రుణమాఫీపై ప్రతిపక్షాలది రాద్ధాంతం
అటవీశాఖ మంత్రి జోగు రామన్న
ఆర్మూర్ అర్బన్, న్యూస్‌లైన్ : పంట రుణాల మాఫీపై రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నాయని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లిలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని,రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నాయని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు ఉద్యమాల పేరుతో రైతులను రోడ్లపైకి తేవడం సరికాదన్నారు. మంత్రులు బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో పంట రుణాలపై వివరాలను సేకరించ లేక పోయామని, బ్యాంకర్లతో సమావేశమై పూర్తి వివరాలను సేకరించి పంట రుణాల మాఫీ హామీని నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు.
దరలు పెంచే ప్రసక్తే లేదని, ఖరీఫ్‌లో సోయా, పత్తి విత్తనాలు, ఎరువులను సకాలంలో రైతులకు పంపిణీ చేస్తామని చెప్పారు. నిజామాబాద్‌లో 70వేల క్వింటాళ్లు, ఆదిలాబాద్‌లో 90 వేల క్వింటాళ్ల సోయా విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. రానున్న ఐదేళ్లు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం సంక్షేమ ఫలితాలపై పూర్థిస్థాయిలో నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తామని తెలిపారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌కు ఒక రైతుగా అన్ని విషయాలపై అవగాహన ఉందని, రైతులకు అన్ని విధాలు మేలు చేస్తారని, ఆందోళన చెందవద్దని తెలిపారు. ప్రతిపక్షాలు చేసే కుట్రలకు రైతులు ఆందోళన చెందవద్దని, ఓపిక పట్టాలని సూచించారు. మంత్రి తొలిసారి ఆర్మూర్ వచ్చిన జోగు రామన్నను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పూలమాలలు, శాలువాతో సన్మానించారు. సమావేశంలో ఇచ్చోడ ఎమ్మెల్యే బాబురావు, నాయకులు ఎల్‌ఎంబీ రాజేశ్వర్, అల్లూరి గంగారెడ్డి, సుంకరి రంగన్న, సాజీద్ అలీ, చెన్న రవి, నయీం, జలందర్, వినయ్ పాల్గొన్నారు.