భారత్‌లోని అఫ్గనిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్దక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనపై వ్యక్తిగత దాడులు, నిరంతర పరువునష్టం తన రాజీనామాకు కారణమని ఆమె పేర్కొన్నారు. మహిళా ప్రతినిధిని లక్ష్యంగా చేసుకొని తనపై దాడులు జరిగాయని వార్దక్ అన్నారు.
ముంబైలో ఆఫ్ఘనిస్తాన్ కాన్సుల్ జనరల్‌గా ఉండటంతో పాటు న్యూఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్ తాత్కాలిక రాయబారి బాధ్యతలను కూడా జకియా వార్దక్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆమె ముంబై విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులకు పట్టుబడ్డారు. దాదాపు రూ 18 కోట్ల విలువైన బంగారాన్ని ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు.
దుబాయ్ నుంచి భారత్‌కు తన వస్త్రాల్లో తరలించారని, ముమ్మర తనిఖీలు చేయగా ఈ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడిందని అధికారులు పేర్కొన్నారు. ముంబయిలో ఏప్రిల్ 25న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జకియా వార్ధక్ శనివారం తెలిపారు.
కాగా వార్ధక్ బంగారాన్నిఅక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు విమానాశ్రయంలో సిబ్బందిని మోహరించారు. ఏప్రిల్ 25న ఆమె తన కుమారుడితో కలిసి ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుంచి ముంబయికి చేరుకున్నారు. విమానం దిగిన తర్వాత గ్రీన్ ఛానల్ నుంచి ఎయిర్‌పోర్టు బయటకు వచ్చారు. దౌత్యవేత్త కావడంతో ఆమెును తనిఖీలు చేయలేదు.
అయితే, ఎయిర్‌పోర్టు ఎగ్జిట్ వద్ద డీఆర్‌ఐ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. తొలుత స్మగ్లింగ్ ఆరోపణల గురించి ప్రశ్నించగా.. ఆమె వాటిని తోసిపుచ్చారు. అనంతరం ఆమెను గదిలోకి తీసుకెళ్లి మహిళా అధికారులతో తనిఖీలు చేయించగా... ఆమె దుస్తుల్లో ఏకంగా 25 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. ఒక్కో కడ్డీ బరువు కేజీ వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారానికి సంబంధించి సరైన పత్రాలను ఆమె సమర్పించకపోవడంతో అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సాధారణంగా ఇలాంటి స్మగ్లింగ్ కేసుల్లో అనుమానితులను వెంటనే అరెస్టు చేస్తారు. అయితే వార్ధక్‌కు దౌత్యపరమైన రక్షణ ఉండటంతో ఆమెను అదుపులోకి తీసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment