Quality seeds
-
రబీ విత్తనాలకు రిజిస్ట్రేషన్లు షురూ
సాక్షి, అమరావతి: రబీ విత్తనాల పంపిణీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలను సీజన్‌కు ముందే రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) సిద్ధంచేశారు. వీటి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ఇప్పటికే ప్రారంభించారు. కర్నూలు, నంద్యాల ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్‌తో పాటు శనగ, చిరుధాన్యాల విత్తనాల పంపిణీని ప్రారంభించారు. ఈ రెండు జిల్లాల్లో 1,600 క్వింటాళ్ల శనగ విత్తనాలను సిద్ధంచేశారు. మిగిలిన జిల్లాల్లో 15వ తేదీ నుంచి అన్ని రకాల విత్తనాలు పంపిణీ చేస్తారు. రబీలో 58.67 లక్షల ఎకరాల్లో సాగు చేయాల ని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధానంగా 20.78 లక్షల ఎకరాల్లో వరి, 10.43 లక్షల ఎకరాల్లో శనగ, 9.22 లక్షల ఎకరాల్లో మినుము, ఐదు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 2.54 లక్షల ఎకరాల్లో జొన్న, 2.52 లక్షల ఎకరాల్లో పెసలు, 2.43 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగుచేయనున్నారు. ల్యాబుల్లో పరీక్షలు.. సర్టిఫైడ్ విత్తనాలు ఇక ఈ సీజన్ కోసం మొత్తం 2,22,960 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధంచేశారు. వీటిలో ప్రధానంగా శనగ 1,26,656 క్వింటాళ్లు, వేరుశనగ 48,122, వరి 20,134, మినుము 19,693, పెసలు 6,477, ఉలవలు 513, నువ్వులు 464, కందులు 87, చిరుధాన్యాలు 264, అలసందలు (కౌపీ) 14 క్వింటాళ్లతో పాటు పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగు 5, పిల్లిపెసర 8, జనుము 523 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధంచేశారు. వరి, వేరుశనగ, చిరుధాన్యాలతో పాటు 60 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలను రైతుల నుంచి సేకరించి ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌లో పరీక్షించి ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లుచేస్తున్నారు. రైతన్నలకు రాయితీలు.. రబీ సీజన్లో పచ్చిరొట్ట, చిరుధాన్యాలు, ఉలవలు 50శాతం, వేరుశనగ, నువ్వుల విత్తనాలను 40 శాతం, మినుము, పెసలు, కందులు, అలసందలు విత్తనాలను 30 శాతం, శనగలు 25 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తారు. వరి ఆహార భద్రత పథకం వర్తించే జిల్లాల్లో క్వింటాల్‌కు రూ.1,000 చొప్పున, వర్తించని జిల్లాల్లో రూ.500చొప్పున విత్తనాలపై సబ్సిడీ ఇవ్వనున్నారు. సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.50.79 కోట్లు భరించనుంది. నాణ్యత ధ్రువీకరించాకే పంపిణీ రబీ సీజన్‌కు సరిపడా సర్టిఫై చేసిన విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీకి ఏర్పాట్లుచేశాం. రైతుల ద్వారా సేకరించిన విత్తనాలతో పాటు ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా ప్రైవేట్ కంపెనీల నుంచి సేకరించి అగ్రి ల్యాబ్‌లలో నాణ్యత ధ్రువీకరించిన తర్వాత రైతులకు అందించేలా ఏర్పాట్లుచేశాం. – గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ సీడ్స్ -
ఇవి ‘బాహుబలి’ విత్తనాలు.. శివగామి, కట్టప్పవీ ఉన్నాయ్
న్యూఢిల్లీ: రైతుల కష్టార్జితం వారికి కడుపు నింపుతుందా? అన్నది ప్రకృతి చేతుల్లోనే ఉంటుంది. నాణ్యమైన విత్తనాలు, ప్రకృతి అనుకూలత, ఆరోగ్యకరమైన దిగుబడి, మార్కెట్లో మద్దతు ధరలు ఇవన్నీ కలిస్తేనే అన్నదాత కష్టానికి ఫలితం దక్కినట్టుగా భావించాలి. మహారాష్ట్రలో వరి, ఉల్లి రైతులు ఈ సీజన్లో బాహుబలి, కట్టప్ప, శివగామి, భీమ, దుర్గ బ్రాండ్ల విత్తనాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అకాల వర్షాలు, లాక్డౌన్లు, పెరిగిన ఖర్చుల మధ్య వారు ప్రజాదరణ పొందిన పౌరాణిక పాత్రల పేర్లతో విక్రయిస్తున్న విత్తనాలపై ఆశలు ఎక్కువగా పెట్టుకున్నారు. మహారాష్ట్రలో సాగు ఊపందుకోవడంతో ఇటువంటి బ్రాండ్లు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. పేర్లతో అనుబంధం వేరు.. పేర్లలో ఏముందిలే అనుకోవద్దు. కొనుగోళ్ల విషయంలో బ్రాండ్ల పేర్లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని.. ముఖ్యంగా కరువు, సంక్షోభ సమయాల్లో వీటికి ఉన్న ప్రాముఖ్యత ఎక్కువని మహారాష్ట్ర విత్తన పరిశ్రమ సమాఖ్య ఈడీ ఎస్బీ వాంఖడే పేర్కొన్నారు. ‘‘నిర్ణీత పరీక్షలు, అనుమతుల తర్వాతే విత్తన కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెడతాయి. సినిమాల్లోని పాత్రల పేర్లు, దేవతల పేర్లను పెట్టడం ద్వారా రైతుల దృష్టిని ఆకర్షించడానికి వీలుంటుంది’’అని వాంఖడే వివరించారు. సినిమాల్లో ప్రజాదరణ పొందిన పాత్రల పేర్లు అయితే ప్రజలకు పరిచయం చేయక్కర్లేదని.. దీంతో ప్రచారం కోసం పెద్దగా ఖర్చు చేయకుండానే ఆయా పేర్లతో తేలిగ్గా చేరువ కావచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమా దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించడం తెలిసిందే. ఇందులోని బాహుబలి, కట్టప్ప, శివగామి పాత్రలు ఎంతో విజయవంతం అయ్యాయి. అందుకే ఈ పేర్లను విత్తన కంపెనీలు తమ ఉత్పత్తులకు తగిలించేశాయి. వీటితోపాటు భీష్మ, అర్జున్, కరణ్ వంటి పౌరాణిక పేర్లతో ఉన్న విత్తనాలను అక్కడి రైతులు నాణ్యమైనవిగా భావిస్తుండడం గమనార్హం. వరికి సంబంధించి సోనా, నవాబ్, ఉల్లికి సంబంధించి కోహినూర్ బ్రాండ్లకూ అక్కడ మంచి ఆదరణే ఉంది. మ్యాజిక్.. పత్తి సాగు రైతులకు పెద్దగా మిగిల్చిందేమీ లేకపోయినా.. మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో మ్యాజిక్, మనీ మేకర్, ఫోర్స్ పేర్లతో ఉన్న పత్తి విత్తనాలు బాగా అమ్ముడుపోతున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మార్కెటింగ్ చేసుకునే విషయంలో ఈ పేర్లకు ఎంతో ప్రాధాన్యత ఉన్నట్టు కమ్యూనికేషన్ నిపుణుడు ఫ్రొఫెసర్ ఆర్ఎల్ పండిట్ పేర్కొన్నారు. ప్రజలకు చేరువ కావడమే ఈ పేర్ల వెనుక వ్యూహమని చెప్పారు. ‘‘తమ అనుభవం, నేపథ్యం, అవగాహన ఆధారంగా పేర్లతో వ్యక్తులకు అనుబంధం ఏర్పడుతుంది. ప్రజాదరణ పొందిన పాత్రల పేర్లు ప్రజల జ్ఞాపకాల్లో సులభంగా నిలిచిపోవడమే కాకుండా ఆయా పేర్లతో ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేసే దిశగా ప్రోత్సహిస్తుంది’’అని పండిట్ వివరించారు. అయితే, అనుభవం కలిగిన రైతులు మాత్రం నాణ్యమైన విత్తనాల వైపే మొగ్గు చూపిస్తున్నారు. గత సీజన్లో నాణ్యతలేమి విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులు.. సోయాబీన్, ఉల్లి, పత్తి విత్తనాలపై ఫిర్యాదులు కూడా చేశారు. -
నేలకు పులకింత
సకాలంలో వర్షాలు కురుస్తుండటం, సొంతూరులోనే ఎరువులు, నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి రావడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మొత్తం సాగు విస్తీర్ణంలో ఇప్పటికే సగానికిపైగా విస్తీర్ణంలో నాట్లు పూర్తయ్యాయి. దీంతో ఈ ఖరీఫ్‌లో గ్రామాలు పచ్చదనం సంతరించుకుని కళకళలాడుతున్నాయి. సాక్షి, అమరావతి: తొలకరి పైర్లతో పుడమి కళకళలాడుతోంది. ఈ ఏడాది మొత్తం ఖరీఫ్ సాగు విస్తీర్ణంలో ఇప్పటికే సగానికి పైగా నాట్లు పూర్తి అయ్యాయి. అదునులో కురుస్తున్న వానలు, సకాలంలో అందిన ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అందుబాటులో నాణ్యమైన విత్తనాలు.. ఎరువులు, క్రిమి సంహారక మందులు ఉండడం రైతన్నలకు ఈ ఏడాది బాగా కలిసివచ్చింది. రిజర్వాయర్లలోకి నీరు వచ్చి చేరుతుండడంతో డెల్టా ప్రాంతాలకు సమృద్ధిగా నీరు వదులుతున్నారు. నైరుతి రుతుపవనాలకు అల్పపీడనాలు తోడుకావడంతో రాష్ట్రంలోని 13 జిల్లాలకు గాను 12 జిల్లాలలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళంలో మాత్రం మామూలు స్థితిలో ఉంది. ఈ సీజన్లో ఇప్పటికి 212.9 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 328.3 మిల్లీమీటర్లు కురిసింది. 22 లక్షల హెక్టార్లకు చేరిన సాగు ప్రస్తుత వర్షాలతో రాష్ట్రంలో ఖరీఫ్ సాగు ఇప్పటికే దాదాపు 22 లక్షల హెక్టార్లకు చేరింది. ఈ సీజన్లో మొత్తం సాగు విస్తీర్ణం 37.42 లక్షల హెక్టార్లు. మామూలుగా అయితే ఇప్పటికి 19 లక్షల హెక్టార్లలో పంటలు వేయాల్సి ఉంది. కానీ, అన్ని రకాల సానుకూల పరిస్థితుల నేపథ్యంలో అదనంగా రెండు లక్షల హెక్టార్లలో విత్తారు. గత ఏడాది ఇదే కాలానికి 13.98 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటల్ని వేయడం గమనార్హం. 6.23 లక్షల హెక్టార్లకు చేరిన వరిసాగు... ఖరీఫ్ ప్రధాన పంటల్లో ఒకటైన వరి సాగు ఇప్పటికే 6.23 లక్షల హెక్టార్లకు చేరింది. రాష్ట్రంలోని 13 జిల్లాలలో వరి 14.97 లక్షల హెక్టార్లలో సాగు చేయించాలన్నది వ్యవసాయ శాఖ లక్ష్యం. ఇందులో ఇప్పటికి 6.23 లక్షల హెక్టార్లలో వరినాట్లు వేశారు. గత ఏడాది ఇదే కాలానికి 4.81 లక్షల హెక్టార్లలో మాత్రమే వరి సాగు కావడం గమనార్హం. ఉత్తరాంధ్ర, గోదావరి డెల్టాలో వరినాట్లు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ముందుగా వేసిన జొన్న, సజ్జ, మొక్కజొన్న పైర్లు ఏపుగా పెరుగుతున్నాయి. నాగార్జునసాగర్ కుడికాల్వకు త్వరలో నీటిని వదిలే అవకాశం ఉండడంతో రైతులు భూముల్ని సిద్ధం చేసుకుంటున్నారు. 7లక్షల హెక్టార్లలో వేరుశనగ ఇక రెండో అతిపెద్ద పంటయిన వేరుశనగ విత్తడం దాదాపు ముగింపు దశకు చేరింది. మామూలు సాగు విస్తీర్ణం 7.04 లక్షల హెక్టార్లు కాగా.. ఇప్పటికే దాదాపు 7 లక్షల హెక్టార్లకు చేరింది. మొత్తంగా ఇప్పటివరకు ఆహార ధాన్యాల పంటలు 29 నుంచి 50 శాతం వరకు వేశారు. జొన్న, నువ్వు, సోయాబీన్, పత్తి, ఉల్లి పంటల సాగు 51 నుంచి 75 శాతం మధ్య, రాగి, వేరుశనగ పంటలు 76 నుంచి వంద శాతం మధ్య వేశారు. రాయలసీమ జిల్లాల్లో పంటల్ని విత్తడం తుది దశకు వచ్చింది. విజయనగరం, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాలలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. మిగతా అన్ని ప్రాంతాలలో పంటల్ని వేయడం ముమ్మరమైంది. ఇదిలా ఉంటే.. ముందుగా వేసిన వరి, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి, చెరకు పంటలకు అక్కడక్కడా తెగుళ్లు సోకినట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించి నివారణ చర్యలు సూచిస్తున్నారు. వేరుశనగ సస్యరక్షణ ఇలా... ► జూలై తొలి వారంలో విత్తిన వేరుశనగలో కలుపు నివారణ మందుల్ని పిచికారీ చేయకుంటే పంట 20–25 రోజుల వయసులో ఉన్నప్పుడు ఇమాజిత్ఫిర్ను ఎకరాకు 300 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి చల్లుకోవాలి ► రసం పీల్చే పురుగు, గొంగళి పురుగులను అరికట్టడానికి మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ► మొదలు కుళ్లు (కాలర్ రాట్) ఎక్కువగా ఉంటే హెక్సాకొనజోల్ కూడా కలిపి పంటపై చల్లుకోవాలి. ► 5 శాతం వేప గింజల కషాయాన్ని చల్లి రసం పీల్చే పురుగును నివారించుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పి.రాంబాబు రైతులకు సలహా ఇచ్చారు. -
అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యం
ఖమ్మం వైద్యవిభాగం : అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నెల 15న కంటివెలుగు పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. గురువారం ‘కంటివెలుగు’పై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజా ప్రతినిధులు, వైద్యాధికారులు, సిబ్బందికి నగరంలోని ఎస్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు రాష్ట్రంలో 3 కోట్ల 50 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు చెప్పారు. ఇరు జిల్లాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ప్రజా ప్రతినిధులు, అధికారులు బాధ్యతలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు నిర్వహించుకొని అవసరమైన కళ్లజోళ్లు, శస్త్ర చికిత్సలు చేయించుకునేలా చైతన్య పర్చాలన్నారు. దేశంలోనే ఇలాంటి పథకం ఎక్కడ చేపట్టలేదన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఈ నెలాఖరునాటికి ప్రతి ఇంటికి శుద్ధి చేసిన తాగునీటిని అందించనున్నట్లు చెప్పారు. మిషన్ కాకతీయలో భాగంగా జిల్లాలో 4,500 చెరువులను పునరుద్ధరించడం జరిగిందన్నారు. రెండు సంవత్సరాల్లో సీతారామ ప్రాజెక్టును పూర్తిచేసి గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తామన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కంటివెలుగుకు శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల విజయవంతానికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ.. ‘కంటివెలుగు’ ద్వారా జిల్లాలో పరీక్షలు నిర్వహించేందుకు 32 వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 36 బృందాలు శిబిరాల్లో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్లజోళ్లు అందిస్తారన్నారు. శస్త్ర చికిత్సలు అవసరమైనవారికి నగరంలోని మమత జనరల్ ఆస్పత్రి, అఖిల కంటి ఆస్పత్రి, జిల్లా ప్రధాన ఆస్పత్రులతో పాటు ఎల్వీ ప్రసాద్, సరోజినీదేవి కంటి ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు మా ట్లాడుతూ.. భద్రాద్రి జిల్లాలో 31 వైద్య బృందాల ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో 1.15 లక్షల కళ్లజోళ్లతోపాటు మందులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు నిర్వహించుకునే విధంగా ప్రణాళిక రూపొందిచామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ బుడాన్ బేగ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, నగర మేయర్ పాపాలాల్, కమిషనర్ సందీప్‌కుమార్‌ఝూ, ఖమ్మం, కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధి కారులు కొండల్రావు, దయానందస్వామి, జిల్లా పరిషత్ సీఈఓ నగేష్, ఉమ్మడి జిల్లాల వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తాం రఘునాథపాలెం: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం మండలంలోని జింకలతండా వద్ద ఉన్న విత్తన గిడ్డంగిలో నూతనంగా రూ.కోటి 35 లక్షలతో మంజూరైన విత్తన ప్రయోగశాల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా మొత్తానికి ఉపయోగపడే ప్రయోగశాలను జింకలతండా వద్ద ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ డాక్టర్ పాపాలాల్, కొండబాల కోటేశ్వరరావు, బుడాన్ బేగ్, కోటిలింగం, ఆర్డీఓ పూర్ణచంద్రరావు, జెడ్పీటీసీ సభ్యుడు ఆజ్మీరా వీరునాయక్, ఎంపీపీ మాలోత్ శాంత, తహసీల్దార్ తిరుమలాచారి, ఎంపీడీఓ ఏలూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
‘ఇంటిపంట’ల విత్తనాలమ్మే ‘ఏటీఎమ్!’
సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు సాగు చేసుకునే వారికి తిరిగి వాడుకోదగిన, నాణ్యమైన విత్తనాలు చిన్న ప్యాకెట్లలో అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్య. ఈ సమస్యను అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ వినూత్న ప్రయత్నం చేసింది. 10-20 గ్రాముల విత్తనాల ప్యాకెట్లను అమ్మేందుకు ఏటీఎం మాదిరిగా పనిచేసే ప్రత్యేక యంత్రాన్ని హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసింది. 8 రకాల కూరగాయలు, ఆకుకూరల సూటి రకాల విత్తన ప్యాకెట్లను జాతీయ విత్తన సంస్థ (ఎన్.ఎస్.సి.) నుంచి తెప్పించి ఈ యంత్రం ద్వారా విక్రయిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్ ధర రూ. 20. వినియోగదారు తనకు కావాల్సిన ప్యాకెట్ / ప్యాకెట్లను ఎంపిక చేసుకొని.. కరెన్సీ లేదా నాణేలను ఈ యంత్రంలో వేస్తే.. కోరిన విత్తనాల ప్యాకెట్లతోపాటు చిల్లర తిరిగి వస్తుంది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఈ యంత్రం పనిచేస్తున్నది. తమిళనాడు నుంచి తెప్పించి ప్రయోగాత్మకంగా నెల రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఈ యంత్రం విజయవంతంగా పనిచేస్తున్నదని, ఇంటిపంటల సాగుదారుల నుంచి స్పందన బాగుందని డిప్యూటీ డెరైక్టర్ (పబ్లిక్ గార్డెన్స్) విజయప్రసాద్ (83744 49007) ‘సాక్షి’కి తెలిపారు. హైదరాబాద్ వాసుల కోసం ఇంటిపంటల సబ్సిడీ కిట్లు (రూ. 3 వేలు) అందుబాటులో ఉంచినట్లు ఆయన వివరించారు. ఇటువంటి యంత్రాలను తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నగరాలు, పట్టణాల్లోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రైతుబజార్ల వద్ద కూడా ఏర్పాటు చేస్తే ఇంటిపంటల సాగు మరింత ఊపందుకుంటుందనడంలో సందేహం లేదు. -
నాణ్యమైన విత్తనాలను అందించాలి
నూనెపల్లె: కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేలా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన స్థానం డెరైక్టర్ డాక్టర్ రాజారెడ్డి పేర్కొన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాకు చెందిన వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు, రైతులతో జెడ్‌ఆర్‌ఈఏసీ(మండల పరిశోధన, సలహా మండలి) సమావేశం సోమవారం నూనెపల్లె వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో ఏడీఆర్ డాక్టర్ పద్మలత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో అన్ని రకాల పంటలు సాగుచేసేందుకు అనువైన భూములు ఉన్నాయన్నారు. అయితే సీమ రైతుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని మరిన్ని పరిశోధనలు సాగించాలన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల రైతుల కంటే కర్నూలు, అనంతపురం జిల్లాల అన్నదాతలు ముందంజలో ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి ఏడాది ఆర్ఈసీ కమిటీ ఎంపికలో సీమ ప్రాంతానికి చెందిన రైతులు ఎంపిక కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు శాస్త్రవేత్తలు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అందుకు అవసరమైన శిక్షణ ఇస్తూ పరిశోధనల్లో భాగస్వాములను చేసుకోవాలన్నారు. సీమ ప్రాంతంలో మహిళా రైతులు, శాస్త్రవేత్తలు కనిపించకపోవడం బాధాకరంగా ఉందని పురుషుల కంటే అధికంగా మహిళలను ప్రోత్సహించాలని అన్నారు. కర్నూలు, కడప, గుంటూరులోని ప్రధాన రహదారిలో నంద్యాల పరిశోధన స్థానం ఉన్నందున విత్తనాలు విక్రయ కేంద్రాన్ని స్థానికంగా ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో పరిశోధన స్థానానికి ఆదాయం చేకూరడంతో పాటు రైతులకు నాణ్యమైన విత్తనాలను అందివ్వవచ్చన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సాగులో ఉన్న పొలాలను, యాంత్రీకరణ పద్ధతులు పరిశోధనల వివరాలను ఏడీఆర్ డాక్టర్ పద్మలత వివరించారు. కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన జేడీఏలు రైతులకు అందిస్తున్న ప్రభుత్వ పథకాలను స్లైడ్స్ ద్వారా సమావేశంలో వివరించారు. అనంతరం నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌లో శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనలను బ్రోచర్‌ను అతిథులు ఆవిష్కరించారు. సమావేశంలో మహానంది అగ్రికల్చర్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రవీంద్రనాథ్‌రెడ్డి, కర్నూలు జేడీఏ ఠాగూర్ నాయక్, అనంతపురం జేడీఏ శ్రీరామమ్మూరి, బొజ్జా అగ్రికల్చర్ ఫౌండేషన్ చైర్మన్ బొజ్జా దశరథ రామిరెడ్డి, హైదరాబాద్‌కు చెందిన అసోసియేషన్ మేనేజ్ డాక్టర్ లక్ష్మిమనోహరి, కర్నూలు, అనంతపురం ప్రాంతాలకు చెందిన శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. -
విత్తనం మనదైతే.. ఆ దిగుబడే వేరబ్బా!
ఒంగోలు టూటౌన్ : రైతులు విత్తనాల కోసం ప్రైవేట్ కంపెనీలను ఆశ్రయించడం.. అవి సరిగ్గా మొలకెత్తకపోవడం.. ఒకవేళ మొలకెత్తినా దిగుబడి లేకపోవడం వెరసి అన్నదాత తీవ్రంగా నష్టపోతున్నాడు. ఈ నేపథ్యంలో రైతులే నాణ్యమైన విత్తనాలు తయారు చేసుకుంటే ఆశించిన దిగుబడి దక్కుతుందని వ్యవసాయశాఖ జిల్లా సంచాలకుడు జే ముర ళీకృష్ణ పేర్కొన్నారు. మేలైన విత్తనం వాడితే.. జన్యు, స్వచ్ఛత, అధిక మొలక శాతం కలిగి ఉండటంతో పాటు అధిక దిగుబడిని ఇవ్వగలిగే శక్తి ఉండాలి. మేలైన విత్తనం వాడితే 20 శాతం నుంచి 25 శాతం అధిక దిగుబడిని పొందే అవకాశముంటుంది. విత్తనాల్లో రకాలు విత్తనాల్లో సూటి, హైబ్రిడ్ రకాలు ఉంటాయి. సూటి రకాలంటే రైతులు ఏటా తమ పంట నుంచి వచ్చిన విత్తనాన్ని తర్వాత పంటగా వేసుకోవచ్చు. ఈ పద్ధతిలో రైతులు తమ విత్తనాలను ప్రతి మూడు, నాలుగేళ్లకోమారు మార్చుకోవాల్సి ఉంటుంది. విత్తనాలను మార్చే సమయంలో ధ్రువీకరించిన విత్తనాలు ఎంచుకోవాలి. హైబ్రిడ్ రకాలంటే ఏటా ఆడ, మగ రకాలను సంకరపరిచి తయారు చేసిన విత్తనాలు. ప్రతి పంట కాలానికి కొత్త విత్తనం వాడాల్సి ఉంటుంది. పాత విత్తనాలు అంతగా పనికిరావు. దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. విత్తనం తయారీ ఇలా.. స్వపరాగ సంపర్కం జరిగే పంటలో రైతులు ఎవరి విత్తనాన్ని వారు తయారు చేసుకుంటే విత్తనంపై పెట్టుబడి తగ్గడంతో పాటు మేలు రకాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. విత్తనోత్పత్తి చేసే పొలం సారవంతమైనదై ఉండాలి. మురుగు నీరు నిల్వ ఉండకూడదు. విత్తనం కోసం పండించే పొలానికి అదే పంటకు చెందిన ఇతర రకాలు సాగవుతున్న పొలానికి మధ్య కనీస దూరం ఉండాలి. విత్తనోత్పత్తి చేయదలచిన పొలానికి నీరు పెడితే అంతకు ముందు పండించిన పంట రకం మొలకెత్తుతుంది. వాటిని గొర్రు, గుంటకతో నాశనం చేయాలి. పొలంలో బెరుకులు లేకుండా చూసుకోవాలి. మొక్క ఎదిగేటప్పుడు పూత, గింజ గట్టిపడే దశలో ఏరిపాయాలి. ఎత్తులో తేడాలున్నా ఆకుల రంగు, ఆకారం, అమరిక సరిగా లేకున్నా వెంటనే గుర్తించి తొలగించాలి. ఏ విత్తనమైనా నారు పోసే ముందు విత్తన శుద్ధి తప్పని సరి. రైతులు తమ పంట నుంచి గానీ లేదా బాగా పండించిన ఇతర రైతుల నుంచి గానీ విత్తనాలు సేకరించి నిల్వ చేసుకోవాలి.