rabi seeds
-
రబీ విత్తనాలకు రిజిస్ట్రేషన్లు షురూ
సాక్షి, అమరావతి: రబీ విత్తనాల పంపిణీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలను సీజన్‌కు ముందే రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) సిద్ధంచేశారు. వీటి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ఇప్పటికే ప్రారంభించారు. కర్నూలు, నంద్యాల ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్‌తో పాటు శనగ, చిరుధాన్యాల విత్తనాల పంపిణీని ప్రారంభించారు. ఈ రెండు జిల్లాల్లో 1,600 క్వింటాళ్ల శనగ విత్తనాలను సిద్ధంచేశారు. మిగిలిన జిల్లాల్లో 15వ తేదీ నుంచి అన్ని రకాల విత్తనాలు పంపిణీ చేస్తారు. రబీలో 58.67 లక్షల ఎకరాల్లో సాగు చేయాల ని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధానంగా 20.78 లక్షల ఎకరాల్లో వరి, 10.43 లక్షల ఎకరాల్లో శనగ, 9.22 లక్షల ఎకరాల్లో మినుము, ఐదు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 2.54 లక్షల ఎకరాల్లో జొన్న, 2.52 లక్షల ఎకరాల్లో పెసలు, 2.43 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగుచేయనున్నారు. ల్యాబుల్లో పరీక్షలు.. సర్టిఫైడ్ విత్తనాలు ఇక ఈ సీజన్ కోసం మొత్తం 2,22,960 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధంచేశారు. వీటిలో ప్రధానంగా శనగ 1,26,656 క్వింటాళ్లు, వేరుశనగ 48,122, వరి 20,134, మినుము 19,693, పెసలు 6,477, ఉలవలు 513, నువ్వులు 464, కందులు 87, చిరుధాన్యాలు 264, అలసందలు (కౌపీ) 14 క్వింటాళ్లతో పాటు పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగు 5, పిల్లిపెసర 8, జనుము 523 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధంచేశారు. వరి, వేరుశనగ, చిరుధాన్యాలతో పాటు 60 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలను రైతుల నుంచి సేకరించి ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌లో పరీక్షించి ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లుచేస్తున్నారు. రైతన్నలకు రాయితీలు.. రబీ సీజన్లో పచ్చిరొట్ట, చిరుధాన్యాలు, ఉలవలు 50శాతం, వేరుశనగ, నువ్వుల విత్తనాలను 40 శాతం, మినుము, పెసలు, కందులు, అలసందలు విత్తనాలను 30 శాతం, శనగలు 25 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తారు. వరి ఆహార భద్రత పథకం వర్తించే జిల్లాల్లో క్వింటాల్‌కు రూ.1,000 చొప్పున, వర్తించని జిల్లాల్లో రూ.500చొప్పున విత్తనాలపై సబ్సిడీ ఇవ్వనున్నారు. సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.50.79 కోట్లు భరించనుంది. నాణ్యత ధ్రువీకరించాకే పంపిణీ రబీ సీజన్‌కు సరిపడా సర్టిఫై చేసిన విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీకి ఏర్పాట్లుచేశాం. రైతుల ద్వారా సేకరించిన విత్తనాలతో పాటు ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా ప్రైవేట్ కంపెనీల నుంచి సేకరించి అగ్రి ల్యాబ్‌లలో నాణ్యత ధ్రువీకరించిన తర్వాత రైతులకు అందించేలా ఏర్పాట్లుచేశాం. – గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ సీడ్స్ -
‘తెల్ల హంస’కు కొరతొచ్చింది
మోర్తాడ్, న్యూస్‌లైన్ : రబీలో తెల్ల హంస రకం వరిని సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ రకం విత్తనం కొరత తీవ్రంగా ఉండటంతో వారు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం 1010 రకం వరి సాగుకు ఇస్తు న్న ప్రాధాన్యతను తెల్ల హంస రకానికి ఇవ్వక పోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్ జిల్లా ముల్కనూర్ సహకార సంఘం ఆధ్వర్యంలోని సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో తెల్లహంస విత్తనాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విత్తనాలను సహకార సంఘాలు సరిగా మార్కెట్ చేయడం లేదన్న కారణంతో వారు ప్రైవేట్ వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరా చేసుకుంటున్న వ్యాపారులు విత్తనాల ధరను అమాంతం పెంచేశారు. 30 కిలోల సంచికి రూ. 635 ధర ఉండగా వ్యాపారులు రూ. 850లకు విక్రయిస్తున్నారు. దీంతో విత్తనాల కోసం రైతులు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. రబీ సీజన్లో జిల్లాలో 2.40 లక్షల హెక్టార్లలో వరిసాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఈ సీజన్లో ఎక్కువ మొత్తంలో దొడ్డు రకం వరి వేస్తారు. ఏపీ సీడ్ కార్పొరేషన్ అధికారులు 1010 రకం వరి వంగడాన్ని మాత్రమే సరఫరా చేస్తున్నారు. రబీలో విద్యుత్ సరఫరా, అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని రైతులు తెల్ల హంస సాగుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 1010 రకం వరి విత్తనాన్ని సాగు చేస్తే వంద రోజుల తర్వాత కోతలు చేపట్టాల్సి వస్తుంది. తె ల్ల హంస రకం పక్షం ముందుగానే కోతకు వస్తుంది. రబీలో విద్యుత్ కోత ఏర్పడటం, అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తక్కువ కాలంలోనే పంట చేతికి వచ్చే రకం సాగు చేయాలని రైతులు భావిస్తున్నారు. తెల్ల హంస రకం వరి పాత రకం కావడంతో నిజామాబాద్ జిల్లా సారంగపూర్‌లోని ఏపీ సీడ్స్ కంపెనీలో తక్కువ ఉత్పత్తి చేశారు. దీంతో రైతులు ముల్కనూర్ సహకార సంఘం ఉత్పత్తి చేస్తున్న తెల్ల హంస విత్తనాలను పొందడానికి పోటీ పడుతున్నారు. ముల్కనూర్ సహకార సంఘంలో ఉత్పత్తి చేసిన విత్తనాలను ప్రైవేట్ వ్యాపారులు బ్లాక్ చేయడంతో కొరత ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి తెల్ల హంస రకం వరి విత్తనాలను సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే.. -సుదర్శన్ రెడ్డి, ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ ప్రభుత్వం 1010 రకం వరి విత్తనాలను సరఫరా చేయాలని ఆదేశించింది. అందుకే ఈ రకం వరి విత్తనాలను ఎక్కువగా ఉత్పత్తి చేశాం. తెల్ల హంస రకం వరి విత్తనాలను వెయ్యి క్వింటాళ్లు మాత్రమే ఉత్పత్తి చేశాం. ప్రభుత్వం ఆదే శించిన విధంగా విత్తనోత్పత్తి చేయడం మా పని.