బంగారం లాంటి ఐడియా
బంగారం లాంటి ఐడియా
Published Mon, Mar 10 2014 3:16 PM | Last Updated on Thu, Aug 2 2018 4:08 PM
తక్కువ ధరకు బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే ఇంకెందుకు ఆలస్యం ఎడారి దేశంలో అడుగు పెట్టండి. చక్కగా మూడు, నాలుగు రోజులపాటు అక్కడ పర్యాటక ప్రాంతాలను తిలకించండి. వస్తూ.. వస్తూ బంగారు ఆభరణాలను కొనుగోలు చేయండి. ఇక్కడకు తెచ్చి విక్రయించండి. లాభాలు గడించండి. లాభానికి లాభం.. ఉల్లాసానికి ఉల్లాసం. ఇది జిల్లాలోని పలువురు స్వర్ణ వ్యాపారుల నయా టెక్నిక్.
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్:ఇటీవల జిల్లాలోని కొందరు బంగారం వ్యాపారులు తరచూ కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లివస్తున్నారు. ఎందుకని ఆరా తీస్తే ఓ వ్యాపార రహస్యం బయటపడింది. మన మార్కెట్ కన్నా దుబాయ్‌లో బంగారం ధర కాసు (8 గ్రాములు)కు సుమారు రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు తక్కువగా ఉంది. పైగా అక్కడి నుంచి ఆభరణాలు తెచ్చుకునేందుకు పెద్దగా ఆంక్షలేమి లేవు. ఇది బంగారు వ్యాపారులకు వరంగా మారింది. దీనికి తోడు దుబాయ్ టూర్ ప్యాకేజీలు అనుకూలంగా ఉన్నాయి.
కేవలం ఓ వ్యక్తి రూ. 50 వేలతో మూడు నుంచి నాలుగు రోజులపాటు దుబాయ్‌లో ఎంచక్కా తిరిగి రావొచ్చు. ఈ పరిస్థితులను వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ విమానం ఎక్కేస్తున్నారు. మూడు, నాలుగు రోజులపాటు అక్కడ విహరించి వస్తూ ఒక్కొక్కరూ సుమారు మూడు వందల గ్రాముల వరకు బంగారు ఆభరణాలను వెంట తెచ్చుకుంటున్నారు. వీటికి వాల్యూబుల్ గూడ్స్ పేరుతో ఆరు నుంచి ఏడు వేల వరకు ఎక్సైజ్ సుంకాన్ని చెల్లిస్తున్నారు.
చిట్కాలూ పాటిస్తున్నారు
దుబాయ్ బంగారు ఆభరణాలను ఇక్కడ అదే రూపంలో విక్రయించడం లేదా కరిగించి కొత్త ఆభరణాలు తయారుచేస్తూ లాభాలు గడిస్తున్నారు. ఇలా చేయడం వలన ఒక వ్యక్తికి ఖర్చులు పోను రూ.50 వేల వరకు మిగులుతుందని అంచనా. నలుగురు కుటుంబసభ్యులు వెళ్లి వస్తే సుమారు రూ. 2 లక్షల వరకు మిగులుతుం ది. ఇందుకు వ్యాపారులు చిట్కాలను పాటిస్తున్నారు. దుబాయ్ వెళ్లేటపుడు గిల్ట్ నగలు వేసుకుని తిరిగి ప్రయాణంలో బంగారు ఆభరణాలతో వస్తున్నారు. ఆభరణాలు తెచ్చుకునేందుకు ఆంక్షలు లేకపోగా బిస్కెట్ రూపంలో తీసుకురావడానికి వీలులేదు. అయితే కొందరు దురాశకు పోయి బిస్కెట్‌లను తీసుకువస్తూ దొరికిపోతున్నారు.
Advertisement