లేటరల్ ఎంట్రీ ఇవ్వండి !
అర్ధంతరంగా ఉన్నత విద్యను మానేసిన వారికి తమ కోర్సు నిరాటంకంగా కొనసాగించేందుకు దూరవిద్యావిధానాన్ని జాతీయ వ్యాప్తంగా అన్ని వర్శిటీల్లో ప్రవేశపెట్టారు. అయితే డిగ్రీ, పీజీ కోర్సులు అర్ధంతరంగా ఆపిన వారికి ఇతర వర్శిటీల్లోలా ఎస్కేయూలో కూడా లేటరల్ ఎంట్రీకి అనుమతివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. అవకాశం ఉంటే తాజాగా ఇచ్చిన నోటీఫికేషన్‌లోను అనుమతిచ్చే వెసలుబాటు కల్పించాలంటున్నారు.
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విధానం 2015-16కి నూతన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేశారు. పీజీ, డిగ్రీ కోర్సుల దరఖాస్తుల స్వీకరణకు నూతనంగా ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే అర్ధంతరంగా ఉన్నత విద్య మానేసిన వారికి తమ కోర్సును నిరాటంకంగా కొనసాగించడం, అలాంటి అవకాశం కల్పించడానికి దూరవిద్య విధానాన్ని జాతీయ వ్యాప్తంగా అన్ని వర్సిటీలలో ప్రవేశపెట్టారు. దూరవిద్య విధానం మొదటి ప్రాధాన్యత ఇదే. కానీ ఎస్కేయూలో కేవలం డిగ్రీ, పీజీ కోర్సులకు సంబంధించి మాత్రమే ప్రవేశాలు కల్పిస్తున్నారు.
అర్ధంతరంగా మానేసిన వారికి అండ లేటరల్ ఎంట్రీ : డిగ్రీ, పీజీ కోర్సు చేస్తూ అర్ధంతరంగా ఆర్థిక పరిస్థితుల రీత్యా ఉన్నత విద్యను మధ్యలో ఆపేసిన వారు రాయలసీమ జిల్లాల్లో వేలాదిగా ఉన్నారు. వీరిలో సింహభాగం కోర్సు పూర్తీ చేయాలని ఉన్నా, అవకాశం లేక నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటి వారికి ఆంధ్రా వర్సిటీ, నాగార్జున, వెంకటేశ్వర వర్సిటీల్లో లేటరల్ ఎంట్రీ కింద డిగ్రీ, పీజీ దరఖాస్తులు కల్పిస్తున్నారు. ఇందుకు రాష్ర్ట ఉన్నత విద్యా మండలి సైతం అంగీకరించింది. కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 177 అధ్యయన కేంద్రాలు నిర్వహిస్తున్న ఎస్కేయూలో మాత్రం అలాంటి అవకాశం కల్పించలేదు. మొత్తం ఎస్కేయూ అధ్యయన కేంద్రాల్లో 60 వేల మంది డిగ్రీ, పీజీ కోర్సులు అభ్యసిస్తున్నారు.
లేటరల్ ఎంట్రీ అంటే.. : రెగ్యులర్ డిగ్రీ కోర్సు చదువుతున్న విద్యార్థి రెండో సంవత్సరం వరకు చదివి అర్ధంతరంగా చదువు ఆపేశాడు. అదే విద్యార్థికి దూరవిద్య విధానం ద్వారా చదివే అవకాశం కల్పించడాన్నే లేటరల్ ఎంట్రీ అంటారు. అలాగే పొరుగు వర్సిటీల్లోని దూరవిద్య విధానం ద్వారా పీజీ, డిగ్రీ కోర్సు అర్ధంతరంగా మానేసిన విద్యార్థికి ఎస్కేయూ దూరవిద్య విధానం ద్వారా ఉన్నత విద్య చదవడానికి తగిన అనుమతి ఇవ్వడం. ఈ తరహా విధానం ఎస్కేయూ దూరవిద్య విధానంలో అమలు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అవకాశం కల్పిస్తే తాజాగా ఇచ్చే నోటిఫికేషన్లోనే అడ్మిషన్ పొందటానికి తగిన వెసలుబాటు కల్పించినట్లు అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.