మాఫియా ఉచ్చులో అమాయకుడు | Mafia trap in innocent | Sakshi
Sakshi News home page

మాఫియా ఉచ్చులో అమాయకుడు

Published Fri, Sep 9 2016 2:54 AM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM

మాఫియా ఉచ్చులో అమాయకుడు - Sakshi

మాఫియా ఉచ్చులో అమాయకుడు

* నిషేధిత మందులను తీసుకువచ్చాడని
* జైల్లో పెట్టిన దుబాయ్ పోలీసులు
* ఎయిర్‌పోర్టులోనే అరెస్టు అయిన తడపాకల్ వాసి
* పార్సిల్ పంపించిన వ్యక్తుల సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్

మోర్తాడ్: గల్ఫ్‌లో నిషేధిత మందుల వ్యాపారం చేస్తున్న మాఫియా ముఠా ఉచ్చులో అమాయకుడు చిక్కుకున్నాడు. రెండు నెలల సెలవుపై దుబాయ్ నుంచి ఇంటికి వచ్చిన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తడపాకల్ వాసి పూసల శ్రీనివాస్ వారం రోజుల కింద మళ్లీ దుబాయ్ వెళ్లాడు. అయితే అతని వద్ద గల్ఫ్‌లో నిషేధించబడిన మందుల పార్సిల్ దొరకడంతో ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లకముందే దుబాయ్ పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

మన దేశంలో విరివిగా వినియోగించే అనేక మందులను గల్ఫ్ దేశాలు చాలా ఏళ్ల క్రితమే నిషేధించాయి. ఒంటినొప్పులు, నిద్రమాత్రలు తదితర రకాల మందుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని గుర్తించిన గల్ఫ్ దేశాలు.. ఆ మందులను నిషేధించడమేకాకుండా వాటితో పట్టుబడిన వారికి కఠిన శిక్షలను అమలు చేస్తున్నాయి.
 పూసల శ్రీనివాస్ దుబాయ్‌లోని ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీలో కార్మికుడు. ఇటీవల కంపెనీ సెలవు ఇవ్వడంతో ఇంటికి వచ్చిన అతను మళ్లీ దుబాయ్‌కు వెళ్లడానికి మోర్తాడ్‌లోని ఒక ట్రావెల్స్‌లో టికెట్ బుకింగ్ చేసుకున్నాడు. ట్రావెల్స్ నిర్వహిస్తున్న వ్యక్తి మెట్‌పల్లికి చెందిన ఒక వ్యక్తి నుంచి తీసుకున్న పార్సిల్‌ను శ్రీనివాస్‌కు అప్పగించాడు.

దుబాయ్‌లో అజయ్ అనే తమ వ్యక్తి పార్సిల్‌ను రిసీవ్ చేసుకుంటాడని శ్రీనివాస్‌కు వివరించారు. పార్సిల్‌లో ఏం ఉందో చెప్పకుండానే పార్శిల్ ఇవ్వడంతో శ్రీనివాస్ దానిని తన లగేజీలో పెట్టుకుని దుబాయ్ చేరుకున్నాడు. నిషేధిత మందుల రవాణాపై నిఘా ను తీవ్రతరం చేసిన దుబాయ్ పోలీసులు శ్రీనివాస్ లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో పార్శిల్ దొరకడంతో దాన్ని పరిశీలించగా నిషేధిత మం దులు లభ్యమయ్యాయి. దీంతో ఎయిర్‌పోర్టులోనే శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. అయితే ఈ పార్సిల్‌లో ఏం ఉందో తనకు తెలియదని దుబాయ్‌లో తాను ఉండే క్యాంపునకు అజయ్ అనే వ్యక్తి వచ్చి తీసుకువెళతాడని చెప్పారని శ్రీనివాస్ ఎంత మొత్తుకున్నా పోలీసులు వినలేదు.

అంతేకాక అజయ్ సెల్‌నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అయ్యింది. శ్రీనివాస్ తన అరెస్టు విషయాన్ని తన సహచరుల ద్వారా కుటుంబ సభ్యులకు అందించాడు. ఇక్కడ పార్శిల్ అందించిన వ్యక్తుల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్‌లో ఉన్నాయి. విదేశాంగశాఖ ఉన్నతాధికారులు స్పందించి అమాయకుడైన శ్రీనివాస్‌ను విడిపించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement