ఢాకా: బంగారాన్ని అక్రమంగా సరిహద్దులు దాటించేందుకు ప్రయత్నించిన ఐదుగురు భారతీయులను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 4.4 కేజీల విలువైన 36 బంగారు కడ్డీలను మలద్వారంలో ఉంచి తరలిస్తుండగా ఆదివారం వీరిని భారత సరిహద్దుల్లోని జెస్సోర్ జిల్లాలో పట్టుకున్నట్టు బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో నాగ్‌పూర్‌కు చెందిన విజయ్ చంద్ర, రుహిత్ అశోక్, కోమల్ ఒతారర్, రాజ్‌కుమార్, అహ్మదాబాద్‌కు చెందిన రాకేష్ ఉన్నారు.
వీరు జూన్ 19న దుబాయ్ నుంచి ఢాకా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారని, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను ముగించుకుని ఆదివారం భారత్‌కు పయనమయ్యారని బంగ్లదేశ్ బోర్డు గార్డ్ అధికారి రహమాన్ తెలిపారు. అయితే సరిహద్దును దాటే క్రమంలో వీరి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో వారి బస్సును వెంటాడి అరెస్ట్ చేసినట్టు చెప్పారు.