మోర్తాడ్, న్యూస్‌లైన్ : రబీలో తెల్ల హంస రకం వరిని సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ రకం విత్తనం కొరత తీవ్రంగా ఉండటంతో వారు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం 1010 రకం వరి సాగుకు ఇస్తు న్న ప్రాధాన్యతను తెల్ల హంస రకానికి ఇవ్వక పోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్ జిల్లా ముల్కనూర్ సహకార సంఘం ఆధ్వర్యంలోని సీడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లలో తెల్లహంస విత్తనాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విత్తనాలను సహకార సంఘాలు సరిగా మార్కెట్ చేయడం లేదన్న కారణంతో వారు ప్రైవేట్ వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరా చేసుకుంటున్న వ్యాపారులు విత్తనాల ధరను అమాంతం పెంచేశారు. 30 కిలోల సంచికి రూ. 635 ధర ఉండగా వ్యాపారులు రూ. 850లకు విక్రయిస్తున్నారు. దీంతో విత్తనాల కోసం రైతులు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది.
రబీ సీజన్‌లో జిల్లాలో 2.40 లక్షల హెక్టార్‌లలో వరిసాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఈ సీజన్‌లో ఎక్కువ మొత్తంలో దొడ్డు రకం వరి వేస్తారు. ఏపీ సీడ్ కార్పొరేషన్ అధికారులు 1010 రకం వరి వంగడాన్ని మాత్రమే సరఫరా చేస్తున్నారు. రబీలో విద్యుత్ సరఫరా, అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని రైతులు తెల్ల హంస సాగుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 1010 రకం వరి విత్తనాన్ని సాగు చేస్తే వంద రోజుల తర్వాత కోతలు చేపట్టాల్సి వస్తుంది. తె ల్ల హంస రకం పక్షం ముందుగానే కోతకు వస్తుంది. రబీలో విద్యుత్ కోత ఏర్పడటం, అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తక్కువ కాలంలోనే పంట చేతికి వచ్చే రకం సాగు చేయాలని రైతులు భావిస్తున్నారు. తెల్ల హంస రకం వరి పాత రకం కావడంతో నిజామాబాద్ జిల్లా సారంగపూర్‌లోని ఏపీ సీడ్స్ కంపెనీలో తక్కువ ఉత్పత్తి చేశారు. దీంతో రైతులు ముల్కనూర్ సహకార సంఘం ఉత్పత్తి చేస్తున్న తెల్ల హంస విత్తనాలను పొందడానికి పోటీ పడుతున్నారు. ముల్కనూర్ సహకార సంఘంలో ఉత్పత్తి చేసిన విత్తనాలను ప్రైవేట్ వ్యాపారులు బ్లాక్ చేయడంతో కొరత ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి తెల్ల హంస రకం వరి విత్తనాలను సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకే..
-సుదర్శన్ రెడ్డి, ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్
ప్రభుత్వం 1010 రకం వరి విత్తనాలను సరఫరా చేయాలని ఆదేశించింది. అందుకే ఈ రకం వరి విత్తనాలను ఎక్కువగా ఉత్పత్తి చేశాం. తెల్ల హంస రకం వరి విత్తనాలను వెయ్యి క్వింటాళ్లు మాత్రమే ఉత్పత్తి చేశాం. ప్రభుత్వం ఆదే శించిన విధంగా విత్తనోత్పత్తి చేయడం మా పని.
‘తెల్ల హంస’కు కొరతొచ్చింది
Published Sat, Nov 23 2013 6:15 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM
Advertisement
Advertisement