
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాలను అక్టోబరు 10వ తేదీ తర్వాత నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఇవి సుమారు పది రోజుల పాటు జరగవచ్చంటున్నారు. మార్చిలో బడ్జెట్ సమావేశాలు ముగిసి అక్టోబర్ 30కి 6 నెలలు పూర్తవనుంది. ఆర్నెల్లకోసారి అసెంబ్లీ విధిగా సమావేశమవాలి. ఈ సమావేశాల్లో పలు ఆర్డినెన్సులను సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టవచ్చని చెబుతున్నారు. సమావేశాలు ప్రారంభమయ్యే లోపు రైతు సమన్వయ సంఘాలకు చట్టబద్ధత కల్పించేందుకు ఆరినెన్స్ తేనుందని తెలుస్తోంది. దాన్ని సభలో ప్రవేశపెడతారని అంటున్నారు.
అలాగే చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటనలు అసెంబ్లీ సమావేశాలు ముగియగానే మొదలయ్యే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం నుంచి యాత్రకు శ్రీకారం చుట్టే ఆలోచనలో ఆయన ఉన్నట్టు అధికార టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.