Raithu samanvay committees
-
సుఖేందర్‌రెడ్డి ఫిరాయింపుదారుడు....
సాక్షి, హైదరాబాద్: ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవిని కట్టబెట్టడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన సుఖేందర్‌రెడ్డికి రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవిని ఇవ్వడం చట్ట విరుద్ధమని, నియామక జీవోను రద్దు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, రైతు సమన్వయ సమితి ఎండీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. వీరితోపాటు సుఖేందర్‌రెడ్డిని వ్యక్తిగతహోదాలో ప్రతివాదిగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ‘సుఖేందర్‌రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా రాజీనామా చేయలేదు. లోక్‌సభలో స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కొనసాగుతూ టీఆర్ఎస్లోకి ఫిరాయించడం రాజ్యాంగ విరుద్ధం. అంతేకాక, సమితి అధ్యక్ష పదవి లాభదాయక పోస్టు కిందకే వస్తుంది. కాబట్టి పార్లమెంట్ సభ్యుడిగా గుత్తాకు అనర్హత వర్తిస్తుంది. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని సుఖేందర్‌రెడ్డి నియామకాన్ని రద్దు చేయండి.’అని మధుసూదన్‌రెడ్డి తన పిటిషన్లో కోర్టును కోరారు. -
రైతు సమితుల సమావేశాలెప్పుడు?
సాక్షి,కామారెడ్డి : ఇప్పటికీ గ్రామాల్లో రైతు సమన్వయ సమితుల సమావేశాలు ప్రారంభంకాపోవడంపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఇంకా సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని వ్యవసాయాధికారులపై పండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని జనహిత సమావేశ మందిరంలో సోమవారం జిల్లాలోని మండల, జిల్లా రైతు సమన్వయ సమితుల సభ్యులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ గ్రామ కమిటీల్లో 15 మంది, మండల, జిల్లా కమిటీల్లో 24 మందితో, 42 మందితో రాష్ట్ర రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశామన్నారు. రైతు సమన్వయ సమితుల్లో టీఆర్ఎస్ నాయకులను తీసుకున్నారని ఎంతో మంది విమర్శించారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు అడ్డుపడే వారిని ఎలా తీసుకుంటామని ముఖ్యమంత్రే స్వయంగా విమర్శకులకు సమాధానం ఇచ్చినట్లు గుర్తు చేశారు. రైతు విత్తనం దగ్గరి నుంచి మద్దతు ధరకు అమ్ముకునేవరకు రైతు సమితుల బాధ్యత ఎంతగానో ఉంటుందన్నారు. రైతు సమన్వయ సమితుల్లో సభ్యులుగా ఉండడం అదృష్టమన్నారు. ఏప్రిల్ 25 నుంచి మే 25 వరకు గ్రామాల్లో తిరుగుతూ పాసుపుస్తకాల పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న కోటిన్నర ఎకరాల సాగు భూముల్లో 20లక్షల ఎకరాలు ప్రాజెక్టుల కింద మరో 50 లక్షల ఎకరాలు బోరుబావుల కింద పంటలు సాగు చేస్తున్నారని వెల్లడించారు. మిగతా 80 లక్షల ఎకరాల సాగు భూములను ప్రాజెక్టుల పరిధిలోని తీసుకువచ్చి సస్యశ్యామలం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరులాంటి భారీ ప్రాజెక్టులను సిద్ధం చేస్తుందన్నారు. రెండు పంటలకు నీరివ్వడమే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. 25 వేల మెగావాట్ల విద్యుదత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. వ్యవసాయ అధికారులు సమావేశాలకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపాలన్నారు. తద్వారా రైతుల అవసరాలు ప్రభుత్వానికి తెలుస్తాయన్నారు. నిధుల కేటాయింపు, సబ్సిడీలు, విత్తనాలు, ఎరువుల ఏర్పాట్లను ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. గ్రామాల్లో రూ.12 లక్షలతో రైతు వేదికలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. అనంతరం వ్యవసాయ, మత్స్యశాఖలకు సంబంధించిన రైతు సంక్షేమ కార్యక్రమాల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, కలెక్టర్ సత్యనారాయణ, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ అంజిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి నాగేంద్రయ్య, ఉ ద్యానవనశాఖాధికారి శేఖర్, మత్స్య శాఖ అధికారిణి పూర్ణిమ, సివిల్ సప్లయ్ కార్పోరేషన్ మేనేజర్ ఇర్ఫాన్, ఆర్డీ వో శ్రీను, రైతు సమన్వయ సమితుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
‘రైతు సమన్వయ’ సదస్సుకు చురుగ్గా ఏర్పాట్లు
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ సదస్సుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వేదికగా 16 జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల సమన్వయ సమితులు పది వేల వరకు, రైతులు, వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయాధికారులు, హార్టికల్చర్ సిబ్బంది, కో ఆపరేటివ్ సభ్యులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ప్రాంతీయ సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చకాచకా సాగుతున్నారు. ఈనెల 26న రాష్ట్ర ముఖ్యమంత్రి కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో జరిగే ప్రాంతీయ రైతు సమన్వయ సమితి సదస్సుకు హాజరు కానుండగా, ఏర్పాట్లను శుక్రవారం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తరువాత రైతుల భవిష్యత్తు మార్చడానికి ముఖ్యమంత్రి ఆలోచన విధానమే గ్రామం, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమన్వయ సమితులు అని అన్నారు. ఎకరానికి రెండు పంటలకు ఎనిమిది వేలు ఇవ్వడం, కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వడం దేశానికి ఆదర్శమని మంత్రి తెలిపారు. వ్యవసాయం అంటే కష్టపడి కాకుండా ఇష్టపడి చేయాలని వలసలు తిరిగి వచ్చే విధంగా పంట వేసిన దగ్గర నుంచి ఆమ్మే వరకు అండగా ఉంటామని మంత్రి అన్నారు. ఈ సదస్సు ఉదయం 10.30 గంటల మొదలైన మొదట ముఖ్యమంత్రి సందేశానంతరం మధ్యాహ్న భోజన విరామ సమయం అనంతరం రైతులతో నేరుగా సుదీర్ఘమైన చర్చ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. అలాగే వ్యవసాయాధికారులు రైతులు గ్రీన్, పింక్ కలర్ పేపర్లు ఇచ్చిన గ్రీన్ కలర్ సలహాలు, సూచనలు, పింక్ కలర్ అనుమానాలను నివృత్తి చేసేందుకు ఇవ్వనున్నట్లు చెప్పారు. సదస్సుకు వచ్చి గ్రామాలకు వెళ్లే రైతులు నూతనోత్సాహంతో వ్యవసాయం చేసేందుకు తోడ్పడుతుందని మంత్రి అన్నారు. అధికారులతో సమీక్ష.. పలు సూచనలు.. ప్రాంతీయ సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అంబేద్కర్ స్టేడియం ఆవరణలో అధికారులతో సమీక్ష జరిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను, బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ ఈఈ రాఘవచారిని ఆదేశించారు. మైకులో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజినీరును ఆదేశించారు. ఎండ తీవ్రత పెరుగుతున్నందునా రైతులకు మంచినీటి సౌకర్యం ఏర్పాట్లు చేయాలన్నారు. కరీంనగర్‌కు వచ్చే అన్ని దారుల్లో స్వాగత తోరణాలు కొబ్బరి మండలు, అరటి ఆకులతో తోరణాలను బ్రహ్మాండంగా చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ కోడూరి రవీందర్రావు, జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రావీణ్య, డీఆర్వో అయేషామస్రత్‌ఖానమ్, ఆర్డీఓ బి.రాజాగౌడ్, ఆర్అండ్బీ ఈఈ, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, మా ర్కెటింగ్ శాఖ ఉప సంచాలకులు పద్మావతి, కరీంనగర్ ఏసీపీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
10 తర్వాత అసెంబ్లీ?
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాలను అక్టోబరు 10వ తేదీ తర్వాత నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఇవి సుమారు పది రోజుల పాటు జరగవచ్చంటున్నారు. మార్చిలో బడ్జెట్ సమావేశాలు ముగిసి అక్టోబర్ 30కి 6 నెలలు పూర్తవనుంది. ఆర్నెల్లకోసారి అసెంబ్లీ విధిగా సమావేశమవాలి. ఈ సమావేశాల్లో పలు ఆర్డినెన్సులను సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టవచ్చని చెబుతున్నారు. సమావేశాలు ప్రారంభమయ్యే లోపు రైతు సమన్వయ సంఘాలకు చట్టబద్ధత కల్పించేందుకు ఆరినెన్స్ తేనుందని తెలుస్తోంది. దాన్ని సభలో ప్రవేశపెడతారని అంటున్నారు. అలాగే చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటనలు అసెంబ్లీ సమావేశాలు ముగియగానే మొదలయ్యే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం నుంచి యాత్రకు శ్రీకారం చుట్టే ఆలోచనలో ఆయన ఉన్నట్టు అధికార టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. -
తెలంగాణ సర్కారుకు హైకోర్టు షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తూ జీవో -39 తీసుకురావడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ప్రధానకార్యదర్శి మనోహర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం విచారించింది. నాయకుల కమీషన్ల కోసమే జీవో -39 ను తీసుకొచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది రచనా రెడ్డి అన్నారు. జీవో 39తో రెవిన్యూ వ్యవస్థ బలహీన పడుతుందని వాదించారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరారు. వాదనలు విన్న హైకోర్ట్ రైతు సమితులకు విడుదల చేసిన రూ.500 కోట్లను ఏవిధంగా ఖర్చు చెస్తారో తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు రూ.500 కోట్ల నుంచి ఎలాంటి చెల్లింపులు జరపొద్దంటూ సూచించింది. దీనిపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.