విశాఖలో సీడ్ ప్రాసెస్ యూనిట్
- ఖరీఫ్‌కు సర్వం సిద్ధం
- మంత్రి అయ్యన్నపాత్రుడు
విశాఖ రూరల్ : భవిష్యత్తులో విత్తనాల కొరత తలెత్తకుండా ఉండేందుకు, రైతుల నుంచే విత్తనాలను సేకరించేందుకు జిల్లాలో సీడ్ ప్రాసెస్ యూనిట్‌ను నెలకొల్పేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తామని రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. సోమవారం ప్రభుత్వ అతిథి గృహంలో వ్యవసాయాధికారులతో సమీక్ష అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడారు.
ప్రతీ సీజన్‌లోను ప్రభుత్వం జిల్లాకు విత్తనాలను సరఫరా చేస్తున్నప్పటికీ, కొంత మంది రైతులు నాణ్యమైన విత్తనాలు తయారు చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ సీడ్ ప్రాసెట్ యూనిట్ లేకపోవడంతో బాపట్లలో చేయించి తీసుకురావాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఎరువుల అమ్మకాలపై విజిలెన్స్ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ ధరకు మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రతీ దుకాణం వద్ద ప్రభుత్వ ధరను ప్రదర్శించే విధంగా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.
ఎరువులను మార్కెట్ కమిటీ ద్వారా విక్రయిస్తే మంచిదన్న ఆలోచన చేస్తున్నామన్నారు. ఖరీఫ్ సీజన్ ఈ నెలాఖరుకు ప్రారంభమవుతుందని, అవసరమైన విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ సీజన్‌లో 1.10 లక్షల వరి పంట సాగు అంచనా కాగా 29 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరముందని తెలిపారు.
ఇప్పటికే 21,500 కింటాళ్లు సిద్ధం ఉందని, 7500 క్వింటాళ్లను ఇత ర ప్రాంతాలు నుంచి సేకరిస్తామన్నారు. ప్రతీ ఇంటికి 20 లీటర్ల నీటిని రూ.2 కే అందించే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కోసం తొలిదశలో జిల్లాలో ఒక్కో మండలంలో 5 గ్రామాలను ఎంపిక చేస్తున్నట్లు మంత్రి అయ్యన్నపాత్రుడు వివరించారు.