కరెంట్‌ పేరుతో 'శ్రీశైలం ఖాళీ' | Central Govt mandate to Krishna Board On Water Release | Sakshi
Sakshi News home page

కరెంట్‌ పేరుతో 'శ్రీశైలం ఖాళీ'

Published Sun, Dec 3 2023 4:28 AM | Last Updated on Sun, Dec 3 2023 8:47 AM

Central Govt mandate to Krishna Board On Water Release - Sakshi

సాక్షి, అమరావతి: ‘కృష్ణా బోర్డు అనుమతి లేకున్నా అక్రమంగా వాటాకు మించి నీటిని వినియోగించి తెలంగాణ రాష్ట్రం విద్యుదుత్పత్తి చేస్తూ.. నాగార్జున­సాగర్‌కు తరలిస్తోంది. సాగర్‌ ఎడమ కాలువ రెగ్యులేటర్‌తోపాటు ఏపీ భూభాగంలో ఉన్న సాగర్‌ కుడి కాలువ రెగ్యులేటర్‌ను తన అధీనంలో ఉంచుకుంది. ఏపీకి హక్కుగా దక్కాల్సిన వాటా జలా­లను దక్కినివ్వకుండా అడ్డుకుంటోంది. గత తొమ్మి­దేళ్లుగా ఇదే రీతిలో తెలంగాణ సర్కార్‌ ఏపీ హక్కు­లను హరిస్తోంది. దీనిపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం ఉండటం లేదు’ అని ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు.

కృష్ణా బోర్డు పరిధి నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ అమలుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని, ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లను బోర్డుకు అప్పగించడానికి ఒప్పు­కున్నా­మని గుర్తు చేశారు. విభజన చట్టం, కృష్ణా బోర్డు ఆదేశాల మేరకు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్య­తను కర్నూలు సీఈ.. నాగార్జున­సాగర్‌ నిర్వహణ బాధ్యతను ఆ రాష్ట్ర సీఈ 2014 నుంచి నిర్వహిస్తు­న్నారని చెప్పారు.

శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తన భూభాగంలో ఉందని చెబుతూ.. దాన్ని తన అధీనంలోకి తీసుకుని తెలంగాణ సర్కార్‌ స్వేచ్ఛగా నిర్వహిస్తూ, అక్రమంగా నీటిని తరలిస్తోందని గణాంకాలతో సహా వివరించారు. తన భూభాగంలోని నాగార్జునసాగర్‌ స్పిల్‌ వేలో సగం, కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను గురువారం ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య ఉత్పన్నమైన వివాదంతోపాటు కృష్ణా జలాల పంపకాలు, ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లను కృష్ణా బోర్డుకు అప్పగింతపై చర్చించడానికి కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ శనివారం రెండు రాష్ట్రాల సీఎస్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

వీడియో కాన్ఫరెన్స్‌కు విజయవాడలో క్యాంపు కార్యాలయం నుంచి ఏపీ సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డిలు హాజరయ్యారు. తెలంగాణ సీఎస్‌ శాంతికుమారి, ఆ రాష్ట్ర అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌కు గైర్హాజరయ్యారు. దాంతో వీడియో కాన్ఫరెన్స్‌లోనే తెలంగాణ సీఎస్‌ శాంతికుమారికి కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఫోన్‌ చేశారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం చేపట్టనుండటం వల్ల.. ఆ ఏర్పాట్లలో నిమగ్నమయ్యామని, దాని వల్లే వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాలేకపోతున్నామని ఆ రాష్ట్ర సీఎస్‌ శాంతికుమారి తెలిపారు. సమావేశాన్ని 5కు వాయిదా వేస్తే హాజరవుతామన్నారు. దీనిపై కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ.. ఈనెల 6న ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి రెండు రాష్ట్రాల సీఎస్‌లు, జల వనరుల శాఖ అధికారులు హాజరుకావాలని కోరారు. ఇందుకు రెండు రాష్ట్రాల సీఎస్‌లు అంగీకరించారు. తెలంగాణ సీఎస్‌ హాజరుకాలేని నేపథ్యంలో ఏపీ సీఎస్, అధికారులతో కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ తాజా పరిస్థితిని సమీక్షించారు. 

మా హక్కులను కాపాడుకోడానికే..
‘తెలంగాణ సర్కార్‌ ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుతూ ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడం లేదు. ఎల్‌ నినో ప్రభావం వల్ల వర్షాభావం నెలకొందని.. శ్రీశైలం, సాగర్‌లలో లభ్యతగా ఉన్న నీటిని తాగునీటి కోసమే వాడుకోవాలని అక్టోబర్‌ 6న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఆ కమిటీ చేసిన సిఫార్సు మేరకు శ్రీశైలంలో 30 టీఎంసీలు, సాగర్‌లో 15 టీఎంసీలు ఏపీకి.. రెండు ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయిస్తూ అక్టోబర్‌ 9న కృష్ణా బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ.. సాగర్‌కు తెలంగాణ నీటిని తరలించింది’ అని ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోవడం వల్ల.. కృష్ణా బోర్డు కేటాయించిన 30 టీఎంసీల్లో కేవలం 13 టీఎంసీలు మాత్రమే వాడుకోగలమని, మిగతా 17 టీఎంసీలు కోల్పోవాల్సి వచ్చిందని.. దీనికి తెలంగాణ సర్కార్‌ దుందుడుకు వైఖరి, కృష్ణా బోర్డు ప్రేక్షక పాత్ర వహించడమే కారణమని తెలిపారు.

సాగర్‌లో కుడి కాలువకు కేటాయించిన 15 టీఎంసీలను ఇదే రీతిలో తెలంగాణ దక్కకుండా చేస్తుందేమోననే ఆందోళన ప్రజల్లో మొదలైందని.. ఇది శాంతిభద్రతల సమస్యకు దారితీస్తుండటంతో.. మా హక్కులను కాపాడుకోవడం ద్వారా దాన్ని నివారించడానికే మా భూభాగంలో ఉన్న  సాగర్‌ స్పిల్‌ వేలో సగం, కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎల్‌ నినో ప్రభావం వల్ల గుంటూరు, పల్నాడు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో వర్షాభావం నెలకొనడంతో తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు నీటిని విడుదల చేశామని ఏపీ సీఎస్‌ స్పష్టం చేశారు.
  
ఏపీ అధీనంలో స్పిల్‌ వేలో సగం, కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ 

సీఆర్పీఎఫ్‌ బలగాల పహారాలో సాగర్‌ నిర్వహణ బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగించాం కాబట్టి.. ఇక అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావని ఏపీ సీఎస్‌కు కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే సాగర్‌లో సీఆర్పీఎఫ్‌ బలగాల మొహరింపుపై ఆ విభాగం అడిషనల్‌ డీజీ చారుసిన్హాను ఆరా తీశారు. సాగర్‌ స్పిల్‌ వే, ఎడమ కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి తెలంగాణ పోలీసులు వెనక్కి వెళ్లారని, అక్కడ సీఆర్పీఎఫ్‌ బలగాలు మొహరించామని చారుసిన్హా చెప్పారు.

ఏపీ పోలీసులు ఆ రాష్ట్ర భూభాగంలోని స్పిల్‌ వే, కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ఉన్నారని.. పరిస్థితి శాంతియుతంగా ఉందన్నారు. ఏపీ వైపు స్పిల్‌ వే, కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను సీఆర్పీఎఫ్‌కు అప్పగించాలని కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి చేసిన సూచనను ఏపీ సీఎస్‌ సున్నితంగా తోసిపుచ్చారు. కుడి కాలువ కింద తమ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ముడిపడి ఉన్నాయని.. ఈ నేపథ్యంలో వాటిని తమ స్వాధీనంలో ఉంచుకుంటామని స్పష్టం చేశారు. ఏపీ సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి లేవనెత్తిన అంశాలపై కృష్ణా బోర్డు ఛైర్మన్‌ను కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ వివరణ కోరారు.

సాగర్‌ కుడి కాలువకు నీటిని విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన పంపకుండానే.. నీటిని విడుదల చేసుకున్నారని కృష్ణా బోర్డు ఛైర్మన్‌ చెప్పారు. కుడి కాలువకు 5 టీఎంసీలను విడుదల చేయాలని ప్రతిపాదన పంపామని ఏపీ సీఎస్‌ చెప్పారు. ఆ ప్రతిపాదనను పరిశీలించి.. ఈనెల 4లోగా నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డు ఛైర్మన్‌ను కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి ఆదేశించారు. కృష్ణా బోర్డు నీటి విడుదలపై నిర్ణయం తీసుకునే వరకూ అంటే 4వ తేదీ వరకు కుడి కాలువకు నీటి విడుదలను ఆపాలని ఆమె చేసిన సూచనకు ఏపీ సీఎస్‌ అంగీకరించారు.

కృష్ణా జలాల వివాదంపై ఈనెల 6న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శుల(సీఎస్‌)తో సమావేశం నిర్వహిస్తామని.. అప్పటిదాకా సంయమనం పాటించాలని రెండు రాష్ట్రాలకు ముఖర్జీ సూచించారు. విభజన చట్టం మేరకు కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించి.. రెండు రాష్ట్రాల హక్కులను పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ సమీక్షలో సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్, కృష్ణా బోర్డు ఛైర్మన్‌ శివ్‌నందన్‌కుమార్, సీడబ్ల్యూసీ ఛైర్మన్‌ కుశ్వీందర్‌సింగ్‌ వోరాలు పాల్గొన్నారు.

రెండు గేట్ల ద్వారా కొనసాగిన నీటి విడుదల
మాచర్ల / విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన 13 క్రస్ట్‌ గేట్లు, హెడ్‌ రెగ్యులేటర్‌ స్వాధీన పర్చుకున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నీటి హక్కు కోసం పోరాటం కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగా శనివారం సాగర్‌ కుడికాలువ రెండు గేట్ల ద్వారా 3,300 క్యూసెక్కులు విడుదల కొనసాగించారు. మూడు రోజులుగా ప్రజల తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ కుడికాలువ ద్వారా 5వ గేటు నుంచి 2వేల క్యూసెక్కులు, 2వ గేటు నుంచి 1300 మొత్తం 3300 క్యూసెక్కుల నీటిని బుగ్గవాగు రిజర్వాయర్‌కు పంపుతున్నారు.

తద్వారా పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్నారు. జలవనరుల శాఖ అధికారులు, గుంటూరు రేంజి ఐజీ పాల్‌రాజ్, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. తుపాను నేపథ్యంలో సాయంత్రం నుంచి నీటి విడుదలను 2,550 క్యూసెక్కులకు తగ్గించారు. నాగార్జునసాగర్‌ డ్యాం ప్రధాన ముఖద్వారం వద్ద ఉన్న తెలంగాణ స్పెషల్‌ ప్రోటెక్షన్‌ ఫోర్స్‌ పోలీస్‌ గార్డ్‌ రూమ్‌ పేరును తొలగించి, ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌గార్డ్‌ రూమ్‌గా మార్చారు. కాగా, వివాదం నేపథ్యంలో శనివారం కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు సభ్యులు ఎస్‌ఈ అశోక్‌కుమార్, ఈఈ రఘునా««థ్, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వీఎన్‌రావు డ్యామ్‌ను సందర్శించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement