హైదరాబాద్ : బంగారు తెలంగాణ పేరుతో భారీ గా దోపిడీకి కేసిఆర్ ప్రభుత్వం కార్యాచరణకు పూనుకుంటుందని నోట్ల కోసం కాంట్రాక్ట్ పనులు, ఓట్ల కోసం పథకాలను రూపకల్పన చేసి ప్రజలను మోసం చేస్తున్నాడని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యధ్యక్షులు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్బంగా గాంధీభవన్‌లో సోనియగాంధీ కృతజ్ఞతా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా ముందుగా గాంధీభవన్ ఆవరణలో జాతీయ పతాకాన్ని భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ 99 శాతం హామీలు పూర్తి చేశామని కేసిఆర్ నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన సాగునీటి పనులను ఇంకా పూర్తి చేయలేదని అన్నారు. రీ డిజైన్ పేరుతోను, మిషన్ భగీరథ, కాకతీయలో దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల టెండర్లు వేస్తున్నారని, దాదాపు లక్ష కోట్ల రూపాయల దోపిడీకి సిద్దమవుతున్నారని భట్టి ఆరోపించారు. ఇచ్చిన హామీలు పూర్తి చేశామని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇకపోతే ప్రసార మాధ్యమాలు ప్రతిపక్ష పాత్ర పోషించాలని, లేకపోతే ప్రజాసామ్యంలో చీకటి రోజుల వస్తాయని ఆయన అన్నారు. పత్రికా యాజమాన్యాలు భయపడవద్దని, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ముంపు బాధితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని భట్టి తెలిపారు.
కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తెచ్చిన ఘనత కేసిఆర్ది కాదని, కేసిఆర్ దొంగ దీక్ష చేశారని, ఆయన చేసిన దీక్షకు సంబంధించిన సమాచారమంతా నిమ్స్‌లో ఉందని అన్నారు. కేసిఆర్ నరేంద్రమోడీతో రహస్య ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. కేసిఆర్ మంచి వ్యాపారి అని, ఆయనకు ఏదైనా పని ఉంటే తప్ప ఎవరిని పొగడరని జైపాల్ రెడ్డిఅన్నారు. మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ రెండేళ్ళలో కేసిఆర్ చేసిందేమీ లేదని, సోనియా గాంధీ వల్లనే తెలంగాణ సాధ్యమైందని అన్నారు. కేసిఆర్ తెలంగాణకు శనిలా దాపురించారని ఆయన విమర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలనపై అందరిలో అసంతృప్తి నెలకొని ఉందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి తమ పార్టీ నేతల వ్యాఖ్యలే కారణమన్నారు.
మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ కేసిఆర్ నియంత పాలన చేస్తున్నారని మండిపడ్డారు. క్యాబినెట్లో తెలంగాణ ద్రోహులే అధికంగా ఉన్నారని ఆయన విమర్శించారు. ఇంకా సమావేశంలో సిఎల్పీ నేత జానారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, నర్సారెడ్డి, మాజీ మంత్రి శశిధర్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ లతోపాటు పలువురు ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, పాల్గొన్నారు. కాగా తెలంగాణ ఉద్యమ కారులను సన్మానించారు. అనంతరం ప్రకాశం హాల్లో టిపిసిసి ప్రధాన కార్యదర్శి అఫ్జలుద్దీన్ నేతృత్వంలో సమావేశం జరిగింది.
'కేసీఆర్ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు'
Published Thu, Jun 2 2016 3:35 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement