
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి సచివాలయ శాఖలు, శాఖాధిపతులు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, రాష్ట్ర యూనిట్లు, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఈ–ఆఫీస్‌లను ప్రస్తుత వెర్షన్ నుంచి కొత్త వెర్షన్‌కు మార్పు చేస్తున్నారు. అందువల్ల ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు ప్రస్తుత పాత వెర్షన్‌లోని ఈ–ఆఫీస్‌లు పనిచేయబోవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ ఆరు రోజుల్లో కార్యాలయాల్లో కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. కొత్త వెర్షన్ ఈ–ఆఫీస్‌లు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. అప్పటి వరకు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎస్ సూచించారు.
కొత్త వెర్షన్‌పై ఈ నెల 23, 24 తేదీల్లో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల వరకు మాస్టర్ శిక్షకులను డెవలప్ చేయనున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో మాస్టర్ శిక్షకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. సచివాలయ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాల నుంచి మాస్టర్ శిక్షణకు సిబ్బందిని పంపాలని ఐటీ శాఖ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment