‘ఇంటిపంట’ల విత్తనాలమ్మే ‘ఏటీఎమ్!’
సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు సాగు చేసుకునే వారికి తిరిగి వాడుకోదగిన, నాణ్యమైన విత్తనాలు చిన్న ప్యాకెట్లలో అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్య. ఈ సమస్యను అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ వినూత్న ప్రయత్నం చేసింది. 10-20 గ్రాముల విత్తనాల ప్యాకెట్లను అమ్మేందుకు ఏటీఎం మాదిరిగా పనిచేసే ప్రత్యేక యంత్రాన్ని హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసింది. 8 రకాల కూరగాయలు, ఆకుకూరల సూటి రకాల విత్తన ప్యాకెట్లను జాతీయ విత్తన సంస్థ (ఎన్.ఎస్.సి.) నుంచి తెప్పించి ఈ యంత్రం ద్వారా విక్రయిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్ ధర రూ. 20. వినియోగదారు తనకు కావాల్సిన ప్యాకెట్ / ప్యాకెట్లను ఎంపిక చేసుకొని.. కరెన్సీ లేదా నాణేలను ఈ యంత్రంలో వేస్తే.. కోరిన విత్తనాల ప్యాకెట్లతోపాటు చిల్లర తిరిగి వస్తుంది.
ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఈ యంత్రం పనిచేస్తున్నది. తమిళనాడు నుంచి తెప్పించి ప్రయోగాత్మకంగా నెల రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఈ యంత్రం విజయవంతంగా పనిచేస్తున్నదని, ఇంటిపంటల సాగుదారుల నుంచి స్పందన బాగుందని డిప్యూటీ డెరైక్టర్ (పబ్లిక్ గార్డెన్స్) విజయప్రసాద్ (83744 49007) ‘సాక్షి’కి తెలిపారు. హైదరాబాద్ వాసుల కోసం ఇంటిపంటల సబ్సిడీ కిట్లు (రూ. 3 వేలు) అందుబాటులో ఉంచినట్లు ఆయన వివరించారు. ఇటువంటి యంత్రాలను తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నగరాలు, పట్టణాల్లోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రైతుబజార్ల వద్ద కూడా ఏర్పాటు చేస్తే ఇంటిపంటల సాగు మరింత ఊపందుకుంటుందనడంలో సందేహం లేదు.