lateral entry
-
ల్యాటరల్ ఎంట్రీ దుమారం.. కేంద్ర ప్రభుత్వం యూటర్న్
న్యూఢిల్లీ: వివిధ మంత్రిత్వ శాఖలలో ‘లేటరల్ ఎంట్రీ’ ద్వారా పోస్టుల భర్తీపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంలోని 45 కీలక పదవుల్లోకి కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేటు వారిని నియమించడానికి యూపీఎస్సీ జారీ చేసిన ‘ల్యాటరల్ ఎంట్రీ’పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బీజేపీ సర్కార్ వెనక్కి తగ్గింది.ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. కీలక ఉత్తర్వులు జారీ చేశారు. యూపీఎస్సీ నిర్ణయం సామాజిక న్యాయంతో ముడిపడి ఉండాలని పేర్కొన్నారు. యూపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని యూపీఎస్సీ ఛైర్మన్‌కు లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.కాగా గతవారం కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ఉన్నత స్థానాల్లో ‘ల్యాటరల్ ఎంట్రీ’ద్వారా నియమాకాల కోసం ప్రతిభావంతులైన భారతీయులు కావాలంటూ యూపీఎస్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 24 మంత్రిత్వ శాఖలలో 45 పోస్టులు ఉన్నాయి. వీటిలో జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్ మరియు డిప్యూటీ సెక్రటరీ ఉన్నారు. ఈ పోస్టుల నియామకం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటుంది. ప్రైవేట్ రంగానికి చెందిన వ్యక్తులు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ పథకంపై వ్యతిరేక వ్యక్తమవుతుండటంతో కేంద్ర మంత్రి ఈ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మధ్య స్థాయి, సీనియర్ స్థాయి పదవులను సాధారణంగా ఐఏఎస్ వంటి సివిల్ సర్వీసుల అధికారులతో భర్తీ చేస్తారు. అయితే ఈ పదవులను సివిల్ సర్వీసులతో సంబంధం లేని బయటి వ్యక్తులు, నిపుణులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడాన్నే ‘ల్యాటరల్ ఎంట్రీ’అంటారు. మూడేళ్లు, అయిదేళ్ల ఒప్పందంతో వీరిని నియమిస్తారు. ఈ పద్ధతిని ప్రధానిగా మోదీ తొలి హయాంలో 2018లో అమలు చేశారు.ఈ ప్రకటనను కేంద్రమంత్రి, ఎన్డీఏ భాగస్వామ్య లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌తో పాటు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ ఈ పద్దతిని తప్పుపట్టారు. దానిని జాతి వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. సమాజ్‌వాదీ, బీఎస్పీ సైతం ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. -
‘లాటరల్ ఎంట్రీ’ బహుజనులపై దాడే కేంద్రంపై రాహుల్ గాంధీ ధ్వజం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థులను లాటరల్ ఎంట్రీ విధానం ద్వారా ఎంపిక చేయాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీలు, ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్ తదితరుల నుంచి రిజర్వేషన్లను లాక్కుని ఆర్ఎస్ఎస్ వాదులతో నింపేందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రగా ఆయన సోమవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని నాశనం చేయడం, బహుజనులకు రిజర్వేషన్లు లేకుండా చేయడం ద్వారా బీజేపీ దేశాన్ని తనదైన శైలిలో రామరాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. లాటరల్ ఎంట్రీ విధానం అమలును ఆయన జాతి వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వ విభాగాల్లో సంయుక్త కార్యదర్శులు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీల పోస్టులను స్పెషలిస్టుల పేరుతో ప్రైవేట్ వ్యక్తులతో లాటరల్ ఎంట్రీ విధానం ద్వారా భర్తీ చేసేందుకు యూపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్‌పై రాహుల్ ఇలా స్పందించారు.ప్రభుత్వోద్యోగాల్లో కోటా ఉండాల్సిందే: చిరాగ్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లను తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని లోక్‌జనశక్తి పార్టీ(రాం విలాస్) చీఫ్, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ కుండబద్దలు కొట్టారు. లాటరల్ ఎంట్రీ విధానం అమలుపై కేంద్రంతో మాట్లాడతానన్నారు. ‘ప్రభుత్వ నియామకమేదైనా సరే రిజర్వేషన్ నిబంధనలను అమలు చేయాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావుండరాదు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేవు. ప్రభుత్వం కూడా రిజర్వేషన్లను అమలు చేయకుంటే ఎలా? లాటరల్ ఎంట్రీ విషయం ఆదివారం నా దృష్టికి వచ్చింది. ఇది చాలా తీవ్రమైంది. దీనికి మేం అంగీకరించం. ప్రభుత్వంలో భాగస్వామిగా ఈ అంశాన్ని లేవనెత్తుతా’అని అన్నారు. -
కేంద్రంలో ‘ప్రైవేటు’ కార్యదర్శులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో సంయుక్త కార్యదర్శిగా సేవలు అందించేందుకు తొలిసారి 9 మంది ప్రైవేటు రంగ నిపుణుల్ని తీసుకున్నారు. ఈ తొమ్మిది మంది పేర్లను యూపీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. అమీర్‌దూబే(పౌర విమానయాన శాఖ), అరుణ్ గోయల్ (వాణిజ్యం), రాజీవ్ సక్సేనా(ఆర్థిక వ్యవహారాలు), సుజిత్ కుమార్ బాజ్‌పేయి(పర్యావరణం అడవులు, వాతావరణ మార్పు), సౌరభ్ మిశ్రా (ఆర్థిక సేవలు), దినేశ్ దయానంద్ జగ్దలే(నూతన, పునరుత్పాదక ఇంధనం), సుమన్ ప్రసాద్(రోడ్డు రవాణా), భూషణ్ కుమార్(షిప్పింగ్), కొకోలీ ఘోష్(వ్యవసాయం, రైతు సంక్షేమం) త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. నైపుణ్యవంతులైన ప్రైవేటు వ్యక్తుల సేవలను వాడుకునేందుకు కేంద్రం గతేడాది ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రెవిన్యూ, వాణిజ్యం, ఆర్థిక సేవలు, వ్యవసాయం, రోడ్డు రవాణా, షిప్పింగ్ సహా పలు శాఖల్లో పనిచేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో మొత్తం 6,077 మంది దరఖాస్తు చేసుకోగా, వీటిని వడపోసిన యూపీఎస్సీ చివరకు 9 మందిని ఎంపిక చేసింది. -
5లోగా ఫీజులు చెల్లించాలి
ఎస్కేయూ: వర్సిటీ దూరవిద్య విధానంలో లేటరల్ ఎంట్రీ పద్ధతి ద్వారా డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ పొందిన వారు ఈ నెల 5 లోపు కోర్సు ఫీజులు చెల్లించాలని డైరెక్టర్ వెంకటనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థి పదవ తరగతి, ఇంటర్ , డిగ్రీ కో ర్సును మానేసినంతవరకు ఉన్న ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆయా యూనివర్సిటీ స్టూడెంట్స్ డిక్లరేషన్ సర్టిఫికెట్, తదితర సర్టిఫికెట్లు 5 లోపు వర్సిటీకి అందచేయాలని తెలిపారు. -
4న వైఎస్సార్ ఇంజినీరింగ్ కాలేజిలో స్పాట్ అడ్మిషన్లు
ప్రొద్దుటూరు: స్థానిక వైఎస్సార్ ఇంజినీరింగ్‌కాలేజి ఆఫ్ యోగివేమన యూనివర్సిటీలో లేటరల్‌ఎంట్రి (ఈసెట్) సీట్లకు ఈనెల 4న ఉదయం 9 గంటలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి.జయరామిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటరర్జీ అండ్ మెటీరియల్ టెక్నాలజీలో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అడ్మిషన్లకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజనల్ సర్టిఫికెట్లు తీసుకురావాలన్నారు. స్పాట్ అడ్మిషన్లో సీటు పొందిన విద్యార్థులు వెంటనే రూ.10వేలు ట్యూషన్ ఫీజు, రూ.5,500 స్పెషల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్పాట్ అడ్మిషన్లో సీటు పొందిన అభ్యర్థులు ఫీజు రీయింబర్స్‌మెంటుకు అర్హులు కారని ఆయన వివరించారు. -
లేటరల్ ఎంట్రీ ఇవ్వండి !
