seed processing unit
-
విశాఖలో సీడ్ ప్రాసెస్ యూనిట్
ఖరీఫ్‌కు సర్వం సిద్ధం మంత్రి అయ్యన్నపాత్రుడు విశాఖ రూరల్ : భవిష్యత్తులో విత్తనాల కొరత తలెత్తకుండా ఉండేందుకు, రైతుల నుంచే విత్తనాలను సేకరించేందుకు జిల్లాలో సీడ్ ప్రాసెస్ యూనిట్‌ను నెలకొల్పేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తామని రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. సోమవారం ప్రభుత్వ అతిథి గృహంలో వ్యవసాయాధికారులతో సమీక్ష అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడారు. ప్రతీ సీజన్లోను ప్రభుత్వం జిల్లాకు విత్తనాలను సరఫరా చేస్తున్నప్పటికీ, కొంత మంది రైతులు నాణ్యమైన విత్తనాలు తయారు చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ సీడ్ ప్రాసెట్ యూనిట్ లేకపోవడంతో బాపట్లలో చేయించి తీసుకురావాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఎరువుల అమ్మకాలపై విజిలెన్స్ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ ధరకు మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రతీ దుకాణం వద్ద ప్రభుత్వ ధరను ప్రదర్శించే విధంగా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. ఎరువులను మార్కెట్ కమిటీ ద్వారా విక్రయిస్తే మంచిదన్న ఆలోచన చేస్తున్నామన్నారు. ఖరీఫ్ సీజన్ ఈ నెలాఖరుకు ప్రారంభమవుతుందని, అవసరమైన విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ సీజన్లో 1.10 లక్షల వరి పంట సాగు అంచనా కాగా 29 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరముందని తెలిపారు. ఇప్పటికే 21,500 కింటాళ్లు సిద్ధం ఉందని, 7500 క్వింటాళ్లను ఇత ర ప్రాంతాలు నుంచి సేకరిస్తామన్నారు. ప్రతీ ఇంటికి 20 లీటర్ల నీటిని రూ.2 కే అందించే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కోసం తొలిదశలో జిల్లాలో ఒక్కో మండలంలో 5 గ్రామాలను ఎంపిక చేస్తున్నట్లు మంత్రి అయ్యన్నపాత్రుడు వివరించారు. -
‘తెల్ల హంస’కు కొరతొచ్చింది
మోర్తాడ్, న్యూస్‌లైన్ : రబీలో తెల్ల హంస రకం వరిని సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ రకం విత్తనం కొరత తీవ్రంగా ఉండటంతో వారు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం 1010 రకం వరి సాగుకు ఇస్తు న్న ప్రాధాన్యతను తెల్ల హంస రకానికి ఇవ్వక పోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్ జిల్లా ముల్కనూర్ సహకార సంఘం ఆధ్వర్యంలోని సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో తెల్లహంస విత్తనాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విత్తనాలను సహకార సంఘాలు సరిగా మార్కెట్ చేయడం లేదన్న కారణంతో వారు ప్రైవేట్ వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరా చేసుకుంటున్న వ్యాపారులు విత్తనాల ధరను అమాంతం పెంచేశారు. 30 కిలోల సంచికి రూ. 635 ధర ఉండగా వ్యాపారులు రూ. 850లకు విక్రయిస్తున్నారు. దీంతో విత్తనాల కోసం రైతులు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. రబీ సీజన్లో జిల్లాలో 2.40 లక్షల హెక్టార్లలో వరిసాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఈ సీజన్లో ఎక్కువ మొత్తంలో దొడ్డు రకం వరి వేస్తారు. ఏపీ సీడ్ కార్పొరేషన్ అధికారులు 1010 రకం వరి వంగడాన్ని మాత్రమే సరఫరా చేస్తున్నారు. రబీలో విద్యుత్ సరఫరా, అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని రైతులు తెల్ల హంస సాగుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 1010 రకం వరి విత్తనాన్ని సాగు చేస్తే వంద రోజుల తర్వాత కోతలు చేపట్టాల్సి వస్తుంది. తె ల్ల హంస రకం పక్షం ముందుగానే కోతకు వస్తుంది. రబీలో విద్యుత్ కోత ఏర్పడటం, అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తక్కువ కాలంలోనే పంట చేతికి వచ్చే రకం సాగు చేయాలని రైతులు భావిస్తున్నారు. తెల్ల హంస రకం వరి పాత రకం కావడంతో నిజామాబాద్ జిల్లా సారంగపూర్‌లోని ఏపీ సీడ్స్ కంపెనీలో తక్కువ ఉత్పత్తి చేశారు. దీంతో రైతులు ముల్కనూర్ సహకార సంఘం ఉత్పత్తి చేస్తున్న తెల్ల హంస విత్తనాలను పొందడానికి పోటీ పడుతున్నారు. ముల్కనూర్ సహకార సంఘంలో ఉత్పత్తి చేసిన విత్తనాలను ప్రైవేట్ వ్యాపారులు బ్లాక్ చేయడంతో కొరత ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి తెల్ల హంస రకం వరి విత్తనాలను సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే.. -సుదర్శన్ రెడ్డి, ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ ప్రభుత్వం 1010 రకం వరి విత్తనాలను సరఫరా చేయాలని ఆదేశించింది. అందుకే ఈ రకం వరి విత్తనాలను ఎక్కువగా ఉత్పత్తి చేశాం. తెల్ల హంస రకం వరి విత్తనాలను వెయ్యి క్వింటాళ్లు మాత్రమే ఉత్పత్తి చేశాం. ప్రభుత్వం ఆదే శించిన విధంగా విత్తనోత్పత్తి చేయడం మా పని.