కేసీఆర్ పగటి కలల వ్యాపారి
‘మీట్ ది ప్రెస్’లో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి
► తెలంగాణ ఏర్పాటులో ఆలస్యం వల్ల గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నష్టం
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ పగటి కలల వ్యాపారి అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ శనివారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. ఆచరణ సాధ్యంకాని హామీలను ఇచ్చి, వాటితో ప్రజలకు పగటి కలల ప్రపంచాన్ని చూపి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. ఒంటరిగా ఎన్నికలకు పోవడానికి కేసీఆర్ భయపడ్డారని, అందుకే ఆచర ణ సాధ్యంకాని హామీలన్నీ ఇచ్చారని ఆరోపించా రు.
తెలంగాణ ఏర్పాటును అధిష్టానం ఆలస్యం చేయడం, టీఆర్‌ఎస్‌ను విలీనం చేసే విషయమై కాంగ్రెస్ స్థానిక నాయకులు అధిష్టానాన్ని తప్పు దారి పట్టించడం వల్ల గత ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగిందని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పటిదాకా ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పటికే వివిధ దశల్లో ప్రభుత్వ, బంజరు, సాగు భూము లను ప్రభుత్వం పంచిందని, కొత్తగా ఇవ్వడానికి భూమి లేదని, కొత్తగా భూమిని సృష్టించడానికి కేసీఆర్ బ్రహ్మా అని ప్రశ్నించారు.
రుణమాఫీ విధా నం సరిగా లేకపోవడంతో వడ్డీల భారం రైతులపై పడిందని ఆరోపించారు. బ్యాంకుల్లో మరోసారి రుణాలు తీసుకోవడానికి అవకాశం లేకుండా చేశారని విమర్శించారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ ఆచరణ సాధ్యంకాని హామీలనే ఇచ్చారని విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎం కేసీఆర్ గతంలో మంచి దోస్తులని, అందుకే ఓటుకు కోట్లు కేసు వంటివాటిపై ఏం మాట్లాడలేనని తెలిపారు.
ప్రజలకు దండగ.. కేసీఆర్‌కు పండగ
ఇప్పుడున్న సచివాలయం పూర్తిగా నింపడానికే ప్రభుత్వానికి శక్తి చాలదని, కొత్త సచివాలయం అవ సరం లేదని జైపాల్‌రెడ్డి అన్నారు. సచివా లయంలోని భవనాలన్నీ కొత్తవే అయినా వాటిని వదిలిపెట్టి కొత్త సచివాలయం ఎందుకని ప్రశ్నించారు. కొత్తగా ఏమైనా నిర్మిస్తే తప్ప తనకు ఆదాయం రాదనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. ప్రజలకు దండగ అయితే కేసీఆర్‌కు పండుగని ఎద్దేవా చేశారు. చరిత్రను ధ్వంసం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని ధ్వజమెత్తారు.
గతంలో చంద్రబాబు, ఇప్పుడు కేసీఆర్.. హైదరా బాద్‌ను తామే నిర్మించినట్టుగా, అంతకుముందు హైదరాబాద్ అనేదే లేనట్టుగా చెప్పుకునే ప్రయ త్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ధనిక రాష్ట్రం కాదని, కేవలం రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రం మాత్రమేనని వివరించారు. హైదరాబాద్ వల్ల రూ.25 వేల కోట్ల ఆదాయం తెలంగాణకు వస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ కేసీఆర్ చేశారా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలోని మొత్తం విద్యుత్‌లో 54 శాతం తెలం గాణకు ఇవ్వాలని బిల్లులో నాటి కేంద్ర ప్రభుత్వం పెట్టడం వల్లనే తెలంగాణలో మిగులు విద్యుత్ ఉందని వివరించారు.
అమెరికాలో ట్రంప్.. భారత్‌లో మోదీ
అమెరికాలో ట్రంప్‌నకు, భారత్‌లో మోదీకి తేడా లేదని జైపాల్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీ యంగా ఆయిల్ ధరలు పడిపోవడంతో కేంద్ర ప్రభుత్వానికి ఏటా రూ.1.20 లక్షల కోట్లు ఆదా అయినా వినియోగదారులకు మాత్రం తగ్గించలేదన్నారు. స్వాతంత్య్ర పోరాట కాలం లోనే గోవధ నిషేధం కాంగ్రెస్ అజెండాలోని అంశమని, అమలు బాధ్యత రాష్ట్రాలకు వదిలిపెట్టామన్నారు. ఇలాంటి లోతైన అంశా ల్లో దేశంలో రాజకీయ సైద్ధాంతిక నిరక్షరాస్యత పెరిగిందని తెలిపారు.