శనివారం ఢిల్లీలో కేంద్రమంత్రి రాధామోహన్‌సింగ్ చేతుల మీదుగా ‘స్టేట్ విత్ ర్యాపిడ్ అగ్రికల్చర్ గ్రోత్’ అవార్డును అందుకుంటున్న మంత్రి పోచారం
సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ రంగంలో తక్కువ సమయంలో ప్రగతి సాధించిన రాష్ట్రంగా తెలంగాణను ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే ఎంపిక చేసింది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ‘స్టేట్ విత్ ర్యాపిడ్ అగ్రికల్చర్ గ్రోత్’పురస్కారాన్ని శనివారం ఢిల్లీలో అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇక్కడి తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సమైక్య పాలనలో పాలకుల నిర్లక్ష్యంతో విద్యుత్, సాగు నీరు లేక తెలంగాణలో వ్యవసాయం దారుణంగా దెబ్బతిన్నదన్నారు. స్వయంగా రైతు అయిన కేసీఆర్ రైతుల అవసరాలు తెలుసుకుని నాలుగేళ్లుగా వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తెచ్చారని చెప్పారు. 23 లక్షల విద్యుత్ కనెక్షన్లకు 24 గంటల పాటు కరెంటు సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించేందుకు రూ.లక్షా 50 వేల కోట్లతో గోదావరి, కృష్ణా నదులపై కాళేశ్వరం, సీతారామ, పాలమూరు, రంగారెడ్డి, డిండి వంటి చాలా ప్రాజెక్టులు చేపట్టామన్నారు. మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షణలో ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోందని వివరించారు. 2019 నాటికి అన్ని సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.
రైతుబంధుతో వారికే ఎక్కువ లబ్ధి..
రైతుబంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేశామని, ఈ పథకం కింద అత్యధికంగా లబ్ధి పొందుతోంది చిన్న, సన్నకారు రైతులేనని పోచారం చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణను చేపట్టామని, ఈ ఏడాది వరి నాటు యంత్రాలను అందించనున్నట్లు వెల్లడించారు. రైతులకు అండగా ఉంటూ వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం పాటుపడుతున్నందుకే ఇండియా టుడే అవార్డు దక్కిందని పోచారం తెలిపారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఉద్యానవన శాఖ డైరెక్టర్ ఎల్.వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment