పోస్టర్లను ఆవిష్కరిస్తున్న మంత్రి పోచారం, ఎమ్మెల్యే, కలెక్టర్
సాక్షి,కామారెడ్డి : ఇప్పటికీ గ్రామాల్లో రైతు సమన్వయ సమితుల సమావేశాలు ప్రారంభంకాపోవడంపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఇంకా సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని వ్యవసాయాధికారులపై పండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని జనహిత సమావేశ మందిరంలో సోమవారం జిల్లాలోని మండల, జిల్లా రైతు సమన్వయ సమితుల సభ్యులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ గ్రామ కమిటీల్లో 15 మంది, మండల, జిల్లా కమిటీల్లో 24 మందితో, 42 మందితో రాష్ట్ర రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశామన్నారు. రైతు సమన్వయ సమితుల్లో టీఆర్‌ఎస్ నాయకులను తీసుకున్నారని ఎంతో మంది విమర్శించారని పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలకు అడ్డుపడే వారిని ఎలా తీసుకుంటామని ముఖ్యమంత్రే స్వయంగా విమర్శకులకు సమాధానం ఇచ్చినట్లు గుర్తు చేశారు. రైతు విత్తనం దగ్గరి నుంచి మద్దతు ధరకు అమ్ముకునేవరకు రైతు సమితుల బాధ్యత ఎంతగానో ఉంటుందన్నారు. రైతు సమన్వయ సమితుల్లో సభ్యులుగా ఉండడం అదృష్టమన్నారు. ఏప్రిల్ 25 నుంచి మే 25 వరకు గ్రామాల్లో తిరుగుతూ పాసుపుస్తకాల పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న కోటిన్నర ఎకరాల సాగు భూముల్లో 20లక్షల ఎకరాలు ప్రాజెక్టుల కింద మరో 50 లక్షల ఎకరాలు బోరుబావుల కింద పంటలు సాగు చేస్తున్నారని వెల్లడించారు. మిగతా 80 లక్షల ఎకరాల సాగు భూములను ప్రాజెక్టుల పరిధిలోని తీసుకువచ్చి సస్యశ్యామలం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరులాంటి భారీ ప్రాజెక్టులను సిద్ధం చేస్తుందన్నారు.
రెండు పంటలకు నీరివ్వడమే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. 25 వేల మెగావాట్ల విద్యుదత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. వ్యవసాయ అధికారులు సమావేశాలకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపాలన్నారు. తద్వారా రైతుల అవసరాలు ప్రభుత్వానికి తెలుస్తాయన్నారు. నిధుల కేటాయింపు, సబ్సిడీలు, విత్తనాలు, ఎరువుల ఏర్పాట్లను ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. గ్రామాల్లో రూ.12 లక్షలతో రైతు వేదికలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. అనంతరం వ్యవసాయ, మత్స్యశాఖలకు సంబంధించిన రైతు సంక్షేమ కార్యక్రమాల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, కలెక్టర్ సత్యనారాయణ, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ అంజిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి నాగేంద్రయ్య, ఉ ద్యానవనశాఖాధికారి శేఖర్, మత్స్య శాఖ అధికారిణి పూర్ణిమ, సివిల్ సప్లయ్ కార్పోరేషన్ మేనేజర్ ఇర్ఫాన్, ఆర్డీ వో శ్రీను, రైతు సమన్వయ సమితుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment