![Burra Venkatesham to be new chairman of Telangana Public Service Commission: TG](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/1/TSPC.jpg.webp?itok=FW8lhng8)
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం
ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం
ఈ నెల 3న ముగియనున్న ప్రస్తుత చైర్మన్ మహేందర్‌రెడ్డి పదవీకాలం
ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించనున్న బుర్రా వెంకటేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నూతన చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులు కానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న ఎం.మహేందర్‌రెడ్డి పదవీకాలం ఈ నెల 3వ తేదీతో ముగుస్తోంది. ఆ తర్వాత బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించనున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నాలుగో చైర్మన్‌గా బుర్రా వెంకటేశం నిలవనున్నారు. ఆయన వయసు 62 ఏళ్లు పూర్తయ్యే వరకు లేదా ఆరేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. పదవీ విరమణ చేసిన అధికారులను టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమిస్తే... సంస్కరణలు తీసుకురావడం, అమలు చేయడానికి తగిన సమయం ఉండదన్న ఉద్దేశంతో బుర్రా వెంకటేశంను సీఎం రేవంత్‌రెడ్డి ఎంపిక చేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
వివిధ హోదాల్లో పనిచేసి...
బుర్రా వెంకటేశం ప్రస్తుతం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా, జేఎనీ్టయూ వైస్ చాన్స్‌లర్‌గా అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. జనగామ జిల్లా కేశవాపురం గ్రామానికి చెందిన బుర్రా వెంకటేశం.. 1995 సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయనే టాపర్. ఆయన 2005– 2009 మధ్య మెదక్, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిగా, యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం– సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా, కార్యదర్శిగా సుదీర్ఘకాలం కొనసాగారు. జిల్లా కలెక్టర్‌గా తన అనుభవాలతో ‘పాత్‌వేస్ టు గ్రేట్ నెస్–కమింగ్ టుగెదర్ ఫర్ చేంజ్’పుస్తకం కూడా రాశారు.
కీలక కార్యక్రమాలతో గుర్తింపు
బుర్రా వెంకటేశం రాష్ట్రంలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్, అంతర్జాతీయ స్వీట్స్ ఫెస్టివల్, అంతర్జాతీయ ఫోటోగ్రఫీ ఫెస్టివల్, హైదరాబాద్ హెలీ టూరిజం పేరిట విభిన్న కార్యక్రమాలను పరిచయం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. పరీక్ష తేదీ నుంచి కేవలం 65 రోజుల రికార్డు సమయంలో ఏకంగా 11 వేల ఉపాధ్యాయ పోస్టుల నియామక ప్రక్రియను పూర్తి చేశారు. అదే సమయంలో 35వేల మంది టీచర్లకు పదోన్నతులు, 22 వేల మందికి బదిలీల ప్రక్రియలనూ విజయవంతంగా నిర్వహించారు.
2005లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నుంచి ప్రశంసా పత్రాన్ని.. 2016లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అత్యుత్తమ పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన సామాజిక సేవకు గుర్తింపుగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ పది బంగారు పతకాలను అందజేసింది. 2019లో ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’అనే పుస్తకం రాశారు. రామాయణ పరివారం, జీవన ధాన్య శతకం, ‘బుద్ధ శతకం’కూడా రాశారు.
పదవికి ముందు పదోన్నతి
విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న బుర్రా వెంకటేశం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. టీజీపీఎస్సీ చైర్మన్‌గా ఆయన పేరు ఖరారైన నేపథ్యంలో ఈ పదోన్నతి ఇవ్వడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment