సాధారణ పద్ధతిలోనే పట్టా పాసుపుస్తకాలు | errors in E-pass book | Sakshi
Sakshi News home page

సాధారణ పద్ధతిలోనే పట్టా పాసుపుస్తకాలు

Published Fri, Aug 8 2014 4:24 AM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM

errors in E-pass book

మోర్తాడ్ : కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ నిర్వాకం వల్ల దాదాపు పది నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న భూ యజమానులకు ఊరట లభించింది. సాంకేతిక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో జారీ కాకుండా ఉన్న ‘ఈ’ పట్టా పాసుపుస్తకం, టైటిల్ డీడ్‌ల స్థానంలో సాధారణ (మాన్యువల్) పద్ధతిలోనే పాసుపుస్తకాలను జారీ చేయాలని నిర్ణయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 ఇలా...
 వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన రైతులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. వీరికి 45 రోజుల వ్యవధి తర్వాత తహశీల్దార్ కార్యాలయం ద్వారా పట్టా పాసుపుస్తకం, టైటిల్ డీడ్ జారీచేస్తారు. గతంలో సాధారణ పద్ధతిలోనే పట్టా పాసుపుస్తకం, టైటిల్ డీడ్‌లు జారీ అయ్యేవి. అయితే సాధారణ పద్ధతి ద్వారా బోగస్ పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్‌లు జారీ అవుతున్నాయని భావించిన ప్రభుత్వం, బోగస్ పత్రాల జారీకి చెక్ పెట్టడం కోసం ఈ టైటిల్ డీడ్, పట్టా పాసుపుస్తకాలను జారీ చేయాలని నిర్ణయించింది.

ఇందుకోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూ యజమానులకు ఆన్‌లైన్ ద్వారానే పట్టా పాసుపుస్తకాలు, టైటిల్ డీడ్‌లను జారీ చేయాలని భావించింది. ఈ టైటిల్ డీడ్, ఈ పట్టా పాసుపుస్తకాలను ప్రచురించి ఆన్‌లైన్ ద్వారా జారీ చేయడానికి ఒక కార్పొరేట్ సంస్థకు కిరణ్ సర్కార్ కాంట్రాక్టు ఇచ్చింది. కాంట్రాక్టు తీసుకున్న కార్పొరేట్ సంస్థ సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో దృష్టిసారించలేదు.

2013 ఆగస్టులో కిరణ్ సర్కార్ ఈ పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్‌ల జారీకి నిర్ణయం తీసుకుంది. కాగా ఇదే సంవత్సరం అక్టోబర్ నుంచి ఆన్‌లైన్ పట్టా పాసుపుస్తకాలు జారీ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఆన్‌లైన్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికి ఇంత వరకు ఈ టైటిల్ డీడ్, ఈ పట్టా పాసుపుస్తకాల జారీ కాలేదు. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, నిజమైన హక్కు పట్టా పాసుపుస్తకం, టైటిల్ డీడ్ జారీతోనే లభిస్తుంది. నెలల తరబడి పట్టా పాసుపుస్తకాల జారీ నిలచిపోవడంతో భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగివేసారి పోయారు.

దీనిపై రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు ప్రభుత్వంకు స్పష్టం చేయడంతో సాధారణ పద్ధతిలోనే టైటిల్ డీడ్, పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. కాగా పహాణీ, ప్రొసిడింగ్‌లను మాత్రం ఆన్‌లైన్ విధానంలో జారీ చేయాలని నిర్ణయించారు. దాదాపు 10 నెలలుగా నిలిచిన టైటిల్ డీడ్, పట్టా పాసుపుస్తకాలను మాన్యువల్ పద్ధతిలో జారీ చేయడానికి రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులకు పెద్ద బాధ తప్పింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement