న్యూఢిల్లీ: రూ.18.6 కోట్ల విలువైన 25 కిలోల బంగారాన్ని దుబాయ్ నుంచి అక్రమ రవాణా చేస్తూ ముంబై ఎయిర్‌పోర్టులో దొరికిపోయిన అఫ్గానిస్తాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్దక్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె తొలుత ముంబైలో అఫ్గాన్ కాన్సూల్ జనరల్‌గా రెండేళ్లు పనిచేశారు. గత ఏడాది ఇండియాలో అఫ్గాన్ రాయబారిగా బాధ్యతలు చేపట్టారు.
గత నెల 25వ తేదీన ముంబై ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు జకియా వార్దక్ నుంచి 25 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆమె బంగారాన్ని దుబాయి నుంచి చట్టవిరుద్ధంగా తరలిస్తూ దొరికిపోయినట్లు వార్తలొచ్చాయి. దౌత్యవేత్త కావడంతో ఈ కేసులో అరెస్టు కాకుండా ఆమె మినహాయింపు పొందారు. అయితే, తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు జకియా వార్దక్ తాజాగా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తనపై వ్యక్తిగతంగా విమర్శల దాడి జరుగుతోందని, దీనివల్ల విధులు సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నానని, అందుకే రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment