రబీ విత్తనాలకు రిజిస్ట్రేషన్లు షురూ | Andhra Pradesh Govt Started Rabi seeds Distribution | Sakshi
Sakshi News home page

రబీ విత్తనాలకు రిజిస్ట్రేషన్లు షురూ

Published Mon, Oct 3 2022 6:00 AM | Last Updated on Mon, Oct 3 2022 2:47 PM

Andhra Pradesh Govt Started Rabi seeds Distribution - Sakshi

కర్నూలు జిల్లా తర్టూర్‌ ఆర్బీకేకు చేరిన శనగ విత్తనాలు

సాక్షి, అమరావతి: రబీ విత్తనాల పంపిణీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలను సీజన్‌కు ముందే రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) సిద్ధంచేశారు. వీటి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కూడా ఇప్పటికే ప్రారంభించారు. కర్నూలు, నంద్యాల ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్‌తో పాటు శనగ, చిరుధాన్యాల విత్తనాల పంపిణీని ప్రారంభించారు.

ఈ రెండు జిల్లాల్లో 1,600 క్వింటాళ్ల శనగ విత్తనాలను సిద్ధంచేశారు. మిగిలిన జిల్లాల్లో 15వ తేదీ నుంచి అన్ని రకాల విత్తనాలు పంపిణీ చేస్తారు. రబీలో 58.67 లక్షల ఎకరాల్లో సాగు చేయాల ని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధానంగా 20.78 లక్షల ఎకరాల్లో వరి, 10.43 లక్షల ఎకరాల్లో శనగ, 9.22 లక్షల ఎకరాల్లో మినుము, ఐదు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 2.54 లక్షల ఎకరాల్లో జొన్న, 2.52 లక్షల ఎకరాల్లో పెసలు, 2.43 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగుచేయనున్నారు.   

ల్యాబుల్లో పరీక్షలు.. సర్టిఫైడ్‌ విత్తనాలు 
ఇక ఈ సీజన్‌ కోసం మొత్తం 2,22,960 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధంచేశారు. వీటిలో ప్రధానంగా శనగ 1,26,656 క్వింటాళ్లు, వేరుశనగ 48,122, వరి 20,134, మినుము 19,693, పెసలు 6,477, ఉలవలు 513, నువ్వులు 464, కందులు 87, చిరుధాన్యాలు 264, అలసందలు (కౌపీ) 14 క్వింటాళ్లతో పాటు పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగు 5, పిల్లిపెసర 8, జనుము 523 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధంచేశారు.

వరి, వేరుశనగ, చిరుధాన్యాలతో పాటు 60 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలను రైతుల నుంచి సేకరించి ఇంటిగ్రేటెడ్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్‌లో పరీక్షించి ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లుచేస్తున్నారు. 

రైతన్నలకు రాయితీలు.. 
రబీ సీజన్‌లో పచ్చిరొట్ట, చిరుధాన్యాలు, ఉలవలు 50శాతం, వేరుశనగ, నువ్వుల విత్తనాలను 40 శాతం, మినుము, పెసలు, కందులు, అలసందలు విత్తనాలను 30 శాతం, శనగలు 25 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తారు. వరి ఆహార భద్రత పథకం వర్తించే జిల్లాల్లో క్వింటాల్‌కు రూ.1,000 చొప్పున, వర్తించని జిల్లాల్లో రూ.500చొప్పున విత్తనాలపై సబ్సిడీ ఇవ్వనున్నారు. సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.50.79 కోట్లు భరించనుంది.

నాణ్యత ధ్రువీకరించాకే పంపిణీ
రబీ సీజన్‌కు సరిపడా సర్టిఫై చేసిన విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీకి ఏర్పాట్లుచేశాం. రైతుల ద్వారా సేకరించిన విత్తనాలతో పాటు ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా ప్రైవేట్‌ కంపెనీల నుంచి సేకరించి అగ్రి ల్యాబ్‌లలో నాణ్యత ధ్రువీకరించిన తర్వాత రైతులకు అందించేలా ఏర్పాట్లుచేశాం.  
– గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ సీడ్స్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement