న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థులను లాటరల్ ఎంట్రీ విధానం ద్వారా ఎంపిక చేయాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఎస్‌సీ, ఎస్‌టీ, ఆదివాసీలు, ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్ తదితరుల నుంచి రిజర్వేషన్లను లాక్కుని ఆర్‌ఎస్‌ఎస్ వాదులతో నింపేందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రగా ఆయన సోమవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని నాశనం చేయడం, బహుజనులకు రిజర్వేషన్లు లేకుండా చేయడం ద్వారా బీజేపీ దేశాన్ని తనదైన శైలిలో రామరాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. లాటరల్ ఎంట్రీ విధానం అమలును ఆయన జాతి వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వ విభాగాల్లో సంయుక్త కార్యదర్శులు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీల పోస్టులను స్పెషలిస్టుల పేరుతో ప్రైవేట్ వ్యక్తులతో లాటరల్ ఎంట్రీ విధానం ద్వారా భర్తీ చేసేందుకు యూపీఎస్‌సీ జారీ చేసిన నోటిఫికేషన్‌పై రాహుల్ ఇలా స్పందించారు.
ప్రభుత్వోద్యోగాల్లో కోటా ఉండాల్సిందే: చిరాగ్
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లను తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని లోక్‌జనశక్తి పార్టీ(రాం విలాస్) చీఫ్, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ కుండబద్దలు కొట్టారు. లాటరల్ ఎంట్రీ విధానం అమలుపై కేంద్రంతో మాట్లాడతానన్నారు. ‘ప్రభుత్వ నియామకమేదైనా సరే రిజర్వేషన్ నిబంధనలను అమలు చేయాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావుండరాదు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేవు. ప్రభుత్వం కూడా రిజర్వేషన్లను అమలు చేయకుంటే ఎలా? లాటరల్ ఎంట్రీ విషయం ఆదివారం నా దృష్టికి వచ్చింది. ఇది చాలా తీవ్రమైంది. దీనికి మేం అంగీకరించం. ప్రభుత్వంలో భాగస్వామిగా ఈ అంశాన్ని లేవనెత్తుతా’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment