సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధంగా ఉందని సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ పాలనా విధానాలను ఎండగట్టిన ఆయన.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా విమర్శలు గుప్పించారు.
‘బీజేపీ ప్రభుత్వ విధానాలు దారుణంగా ఉన్నాయి. ఆ పార్టీలో చదువుకున్న నేతలు లేరు. పేదల బాగోగుల గురించి ఆలోచించరు. మతాంతర వివాహం చేసుకున్న జంటను పాస్ పోర్ట్ విషయంలో అష్టకష్టాలకు గురి చేశారు. పాస్ పోర్ట్ రీ వెరిఫికేషన్ పేరిట వివక్ష ప్రదర్శించారు. మోదీ అనుచరులు, స్మృతి ఇరానీ(కేంద్ర మంత్రి) అనుచరులు ఆ జంటను పత్రికల్లో రాయలేని పదజాలంతో సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ఇలాంటి వాళ్లు నియంత మనస్తత్వం కలిగి ఉంటారు. అల్ప సంఖ్యాక వర్గాలను అణగదొక్కేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో దూషణలకు దిగేవారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది’ అని జైపాల్‌రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా పెట్రోలియం రేట్లు పెరిగిపోతున్నాయని, టాక్స్‌ను కూడా ప్రభుత్వం తగ్గించలేకపోతోందని విమర్శించారు. ‘పెట్రోల్ టాక్స్‌ల ద్వారా ద్రవ్య లోటు పూడ్చాలని ఈ ప్రభుత్వం యత్నిస్తోంది. కానీ, పెట్రోల్ రేట్లు పెరిగితే అన్ని వస్తువులపై ధరలు పెరుగుతాయి. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి’ అని ఆయన అన్నారు.
‘కేసీఆర్ పని పడతాం’... ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, ఎన్నికలయ్యాక కేసీఆర్ పనిపడతామని ఆయన అంటున్నారు. ‘కేసీఆర్ తనకు తానే తెలివైనోడిని అనుకుంటున్నాడు. అందరినీ మోసం చేయగలను భావిస్తున్నాడు. ఓవైపు మోదీతో దోస్తాన్ చేస్తున్నాడు. మరోవైపు ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావుడి చేస్తున్నాడు. ఇప్పుడా ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడుంది?’ అని జైపాల్‌రెడ్డి నిలదీశారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ చాలా బలహీనంగా ఉందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment