బంగారుణం బెంగ
పంట రుణాల మాఫీపై ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తుండడంతో రైతులు అమోమయానికి గురవుతున్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లోని బ్యాంకుల్లో బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదని సర్కారు ప్రకటించిన నేపథ్యంలో అన్నదాతలు మరింత ఆందోళన చెందుతున్నారు. - గంగాధర
- జిల్లాలో బంగారం రుణాలు రూ.234.63 కోట్లు
- గ్రామాల్లో ఇవ్వరు.. పట్టణాల్లో తీసుకుంటే చెల్లదు
- రుణమాఫీపై రోజుకో ప్రకటనతో రైతుల్లో ఆందోళన
గంగాధర : గ్రామాల్లోని చాలా బ్యాంకుల్లో బంగారం తాకట్టుపెట్టుకొని వ్యవసాయానికి పంటరుణాలు ఇవ్వలేదు. ఉదాహరణకు.. గంగాధర మండలంలో ఎస్‌బీహెచ్‌తో పాటు గర్శకుర్తి, బూర్గుపల్లి, గంగాధర చౌరస్తాల్లో మూడు దక్కణ్ గ్రామీణ బ్యాంకు శాఖలు, కురిక్యాల, గంగాధరలోని రెండు సహకార సంఘాలు, గంగాధర చౌరస్తాలో కేడీసీసీ బ్యాంకులు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క బ్యాంకు కూడా బంగారంైపై పంటరుణాలు ఇవ్వలేదు.
అదే రైతులు బ్యాంకులో బంగారం కుదువ పెడితే సాధారణ రుణాలు ఇచ్చారు. వ్యవసాయానికి బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకుంటే తక్కువ వడ్డీ చెల్లించే అవకాశం ఉంటుంది. స్థానిక బ్యాంకులు బంగారం తాకట్టుపై వ్యవసాయ రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు పట్టణాల్లో ఈ రుణాలు పొందారు. పట్టణ బ్యాంకుల్లో బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదని ప్రభుత్వం కొత్త పంథాకు శ్రీకారం చుట్టింది. ఈ నిబంధనతో రైతులు అయోమయానికి గురవుతున్నారు.
కొలిక్కివచ్చేనా..
ప్రభుత్వం ప్రకటించిన రూ. లక్ష పంటరుణమాఫీ పథకం అమలు కొలిక్కి రాలేదు. దీంతో కొత్తరుణ ం కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. వారం రోజుల క్రితం గ్రామాల్లో సభలు నిర్వహించి రుణాలు తీసుకున్న రైతుల పేర్లు చదివి , ఆ జాబితాలను పంచాతీల్లో అతికించారు.ప్రస్తుత జాబితాప్రకారం రుణమాఫీ కావడం లేదని, తుది జాబితాను రూపొందిస్తున్నామని అధికారులు ప్రకటించారు. అయినా ఇంతవరకు ఆ జాబితానే లేదు. రుణమాఫీలో తమ పేరు వస్తుందో లేదోనని రైతులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.