ఆస్పత్రిలో లైంగిక వేధింపులు
Published Mon, Sep 12 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
నిజామాబాద్‌అర్బన్ :
మోర్తాడ్ ఆస్పత్రిలో మహిళా ఉద్యోగులను ఓ ఉద్యోగి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. రెండేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఉద్యోగులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఇటీవల డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. ఆయన విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
రెండేళ్లుగా..
మోర్తాడ్ ఆస్పత్రిలోని ఓ ఉద్యోగి మహిళా ఉద్యోగులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపణలున్నాయి. రెండేళ్లుగా తోటి ఉద్యోగులను వేధిస్తున్నట్లు సమాచారం. సదరు ఉద్యోగికి ఆస్పత్రిలో పెద్ద సైజులో నగ్నచిత్రాలను అతికించడం, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం పరిపాటిగా మారింది. తన మాట వింటేనే ఉద్యోగం ఉంటుందని, జీతాలు వస్తాయని హెచ్చరిస్తూ అనుచితంగా ప్రవర్తించేవాడని తెలిసింది. దీంతో మహిళా ఉద్యోగులు ఆస్పత్రికి వెళ్లాలంటేనే జంకే పరిస్థితి వచ్చింది. సదరు ఉద్యోగి వేధింపులతో విసిగిపోయిన ఉద్యోగులు సమస్యను వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. సంఘం నాయకులు 15 రోజుల క్రితం జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్ యోగితారాణాకు ఫిర్యాదు సమర్పించారు.
డీఐవో విచారణ..
మోర్తాడ్ ఆస్పత్రిలో లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్‌వో వెంకట్ ఆదేశాలతో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి రవీందర్ విచారణ చేపట్టారు. వారం రోజులపాటు విచారణ జరిపారు. ఉద్యోగుల వివరాలను, వేధింపులకు సంబంధించిన అంశాలను నమోదు చేసుకున్నారు. విచారణలో సదరు ఉద్యోగి మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించినట్లు తేలినట్లు సమాచారం. నేడో రేపో విచారణ నివేదికను డీఎంహెచ్‌వోకు, కలెక్టర్‌కు అందజేయనున్నట్లు తెలిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఉద్యోగి గతంలో మూడుసార్లు విచారణను ఎదుర్కొన్నాడు. కానీ ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని విచారణ నుంచి బయటపడ్డాడని ఆరోపణలున్నాయి.
రెండు రోజుల్లో నివేదిక
– వెంకట్, డీఎంహెచ్‌వో
మోర్తాడ్ ఆస్పత్రికిలో ఉద్యోగులు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై విచారణ జరపాలని డీఐవోకు సూచించాం. రెండు రోజుల్లో నివేదిక వస్తుంది. దానిని కలెక్టర్ యోగితారాణాకు సమర్పిస్తాం.
Advertisement
Advertisement