వ్యవసాయ అధికారి శ్రీధర్‌తో మాట్లాడుతున్న మంత్రి పోచారం
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ సదస్సుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వేదికగా 16 జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల సమన్వయ సమితులు పది వేల వరకు, రైతులు, వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయాధికారులు, హార్టికల్చర్ సిబ్బంది, కో ఆపరేటివ్ సభ్యులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ప్రాంతీయ సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చకాచకా సాగుతున్నారు. ఈనెల 26న రాష్ట్ర ముఖ్యమంత్రి కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో జరిగే ప్రాంతీయ రైతు సమన్వయ సమితి సదస్సుకు హాజరు కానుండగా, ఏర్పాట్లను శుక్రవారం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తరువాత రైతుల భవిష్యత్తు మార్చడానికి ముఖ్యమంత్రి ఆలోచన విధానమే గ్రామం, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమన్వయ సమితులు అని అన్నారు. ఎకరానికి రెండు పంటలకు ఎనిమిది వేలు ఇవ్వడం, కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వడం దేశానికి ఆదర్శమని మంత్రి తెలిపారు. వ్యవసాయం అంటే కష్టపడి కాకుండా ఇష్టపడి చేయాలని వలసలు తిరిగి వచ్చే విధంగా పంట వేసిన దగ్గర నుంచి ఆమ్మే వరకు అండగా ఉంటామని మంత్రి అన్నారు. ఈ సదస్సు ఉదయం 10.30 గంటల మొదలైన మొదట ముఖ్యమంత్రి సందేశానంతరం మధ్యాహ్న భోజన విరామ సమయం అనంతరం రైతులతో నేరుగా సుదీర్ఘమైన చర్చ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. అలాగే వ్యవసాయాధికారులు రైతులు గ్రీన్, పింక్ కలర్ పేపర్లు ఇచ్చిన గ్రీన్ కలర్ సలహాలు, సూచనలు, పింక్ కలర్ అనుమానాలను నివృత్తి చేసేందుకు ఇవ్వనున్నట్లు చెప్పారు. సదస్సుకు వచ్చి గ్రామాలకు వెళ్లే రైతులు నూతనోత్సాహంతో వ్యవసాయం చేసేందుకు తోడ్పడుతుందని మంత్రి అన్నారు.
అధికారులతో సమీక్ష.. పలు సూచనలు..
ప్రాంతీయ సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అంబేద్కర్ స్టేడియం ఆవరణలో అధికారులతో సమీక్ష జరిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను, బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ ఈఈ రాఘవచారిని ఆదేశించారు. మైకులో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజినీరును ఆదేశించారు. ఎండ తీవ్రత పెరుగుతున్నందునా రైతులకు మంచినీటి సౌకర్యం ఏర్పాట్లు చేయాలన్నారు. కరీంనగర్‌కు వచ్చే అన్ని దారుల్లో స్వాగత తోరణాలు కొబ్బరి మండలు, అరటి ఆకులతో తోరణాలను బ్రహ్మాండంగా చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ కోడూరి రవీందర్‌రావు, జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రావీణ్య, డీఆర్‌వో అయేషామస్రత్‌ఖానమ్, ఆర్‌డీఓ బి.రాజాగౌడ్, ఆర్‌అండ్‌బీ ఈఈ, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, మా ర్కెటింగ్ శాఖ ఉప సంచాలకులు పద్మావతి, కరీంనగర్ ఏసీపీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment