రెండో రోజూ రైతన్న పోరు
రుణమాఫీ ఆంక్షలపై ..రాస్తారోకోలు,
కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం
ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్, బీజేపీ నేతలు
పంట రుణాల మాఫీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును నిరసిస్తూ జిల్లాలో రెండు రోజులుగా ఆందోళనలు కొనసాతున్నాయి. 2013 జూన్ నుంచి పంట రుణాలు తీసుకున్న వారికే రుణ మాఫీ వర్తింప చేస్తామనడాన్ని రైతులందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. శుక్రవారం జిల్లాలోని పలు మండలాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. కేసీఆర్ దిష్టిబొమ్మలను ద హనం చేశారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ హామీ ఇ చ్చినట్లుగా రూ. లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశా రు. ముప్కాల్, బుస్సాపూర్‌లోని 44వ నంబరు జాతీ య రహదారిపై రైతులు పెద్ద ఎత్తున బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఆర్మూర్, పెర్కి ట్ శివారులోనూ రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. నందిపేట మండల కేంద్రంలో రైతులు, కాంగ్రెస్ నాయకులు వేరువేరుగా రాస్తారోకోలు చేశారు. కేసీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేసి రుణమాఫీపై స్పష్టత ఇచ్చే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కామారెడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. సదాశివనగర్ మండలం లింగంపేటలో రోడ్డుపై బీజేపీ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి రుణమాఫీపై స్పష్టత వచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బాన్సువాడ నియోజక వర్గంలోని నసురుల్లాబాద్‌లో రైతులు రోడ్డెక్కి తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. వర్ని మండలం గోవూరు గ్రామంలో రైతులు ధర్నా చేశారు. కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు రాస్తారోకో చేశారు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని గాంధారి మండల కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు వేర్వేరుగా ఆందోళనలు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, ఇతర నాయకులు రైతులతో కలిసి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు తరలివచ్చి ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ ప్రద్యుమ్నకు వినతిపత్రాన్ని సమర్పించారు. పంటరుణాలు మాఫీ చేసే వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేస్తున్నాడని విమర్శించారు.