
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: వరి నాటే యంత్రాల పనితీరుపై ఈ నెల 17న రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతులకు ప్రదర్శన, అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ ఉన్నతాధికారులతో శనివా రం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా పోచారం మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో కూలీల కొరత పెరుగుతోందన్నారు. దుక్కి దున్నడానికి ట్రాక్టర్లు, పంట నూర్పిడికి హార్వెస్టర్లను రైతులు విరివిగా వాడుతున్నారని చెప్పారు. రైతుల ఆసక్తికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీ సబ్సిడీలతో ఆయా యం త్రాలను అందిస్తోందని తెలిపారు.
వరి నాట్లు వేయడానికి, ఇతర పంటల విత్తనాలను విత్తే యంత్రాల ఉపయోగం ఇంకా పెరగలేదన్నారు. నాటు యంత్రాలతో కూలీల కొరత తీరడం, సమయానికి నాట్లు వేసుకోవడంతో పాటు రైతులకు ఖర్చులు తగ్గుతాయన్నారు. వ్యవసాయ వర్సిటీలో ప్రత్యేకంగా పెంచిన నారు ద్వారా వరి నాటే యంత్రాల పనితీరును కూడా రైతులకు చూపించాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది ప్రతి మండలానికి సుమారు పది వరి నాటే యంత్రాలను సబ్సిడీపై అందించాలని నిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ ఎం.జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment