బంగారం దిగుమతులపై నేడోరేపో ఆంక్షలు!
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులు గత రెండు నెలలుగా పెరిగిన నేపథ్యంలో, ఈ మెటల్ దిగుమతులపై నేడోరేపో ఆంక్షలు విధించే అవకాశం ఉందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టుతప్పరాదని కేంద్రం భావిస్తోందని, ఈ పరిస్థితుల్లో దిగుమతులపై మరికొన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. దీనిపై ఆర్థిక మంత్రిత్వశాఖ పూర్తిస్థాయి దృష్టి పెట్టినట్లు సమాచారం. పసిడి దిగుమతులు ప్రధాన కారణంగా అక్టోబర్ వాణిజ్యలోటు పెరిగిన సంగతి తెలిసిందే.
2013 అక్టోబర్‌లో బంగారం దిగుమతుల విలువ 1.09 బిలియన్ డాలర్లు. అయితే 2014 అక్టోబర్‌లో ఈ విలువ ఏకంగా 4.17 బిలియన్ డాలర్లకు ఎగసింది. బంగారం, వెండి రెండింటినీ చూస్తే ఈ విలువ 1.38 బిలియన్ డాలర్ల నుంచి 4.85 బిలియన్ డాలర్లకు చేరింది. దేశ కరెంట్ అకౌంట్ లోటు కట్టడిలో భాగంగా ప్రభుత్వం గత కొన్ని నెలలుగా కనకం దిగుమతుల కట్టడికి తీసుకుంటున్న చర్యల వల్ల ఈ మెటల్ దిగుమతులు గణనీయంగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. వరుసగా రెండవ నెల అక్టోబర్‌లోనూ(సెప్టెంబర్ 4.22 బిలియన్ డాలర్లు) బంగారం దిగుమతులు 4 బిలియన్ డాలర్లు పైగా నమోదుకావడం- తాజా ఆందోళనకు కారణం. ఈ మెటల్ దిగుమతుల కట్టడికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రా సోమవారం తెలిపారు.