- కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి
- అబద్ధాలు, మోసం కేసీఆర్ అసలు నైజం
- కేసీఆర్‌కు మోదీ అంటే భయం
- బీజేపీ, టీఆర్‌ఎస్ మినహా ఎవరితోనైనా కలుస్తాం..
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బహురూపి అని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవితో కలసి గురువారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ అబద్ధాలు, మోసగించడం, అవకాశవాదం కేసీఆర్ అసలు నైజం అని విమర్శించారు. అవసరాన్ని బట్టి కమ్యూనిస్టుగా, నక్సలైటుగా మాట్లాడుతారని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, లక్ష కోట్ల రూపాయలను తెలంగాణ అభివృద్ధికి ఇచ్చామని అంటే సీఎం కేసీఆర్ ఏదో యుద్ధం చేసినట్టు మాట్లాడారని అన్నారు. ఇదంతా లాలూచీ కుస్తీ అని ఆయన కొట్టి పారేశారు. బీజేపీతో కేసీఆర్‌కు రహస్యఒప్పందం ఉందని, అది 2009 నుంచే కొనసాగుతోందని పేర్కొన్నారు. బీజేపీతో కేసీఆర్‌కు వైరముంటే రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీయే వ్యతిరేకకూటమికి మద్దతు ఇస్తారా అని ప్రశ్నించారు.
మోదీ,–కేసీఆర్ లాలూచీ..
సీఎం కేసీఆర్ బీజేపీతో పోరాటం చేస్తున్నట్టు ప్రజలకు భ్రమలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారని జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వైరం లేదని, అమిత్ షా తోనే పంచాయతీ వచ్చిందని కేసీఆర్ మాట్లాడటం దీనికి నిదర్శనమన్నారు. మోదీ,–కేసీఆర్‌ది లాలూచీ కుస్తీ వంటిదన్నారు. బీజేపీ పాము అయితే నరేంద్ర మోదీ పడగ అని, అమిత్ షా తోక అని జైపాల్‌రెడ్డి విశ్లేషించారు. అమిత్ షా మూడు రోజుల పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని, అమిత్ షా లెక్కలన్నీ కాకిలెక్కలేనని అన్నారు.
టీటీడీపీ అంటే వ్యతిరేకత లేదు...
రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులన్నీ కలసి పోటీచేసే అవకాశాలున్నాయని జైపాల్‌రెడ్డి వెల్లడించారు. ఈ రెండు పార్టీలు మినహా ఎవరితోనైనా కలుస్తామన్నారు. కాగా, టీటీడీపీపై తమకు వ్యతిరేకత ఏమీ లేదన్నారు. అప్పటి అవసరాలను, పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పొత్తుల గురించి మాట్లాడటానికి ఇంకా చాలా సమయం ఉందన్నారు. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏర్పాటు భ్రాంతి అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో వస్తే కాంగ్రెస్, లేకుంటే టీఆర్‌ఎస్ అని అన్నారు. మూడోపార్టీకి, కూటమికి అవకాశమేలేదన్నారు.
మోదీ అంటే కేసీఆర్‌కు భయం
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని జైపాల్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, ఆయన మంత్రుల అవినీతి, వారు కూడబెట్టిన సంపదకు సంబంధించిన లెక్కలన్నీ మోదీ దగ్గర ఉన్నాయన్నారు. ఐటీ, ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీల వద్ద ఉన్న లెక్కలకు సీఎం కేసీఆర్ ఆందోళన చెందుతున్నారన్నారు. దానివల్లే మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్ మాట్లాడలేకపోతున్నారని జైపాల్‌రెడ్డి ఆరోపించారు.