అర్ధంతరంగా ఉన్నత విద్యను మానేసిన వారికి తమ కోర్సు నిరాటంకంగా కొనసాగించేందుకు దూరవిద్యావిధానాన్ని జాతీయ వ్యాప్తంగా అన్ని వర్శిటీల్లో ప్రవేశపెట్టారు. అయితే డిగ్రీ, పీజీ కోర్సులు అర్ధంతరంగా ఆపిన వారికి ఇతర వర్శిటీల్లోలా ఎస్కేయూలో కూడా లేటరల్ ఎంట్రీకి అనుమతివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. అవకాశం ఉంటే తాజాగా ఇచ్చిన నోటీఫికేషన్లోను అనుమతిచ్చే వెసలుబాటు కల్పించాలంటున్నారు. ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విధానం 2015-16కి నూతన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేశారు. పీజీ, డిగ్రీ కోర్సుల దరఖాస్తుల స్వీకరణకు నూతనంగా ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే అర్ధంతరంగా ఉన్నత విద్య మానేసిన వారికి తమ కోర్సును నిరాటంకంగా కొనసాగించడం, అలాంటి అవకాశం కల్పించడానికి దూరవిద్య విధానాన్ని జాతీయ వ్యాప్తంగా అన్ని వర్సిటీలలో ప్రవేశపెట్టారు. దూరవిద్య విధానం మొదటి ప్రాధాన్యత ఇదే. కానీ ఎస్కేయూలో కేవలం డిగ్రీ, పీజీ కోర్సులకు సంబంధించి మాత్రమే ప్రవేశాలు కల్పిస్తున్నారు. అర్ధంతరంగా మానేసిన వారికి అండ లేటరల్ ఎంట్రీ : డిగ్రీ, పీజీ కోర్సు చేస్తూ అర్ధంతరంగా ఆర్థిక పరిస్థితుల రీత్యా ఉన్నత విద్యను మధ్యలో ఆపేసిన వారు రాయలసీమ జిల్లాల్లో వేలాదిగా ఉన్నారు. వీరిలో సింహభాగం కోర్సు పూర్తీ చేయాలని ఉన్నా, అవకాశం లేక నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటి వారికి ఆంధ్రా వర్సిటీ, నాగార్జున, వెంకటేశ్వర వర్సిటీల్లో లేటరల్ ఎంట్రీ కింద డిగ్రీ, పీజీ దరఖాస్తులు కల్పిస్తున్నారు. ఇందుకు రాష్ర్ట ఉన్నత విద్యా మండలి సైతం అంగీకరించింది. కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 177 అధ్యయన కేంద్రాలు నిర్వహిస్తున్న ఎస్కేయూలో మాత్రం అలాంటి అవకాశం కల్పించలేదు. మొత్తం ఎస్కేయూ అధ్యయన కేంద్రాల్లో 60 వేల మంది డిగ్రీ, పీజీ కోర్సులు అభ్యసిస్తున్నారు. లేటరల్ ఎంట్రీ అంటే.. : రెగ్యులర్ డిగ్రీ కోర్సు చదువుతున్న విద్యార్థి రెండో సంవత్సరం వరకు చదివి అర్ధంతరంగా చదువు ఆపేశాడు. అదే విద్యార్థికి దూరవిద్య విధానం ద్వారా చదివే అవకాశం కల్పించడాన్నే లేటరల్ ఎంట్రీ అంటారు. అలాగే పొరుగు వర్సిటీల్లోని దూరవిద్య విధానం ద్వారా పీజీ, డిగ్రీ కోర్సు అర్ధంతరంగా మానేసిన విద్యార్థికి ఎస్కేయూ దూరవిద్య విధానం ద్వారా ఉన్నత విద్య చదవడానికి తగిన అనుమతి ఇవ్వడం. ఈ తరహా విధానం ఎస్కేయూ దూరవిద్య విధానంలో అమలు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అవకాశం కల్పిస్తే తాజాగా ఇచ్చే నోటిఫికేషన్లోనే అడ్మిషన్ పొందటానికి తగిన వెసలుబాటు కల్పించినట్లు అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.