అందరికీ ఆదర్శంగా నిలవాలి
ఢిల్లీ పోలీసులకు కేంద్ర హోం మంత్రి ఉద్భోత
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ ఆగస్టు 8: ఆదర్శ పోలీసు బలగంగా రూపొందాలని హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీ పోలీసులను కోరారు. నిజాయితీ, చిత్తశుద్ధి, అంకితభావాలతో ప్రజలకు సేవలందించినట్లయితే ఢిల్లీ పోలీసు సిబ్బందికి, వారి గౌరవాన్ని కాపాడడానికి కేంద్రం పూర్తి సహకారాన్ని అందిస్తుందని ఆయన చెప్పారు. పాస్‌పోర్టు, వీసా, ఇతర సేవల కోసం పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందడానికి ఢిల్లీ పోలీసులు తమ వెబ్‌సైట్‌పై ప్రవేశపెట్టిన వెబ్ అప్లికేషన్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ వెబ్ అప్లికేషన్ ప్రవేశపెట్టడాన్ని ప్రజల నమ్మకాన్ని చూరగొనడం కోసం చేపట్టిన చర్యగా అభివర్ణించారు. దీని వల్ల ప్రతి సంవత్సరం లక్ష మంది ప్రయోజనం పొందుతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీ పోలీసులు అంకితభావంతో పనిచేస్తున్నారనడానికి ఈ కొత్త సేవ అద్దం పడ్తోందని ఆయన అభినందించారు.
ఢిల్లీ రాష్ట్రం ఆదర్శ రాష్ట్రం కావాలని హోమ్ మంత్రి చెప్పారు. అలా జరిగితే యావద్దేశం ఢిల్లీని అనుకరిస్తుందని ఆయన చెప్పారు. దేశం విశ్వసనీయత అనే సమస్యను ఎదుర్కొంటోందని, ఢిల్లీ పోలీసులు దీనిని సవాలుగా స్వీకరించి నిజాయితీతో, చిత్తశుద్ధితో సేవలందించడం ద్వారా ప్రజల మనసులను, వారి మెప్పును గెలుచుకోవాలని ఆయన కోరారు. పోలీసులు అలా చేస్తే తాము వారికి పూర్తి మద్దతు అందిస్తామని, ఢిల్లీ పోలీసుల గౌరవ ప్రతిష్టలను కాపాడేందుకు, ఢిల్లీ పోలీసును అత్యాధునిక బలంగా తీర్చిదిద్దడానికి కేంద్రం అండగా నిలబడుతుందని ఆయన చెప్పారు.