రుణ మాఫీపై మాట తప్పలేదు: పోచారం శ్రీనివాస్ రెడ్డి
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేస్తామని రైతులకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని, వెనక్కితగ్గే ప్రశ్నే లేదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉద్యాన పంటల లక్ష్యాలపై శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. రుణాలకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని బ్యాంకర్లను కోరామని, మాఫీపై త్వరలోనే స్పష్టత వస్తుందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 44 వేల హెక్టార్లలో పండ్లు, కూరగాయలు, పూలు, సుగంధద్రవ్యాలు వంటి ఉద్యాన పంటలను పండించాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు వివరించారు. గత ఏడాది 39 వేల హెక్టార్లు లక్ష్యం కాగా 26 వేల హెక్టార్లలోనే ఉద్యాన పంటలు వేశారని చెప్పారు. ఉద్యానపంటలవైపు మొగ్గుచూపే రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ల వంటి సూక్ష్మ నీటి పరికరాలను సబ్సిడీతో సమకూర్చుతామని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన సన్న చిన్నకారు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం చొప్పున పూర్తి సబ్సిడీ అందిస్తాయని వివరించారు. ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువులకు కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. శనివారం నుంచి గ్రామాల్లోనే సోయా విత్తనాల పంపిణీ జరుగుతుందని, ఇప్పటికే లక్షా 10 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలను జిల్లాలకు తరలించామన్నారు. ఈ నెల 10లోగా అవసరమైన రైతులందరికీ విత్తనాలు అందిస్తామన్నారు. ఖరీఫ్‌లో 17.44 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, 6.50 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
ఉద్యాన వర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు
తెలంగాణలో ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని రాష్ర్ట ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. దీనిపై ప్రతిపాదనలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్ శనివారం ఢిల్లీలో ప్రధానిని కలిసినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలతో పాటు ఉద్యాన వర్సిటీ విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. వర్సిటీ ప్రతిపాదనలను ప్రధానికి అందించనున్నట్లు తెలిసింది.
సర్కార్ వైఫల్యాలను ఎండగట్టండి: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: ‘‘టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఆరు నెలలపాటు టైమిద్దామనుకున్నాం. వాళ్లు అమలు చేసే కార్యక్రమాలను నిశితంగా పరిశీలిద్దామనుకున్నాం. కేసీఆర్ అప్పుడే మనకు చేతినిండా పని కల్పించిండు. షరతులతో కూడిన రుణమాఫీని అమలు చేస్తాన ని రైతులందరినీ రోడ్డు మీదకు తీసుకొచ్చిండు. మనమంతా రైతుల పక్షాన నిలబడి పోరాడుదాం. మీరు కూడా ఇకపై టీఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రతిరోజూ ఎండగట్టండి’’అంటూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీ శ్రేణులకు ఆదేశించారు. గాంధీభవన్‌లో శుక్రవారం జరిగిన అధికారుల ప్రతినిధుల సమావేశంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రజా సమస్యలపై అధికార ప్రతినిధులంతా ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా అధికార ప్రతినిధులకు జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే ఇచ్చినమాట మేరకు రైతులందరికీ రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీ చేసే వాళ్లమని ఆయన వ్యాఖ్యానించారు. రుణమాఫీపై ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాల్సిన బాధ్యత టీఆర్‌ఎస్‌దేనన్నారు.
మాట తప్పినందుకే ఆత్మహత్యలు: వైఎస్సార్‌సీఎల్పీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన టీఆర్‌ఎస్ పార్టీ, ఎన్నికల్లో లబ్ధిపొంది అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడు షరతులు విధించడం తెలంగాణ రైతాంగాన్ని మోసగించడమే అవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం దుయ్యబట్టింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాట తప్పిన కారణంగా తెలంగాణలోని రైతాంగం ఆందోళనకు గురవడంతో పాటు అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొంది. ఈ మేరకు పార్టీ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు, ఉపనేత పాయం వెంకటేశ్వర్లు, విప్ బానోత్ మదన్‌లాల్ నాయక్‌లు సంయుక్తంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలన్నీ సర్కారీ హత్యలుగానే భావించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికైనా రైతుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెంటనే ఎలాంటి షరతులు లేకుండా రూ.లక్ష వరకు రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
వెనక్కు తగ్గితే ప్రజా ఉద్యమమే: కిషన్‌రెడ్డిసాక్షి, హైదరాబాద్: ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రభుత్వం రుణమాఫీని అమలు చేయాలని, వెనక్కు తగ్గితే ప్రజా ఉద్యమం చేపడుతామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీపై స్పష్టత లేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోందని, ఫలితంగా వారు రోడ్డెక్కుతున్నారని చెప్పారు.
మరికొంత మంది ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నారని తెలిపారు. ఏ పార్టీ అయినా ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలపై ముందే సమగ్రంగా కసరత్తు చేయాలని, కానీ ఆ హామీలతో గెలిచాక వాటి అమలుపై షరతులు విధిస్తే ప్రజలు సహించరని పేర్కొన్నారు. రైతుల ఉద్యమానికి తమ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సహకరించాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీని కోరినట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య, రైతులకు విద్యుత్, సాగునీటి ఇబ్బంది, హైదరాబాద్ మినహా మిగతా తెలంగాణలో సమస్యలపై స్పందించాల్సిందిగా కోరినట్టు పలువురు కేంద్ర మంత్రులను కోరినట్లు వివరించారు.