాలుగు పేపర్లు
హాజరుకానున్న 5.51 లక్షల మంది అభ్యర్థులు.. 1,368 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ‘గ్రూప్స్’ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి నెలాఖరు కల్లా పూర్తవుతుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. ఇప్పటికే గ్రూప్–4 ఉద్యోగాల భర్తీ పూర్తయిందని.. వచ్చే ఏడాది జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరిలో గ్రూప్–1 పరీక్షల తుది ఫలితాలు ఇస్తామని తెలిపారు. తర్వాత గ్రూప్–2 ఫలితాలు, వెనువెంటనే గ్రూప్–3 ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. ఆదివారం నుంచి గ్రూప్–2 పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం టీజీపీఎస్సీ కార్యాలయంలో బుర్రా వెంకటేశం మీడియాతో మాట్లాడారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
ఈ నెల 15వ తేదీ ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్–1, అదేరోజు మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్–2, 16వ తేదీ ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్–3, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్–4 పరీక్ష జరుగుతాయని బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ మేరకు పకడ్బందీగా ఏర్పాటు చేశామని చెప్పారు. 783 ఉద్యోగాలకు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఒక్కో పోస్టుకు సగటున 70 మంది పోటీ పడుతున్నారని వెల్లడించారు.
గ్రూప్–2 పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,368 కేంద్రాలను సిద్ధం చేశామని.. ప్రత్యక్షంగా 49,848 మంది, పరోక్షంగా మరో 25 వేల మంది సిబ్బంది పరీక్షల విధుల్లో పాల్గొంటారని తెలిపారు. శుక్రవారం నాటికి 75 శాతం మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని చెప్పారు. అభ్యర్థులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరని స్పష్టం చేశారు. సీసీ కెమెరాలతో పరీక్ష తీరును పర్యవేక్షిస్తామని తెలిపారు.
ఈ నెల 18 నుంచి ఢిల్లీ పర్యటన..
టీజీపీఎస్సీని మరింత పటిష్టం చేసే క్రమంలో.. ఈ నెల 18, 19 తేదీల్లో టీజీపీఎస్సీ బృందంతో కలిసి ఢిల్లీలో పర్యటించనున్నట్లు బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ నెల 18న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)ను, మరుసటి రోజు స్టాఫ్ సెలెక్షన్‌కమిషన్(ఎస్‌ఎస్‌సీ), తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)ని సందర్శిస్తామని చెప్పారు. పరీ క్షలను పారదర్శకంగా నిర్వహించే విధానాలపై అధ్యయ నం చేస్తామని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమ ర్పిస్తామని తెలిపారు.
వచ్చే నెలలో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లు టీజీపీఎస్సీకి వచ్చే అవకాశం ఉందనితెలిపారు. కొత్త నోటిఫికేషన్లను జాబ్ క్యాలెండర్ ఆధారంగా ప్రకటిస్తామన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించినది టీజీపీఎస్సీయేనని చెప్పారు. టీజీపీఎస్సీలో కొత్తగా 80మంది ఉద్యోగులను డిప్యుటేషన్‌పై తీసుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment