మోర్తాడ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో తక్కువ ధరకు లభించే బంగారాన్ని ఇక్కడికి అక్రమంగా తరలించడానికి స్మగ్లర్ల ముఠాలు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా స్థానిక ముఠాలు, గల్ఫ్ స్మగ్లర్లతో కలసి ఉపాధి పేరుతో నిరుద్యోగ యువతకు గాలం వేస్తున్నాయి. దుబాయ్, షార్జా తదితర ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి తమ దందాకు పావులుగా వాడుకుంటున్నాయి.
విజిట్ వీసాలపై యూఏఈ వెళ్లిన తర్వాత వర్క్ వీసాలు ఇప్పిస్తామని స్మగ్లర్లు నమ్మిస్తున్నారు. వారి మాటలు నమ్మి విజిట్ వీసాలపై యూఏఈ వెళ్లిన యువకులకు తమ పథకంలో భాగంగా ఎలాంటి పని చూపకుండా ఖాళీగా కూర్చోబెడుతున్నారు. పని కోసం వేచిచూసి విసిగిపోతున్న యువకులు తాము ఇంటికి వెళ్తామని చెప్పగానే అలాంటి వారికి బంగారం దాచి ఉంచిన సూట్‌కేసులు, బ్యాగులను ఇచ్చి పంపిస్తున్నారు.
ఎయిర్‌పోర్టులలో పట్టుబడినప్పుడు ఈ స్మగ్లింగ్ వ్యవహారంపై అవగాహన లేని అమాయకులు కటకటాల పాలవుతున్నారు. స్మగ్లర్లు మాత్రం తప్పించుకుంటున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దుబాయ్ నుంచి వేరువేరు విమానాల్లో వచ్చిన ముగ్గురు యువకుల నుంచి రూ.4 కోట్ల విలువ చేసే బంగారం కడ్డీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. అంతకు ముందు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెంకు చెందిన అస్లాం అనే 19 ఏళ్ల యువకుడి నుంచి రూ.1.20 కోట్ల విలువ చేసే బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని అతడిని రిమాండ్‌కు తరలించారు. ఈ రెండు ఘటనలను పరిశీలిస్తే బంగారం స్మగ్లర్లు తమ దందా కోసం కొత్తగా గల్ఫ్‌కు వెళ్లాలనుకునే యువతను లక్ష్యంగా చేసుకున్నట్టు స్పష్టమవుతోంది.
కంపెనీ వీసాలుంటేనే రండి..: వర్క్ వీసా ఇస్తే కంపెనీలో పని చేసుకుంటారని.. అలా కాకుండా విజిట్ వీసాతో రప్పించి పని చూపకుండా ఖాళీగా ఉంచితే ఇంటికి వెళ్తామని ఆ యువకులే స్వచ్ఛందంగా చెబుతారని స్మగ్లర్లు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లోనే బంగారం స్మగ్లింగ్ గుట్టు బయటపడుతుండగా అనేక సమయాల్లో బంగారం యథేచ్ఛగా అక్రమ రవాణా అవుతోందని తెలుస్తోంది. కాగా, యూఏఈలో విజిట్ వీసాలపై వచ్చిన వారికి పనులు సులభంగా దొరకడం లేదని, కంపెనీ వీసాలు ఉంటేనే రావాలని వలస కార్మికుల సంఘాల నాయకులు సూచిస్తున్నారు. స్మగ్లర్ల మాయమాటలు నమ్మి జైలు పాలుకావద్దని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment