రుణ మాఫీ..వడ్డీకే సరి | ys jagan mohan reddy speech in warngal by-election | Sakshi
Sakshi News home page

రుణ మాఫీ..వడ్డీకే సరి

Published Thu, Nov 19 2015 1:51 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

రుణ మాఫీ..వడ్డీకే సరి - Sakshi

రుణ మాఫీ..వడ్డీకే సరి

దశలవారీగా మాఫీ అని ఎన్నికలప్పుడు చెప్పలేదు
టీఆర్‌ఎస్ గెలిస్తే ప్రజలను పట్టించుకోరు
కాంగ్రెస్‌కు నాయకులు దొరకడంలేదు
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి
హయగ్రీవాచారి గ్రౌండ్‌లో భారీ బహిరంగసభ

 
వరంగల్ : అధికారంలోకి వస్తే పంట రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఆ తర్వాత మాట మార్చారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దశల వారీగా రుణాలు మాఫీ చేయడం వల్ల వడ్డీ పెరిగిపోయిందని, మాఫీ మొత్తం వడ్డీకే సరిపోతోందని ఆయన పేర్కొన్నారు. లక్ష రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేస్తానని.. రైతులు  రుణాలు చెల్లించవద్దని సాధారణ ఎన్నికలకు ముందు కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఒకేసారి కాకుండా దశల వారీగా నాలుగుసార్లు మాఫీ చేస్తానని సాధారణ ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. పంట రుణాలు పూర్తిగా మాఫీ కాకపోవడంతో అవి రెన్యువల్ కాలేదని, పంట బీమా పథకం అమలుకాని పరిస్థితి నెలకొందని చెప్పారు. పంటలకు కనీస మద్దతు ధర రావడంలేదని, ఈ పరిస్థితులలో వరంగల్ జిల్లాలోనే 150 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే ప్రజల ఇబ్బందులను పట్టించుకోరని చెప్పారు.

వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ తరఫున వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా మూడోరోజు ప్రచారం నిర్వహించారు. బుధవారం వరంగల్ తూర్పు, పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో ప్రచారం జరిగింది. టీఆర్‌ఎస్ నాయకుడు వీరగోని రాజుకుమార్ ఆధ్వర్యంలో గీసుగొండ ఎంపీటీసీ సభ్యురాలు వీరగోని కవిత, ఊకల్ ఎంపీటీసీ సభ్యురాలు పులిశేరి మంజుల, గీసుగొండ పీఏసీఎస్ చైర్మన్ రాము తదితర నేతలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా గీసుగొండ సభలో, సాయంత్రం హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో జరిగిన భారీ బహిరంగసభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. ప్రజల కోసం ఉప ఎన్నిక వస్తే బాగుండేదని, కేసీఆర్ మోజుపడిన వ్యక్తికి పదవి ఇచ్చేందుకు వచ్చిన ఎన్నిక వల్ల రూ.70 కోట్ల ప్రజాధనం వృథా అవుతోందని అన్నారు. వైఎస్సార్ హయాంలో గీసుగొండ, సంగెం మండలాల్లోని 33 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువపై రూ.18 కోట్లతో తాగు, సాగునీటి పథకాన్ని చేపట్టేందుకు శ్రీకారం చుట్టారని చెప్పారు. వైఎస్సార్ హయంలో రూ.9 కోట్లు విడుదల చేశారని, తర్వాత పాలకులు దీన్ని పట్టించుకోలేదని జగన్ చెప్పారు. ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్.. 18 నెలల పాలనలో కేవలం 1600 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారని, దివంగత నేత  వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20.60 లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేశారని గుర్తు చేశారు. రెండు ప్రభుత్వాల మధ్య తేడాను వరంగల్ ప్రజలు కేసీఆర్‌కు గుర్తుకు చేయాలని సూచించారు. సాధారణ ఎన్నికల హామీలను నెరవేర్చని కేసీఆర్ ప్రభుత్వానికి ఉప ఎన్నికలో బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ నీచమైన పార్టీ అని, కాంగ్రెస్ వాళ్లకు అవసరం ఉంటే దండలు వేస్తారని, అవసరం తీరాక బండలు వేస్తారని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌కు ప్రస్తుతం నాయకులు కరువయ్యారని, తెలుగురాని నేతలను తీసుకువచి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మోసం, అబద్ధాలు, వెన్నుపోటుతో పాలన సాగిస్తున్న టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు. సాధారణ ఎన్నికల సమయంలో రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని ఆయన ప్రశ్నించారు. పేదల కోసం తపించిన వైఎస్సార్ ఇప్పటికీ అందరి గుండెల్లో బతికే ఉన్నారని అన్నారు. ప్రతి ఒక్కరికీ మేలు చేసిన వైఎస్సార్ ఆశయాలను కొనసాగించే వైఎస్సార్‌సీపీకే ఓటు అడిగే హక్కు ఉందని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

 ఎస్టీల రిజర్వేషన్లు ఏవీ : ఎమ్మెల్యే పాయం
 ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం మరిచిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని వైఎస్సార్‌సీపీ శాసనసభపక్ష నేత పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సాధారణ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కేసీఆర్.. తర్వాత దీన్ని మరిచిపోయారని అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో వైఎస్సార్‌సీపీకి మంచి స్పందన వచ్చిందని, నల్లా సూర్యప్రకాశ్‌ను గెలిపించాలని కోరారు.
 
 అందుబాటులో ఉంటాను : సూర్యప్రకాశ్
ప్రతి పేదవాడికి మేలు చేయడం లక్ష్యంగా వైఎస్సార్ ఆశయ సాధన కోసం పనిచేస్తానని వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. ఉప ఎన్నికలో గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి వరంగల్‌కు రావడంతోనే వర్షం కురిసిందని, ఇది పార్టీకి ప్రజల్లో ఉన్న సానుకూలతను స్పష్టం చేస్తోందని చెప్పారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారె డ్డి మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎడ్మ కిష్టారెడ్డ్డి, పి.శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, మతిన్‌మజాదాది, హెచ్.ఎ.రహెమాన్, గున్నం నాగిరెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు కొండా రాఘవరెడ్డి, ప్రొగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, రాష్ట్ర కార్యదర్శులు బి.రఘురాంరెడ్డి, జి.రాంభూపాల్‌రెడ్డి, జి.శ్రీ దర్‌రెడ్డి, ఎం.విలియమ్, బి.శ్రీనివాసరావు, ఎ.కుమార్, షర్మిల సంపత్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు నాడెం శాం తికుమార్, టి.భీమయ్యగౌడ్, సంపత్, సలీం, రాష్ట్ర మైనా ర్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ముస్తాఫా ముజతబా, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బీష్వ రవీందర్, రాష్ట్ర డాక్ట ర్స్ విభాగం అధ్యక్షుడు పి.ప్రపుల్లారెడ్డి, రాష్ట్ర నాయకులు సంతోశ్‌రెడ్డి, సుమిత్‌గుప్తా, రాష్ట్ర నాయకులు అమర్‌నాథ్‌రెడ్డి, సంజీవరావు, వేల్పుల విజయప్రసాద్, క్రిస్టోలైట్, బొడ్డు సాయినాథ్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి.సురేశ్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర నాయకులు మెరుగు శ్రీనివాస్‌రెడ్డి, సందీప్‌కుమార్, ఉపేందర్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, వెంకటేశ్వరరెడ్డి, జిల్లా నాయకులు ఎం.కళ్యాణ్‌రాజ్, చల్లా అమర్‌నాథ్‌రెడ్డి, నెమలిపురి రఘు, డి.దామోదర్‌రెడ్డి, ఎం.అశోక్, కాయిత రాజ్‌కుమార్, సాంబయ్యగౌడ్, కౌటిల్‌రెడ్డి, సంగాల ఇర్మియా, ఎస్.ప్రభాకర్‌రెడ్డి, డి.ప్రకాశ్, బొడ్డు శ్రవణ్, నాగపురి దయాకర్, ఉదయ్, ఆరెపల్లి రాజు, ఎం.సిద్ధార్థ్ తదితరులు పాల్గొన్నారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement