ప్రైవేటు కొలువుకు సెలవు!
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ ఇంజనీర్లే కాదు.. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వేల మంది ఇంజనీర్లు సైతం సర్కారీ కొలువును ఒడిసిపట్టుకునేందుకు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉద్యోగాల నియామకాల కోసం జరిగే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వేల మంది ఇంజనీర్లు మూకుమ్మడిగా సెలవులు పెట్టేసి మళ్లీ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇంజనీరింగ్ విద్యను మరోమారు మూలాల నుంచి ఔపోసన పడుతున్నారు.
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ ఉద్యోగావకాశాన్ని ఒడిసి పట్టుకునేందుకు ప్రైవేటు ఇంజనీర్లు తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. పలు ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్‌పీఎస్సీ) 931 ఏఈఈ (సివిల్) పోస్టులతో పాటు 1058 ఏఈ (సివిల్/మెకానికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి రాత పరీక్షలకు ఏర్పాట్లు చేస్తోంది. ఏఈఈ (సివిల్) పోస్టుల కోసమే 30,783 మంది దరఖాస్తు చేసుకున్నారు.
పరీక్షలకు సన్నద్ధం కావడానికి వేల మంది ఇంజనీర్లు సెలవులోకి పోవడంతో ఒక్కసారిగా నిర్మాణ రంగం స్తంభించిపోయింది. మెట్రో రైలు లాంటి ముఖ్యమైన ప్రాజెక్టుల పనులు నెమ్మదించాయి. మెట్రో రైలు ప్రాజెక్టుతో పాటు హైదరాబాద్‌లోని ప్రముఖ నిర్మాణ కంపెనీలు, ఏపీలోని స్థిరాస్తివ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న 15 వేల మందికి పైగా సివిల్ ఇంజనీర్లు సెలవులోకిపోవడం నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని ఆ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పనులకు అనుభవజ్ఞులైన ఇంజనీర్ల కొరత ఏర్పడిందని అభిప్రాయపడుతున్నారు.
ఇక విద్యుత్ సంస్థల్లో 2,681 అసిస్టెంట్ ఇంజనీర్లు, సబ్ ఇంజనీర్ల భర్తీకి ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్లు రానున్నాయి. ఈ పోస్టుల కోసం హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని విద్యుదుత్పత్తి కేంద్రాల్లో పనిచేస్తున్న 2 వేల మంది తెలంగాణ ఇంజనీర్లు ఇప్పటికే సెలవులు పెట్టేసి సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. అదేవిధంగా తెలంగాణ, ఏపీల్లోని ప్రైవేటు విద్యుత్ కేంద్రాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు కలిపి మొత్తం 5 వేల మందికి పైగా ప్రైవేటు ఎలక్ట్రికల్ ఇంజనీర్లు సెలవుల బాటపట్టినట్లు అంచనా. ఈ ఉద్యోగ నియామకాల సీజన్ ముగిసే వరకు ప్రైవేటు నిర్మాణ సంస్థలు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సెలవుల ఫీవర్ తప్పదనే చర్చ జరుగుతోంది.